గ్వాంగ్‌జౌ: విపరీతమైన ఆఫీసు పని ఒత్తిడి ఒక యువకుడి ప్రాణాలను కబళించింది. చైనాలోని గ్వాంగ్‌జౌలో చోటుచేసుకున్న ఒక విషాదకర ఘటన టెక్ ఉద్యోగులపై పడే విపరీతమైన పని ఒత్తిడిని మరోసారి తెరపైకి తెచ్చింది. 32 ఏళ్ల ప్రోగ్రామర్ గావో గ్వాంగ్ హూయ్ వారాంతపు సెలవు దినమైన శనివారం నాడు కూడా ఇంటి నుండే విధులు నిర్వర్తిస్తూ కుప్పకూలిపోయాడు.
విపరీతమైన పని ఒత్తిడి కారణంగానే గావో గ్వాంగ్ హూయ్ అస్వస్థతకు గురయ్యాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శనివారం ఉదయం పనిలో నిమగ్నమై ఉండగా, అకస్మాత్తుగా స్పృహ కోల్పోయిన గావోను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందించినప్పటికీ, ఆయన ప్రాణాలు దక్కలేదు. ఈ ఘటన చైనా సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశంగా నిలిచింది.
గావోను ఉదయం 9:46 గంటల సమయంలో గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్షియల్ హాస్పిటల్ ఆఫ్ ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్‌కు తరలించినట్లు ఆస్పత్రి రికార్డులు వెల్లడిస్తున్నాయి. వైద్యులు ఆయనను కాపాడేందుకు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో బాధితుడు క్లినికల్‌గా మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. అతని మరణానికి ప్రధాన కారణం ‘సడన్ రెస్పిరేటరీ అండ్ కార్డియాక్ అరెస్ట్’ (శ్వాస మరియు గుండె ఆగిపోవడం) అని వైద్యులు ధృవీకరించారు. దీనికి ‘స్టోక్స్-ఆడమ్స్ సిండ్రోమ్’ కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇది గుండె కొట్టుకోవడంలో తీవ్రమైన అంతరాయాల వల్ల సంభవించే ప్రాణాంతక పరిస్థితి అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఈ ఉదంతంలో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే ఆస్పత్రిలో గావో ప్రాణాల కోసం పోరాడుతున్న సమయంలోనే ఆఫీసు వర్గాలు ఆయనను 'వీ చాట్’ టెక్నికల్ వర్క్ గ్రూప్‌లో యాడ్ చేసి, వర్క్ అప్పగించాయి. గావో మరణించిన రోజున కూడా ఆయన ఐదు సార్లు కంపెనీ సిస్టమ్‌లోకి లాగిన్ అయినట్లు డేటా ద్వారా తెలుస్తోంది. ఈ వ్యవహారం దరిమిలా సంస్థ పని తీరు, అమానవీయ వైఖరిపై తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
గావో మృతికి పనిభారమే కారణమని ఆయన భార్య యాంగ్ ఆరోపించారు. డిపార్ట్‌మెంట్‌లో సిబ్బంది కొరత కారణంగా, ఆరుగురు చేసే పనిని గావో ఒక్కడే చేయాల్సి వచ్చేదని ఆమె వాపోయారు. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌తో పాటు సేల్స్, మేనేజ్‌మెంట్ బాధ్యతలు కూడా ఆయనపై ఉండేవని, రాత్రి 11 గంటల వరకు పనిచేయడం సర్వసాధారణమైపోయిందని ఆమె తెలిపారు. ఈ ఘటనపై ‘వర్క్-రిలేటెడ్ ఇంజ్యూరీ’ (పని సంబంధిత గాయం) కింద కేసు నమోదు చేసి, సంబంధిత అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: 40 ఏళ్లకే రిటైర్మెంట్? వణికిస్తున్న ‘లే-ఆఫ్’లు


