ధ‌ర చుక్క‌ల్లో.. చ‌దివింపుల గుబులు! | Gold rate hike impact on middle class families return gifts case study | Sakshi
Sakshi News home page

బంగారం భ‌గ‌భ‌గ‌.. మధ్యతరగతి విల‌విల‌

Jan 29 2026 7:23 PM | Updated on Jan 29 2026 7:35 PM

Gold rate hike impact on middle class families return gifts case study

కుటుంబ ఆనవాయితీలపై ప‌సిడి ధ‌ర‌ తీవ్ర ప్రభావం

శుభకార్యాల్లో కానుకలకు గృహిణుల సందిగ్ధం

ఆర్థిక భారంగా మారుతున్న రిటర్న్‌ గిఫ్ట్స్‌ 

ప్రత్యామ్నాయ బహుమతుల వైపు మధ్యతరగతి మొగ్గు

కంచు మోగినట్లు కనకంబు మోగునా.. అన్న వేమన పద్యం మనందరికీ సుపరిచితమే.. అయితే ప్రస్తుతం అదే బంగారం మార్కెట్‌లో ధరల మోత మోగిస్తోంది. అంతేకాదు.. బంగారం గొప్పతనం తెలియస్తూ.. బంగారం కొద్దీ సింగారం, ఇంటికి ఇత్తడి, పొగరుకు పుత్తడి, మెరిసేదంతా బంగారం కాదు.. అన్న సామెతలూ వినే ఉంటాం. దీంతో పాటు సమాజంలో శాంతి, శ్రేయస్సు, సాంస్కృతిక, సాంకేతిక పురోగతి సాధించిన సమయాన్ని ‘స్వర్ణయుగం’ (గోల్డెన్‌ ఎరా)తో పోల్చుతుంటారు. ఇప్పుడిదంతా ఎందుకు అనేగా మీ సందేహం..! మార్కెట్‌లో రోజు రోజుకూ పెరుగుతున్న బంగారం ధరలు సమాజం, కుటుంబ ఆచారాలు, శుభకార్యాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో రానురాను బంగారానికి పెరుగుతున్న విలువ, ఫలితంగా ఏర్పడే సమస్యలపై కేస్‌ స్టడీ.. 

‘మూడేళ్ల క్రితం జనవరిలో మా గృహప్రవేశానికి మా మరిది కుటుంబం మాకు తులం బంగారం కానుకగా పెట్టారు. అప్పుడు ధర రూ.55 వేలుగా ఉంది. వచ్చే వారం వాళ్లింట్లో శుభకార్యం ఉంది. ఆనవాయితీ ప్రకారం వాళ్ల బంగారం వాళ్లకు అప్పజెప్పాలి. కానీ, ఇప్పుడేమో పసిడి రేటు రూ.1.70 లక్షలు దాటింది. దీంతో ఏం చేయాలో అర్థంకావట్లేదు’ అంటూ పీర్జాదిగూడకు చెందిన గృహిణి హిందుమతి చెబుతున్నారు..  

అనాదిగా వస్తున్న సంప్రదాయం.. 
భారతీయ కుటుంబాల్లో శుభకార్యాల సమయంలో కానుకలు, చదివింపులు, బహుమతులు అందజేయడం ఆనవాయితీ. అనాదిగా వస్తున్న ఈ ఆచారంలో భాగంగా.. వివాహాలు, గృహప్రవేశాలు, పండుగల సమయంలో కానుకలు, బహుమతుల రూపంలో బంగారానికి, వెండికి ప్రాధాన్యత ఇచ్చేవారు. క్రమంగా ఇది తెలుగు సంస్కృతిలో భాగమైపోయింది. మధ్యతరగతి కుటుంబాల్లో శుభకార్యాల్లో ఇది మరింత ఎక్కువ. ఇలా తీసుకున్న వాటిని తిరిగి వారి శుభకార్యాల సమయంలో అప్పజెప్పడం మామూలే. అయితే పసిడి ధరల పెరుగుదల ఈ ఆనవాయితీపై ప్రభావం చూపుతోంది. గతంలో బంధువులు పెట్టిన బంగారం.. మళ్లీ ఇప్పుడు చదివించాలంటే మధ్యతరగతికి భారంగా మారుతోంది.

తగ్గిన ఆభరణాల మార్కెట్‌.. 
బంగారానికి, మహిళలకు అవినాభావ సంబంధం. ఏడాది కాలంగా ధరల పెరుగుదల మధ్యతరగతి మహిళల అభిరుచిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎక్కువగా ఆభరణాలు వినియోగించే ఈ తరగతి ప్రజలు వాటిని క్రమంగా తగ్గించుకునే పరిస్థితి. దీంతో అనాదిగా వస్తున్న వివాహ సంబంధమైన ఆభరణాల డిమాండ్‌ కూడా 30 శాతం వరకు తగ్గింది. నాలుగేళ్ల గణాంకాలతో పోలిస్తే ప్రస్తుతం బంగారం (Gold) కొనుగోలుకు రూ.6 నుంచి 7 లక్షలు అదనంగా వెచ్చించాల్సిన పరిస్థితి.

ఈ ఏడాది రూ.2 లక్షల మార్క్‌..?
గతేడాది ఆగస్టు 22న తొలిసారి తులం బంగారం ధర రూ.లక్ష దాటింది. అక్కడినుంచి పసిడి ధర పరుగులు పెడుతూనే ఉంది. రోజుకు రూ.2 వేల చొప్పున వృద్ధి చెందుతూ.. పస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,78,850కు చేరింది. 2022 జనవరిలో రూ.50 వేల మార్క్‌ను దాటిన గోల్డ్‌ ధర.. లక్షకు చేరేందుకు మూడేళ్ల సమయం పట్టింది.. కేవలం ఏడాది వ్యవధిలోనే రూ.1.50 లక్షల మార్క్‌ను దాటింది. ఈ ఏడాది 10 గ్రాముల ధర రూ.2 లక్షలకు చేరే అవకాశం ఉందని నిపుణుల అంచనా.  ‘గత వారం మా మేనకోడలి శారీ ఫంక్షన్‌ జరిగింది. ఏడాది క్రితం మా ఇంట్లో శుభకార్యానికి మా అన్నయ్య బంగారం పెట్టాడు. ఇప్పుడు వాళ్లింట్లో ఫంక్షన్‌కు మేం తిరిగి అప్పజెప్పక తప్పదు. బంగారం ధర ఎక్కువగా ఉండటంతో తప్పని పరిస్థితుల్లో దీనికి బదులుగా డబ్బు రూపంలో కట్నం చదివించాం.’ అంటూ హబ్సిగూడకు చెందిన స్వాతి వాపోతున్నారు.

ఇటీవలి కాలంలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో మధ్యతరగతి గృహిణుల ఆలోచనా సరళి క్రమంగా మారుతోంది. కుటుంబ శుభకార్యాల్లో బంగారం చదివింపులకు పునరాలోచనలో పడుతున్నారు. పసిడికి బదులుగా నగదు, గృహోపకరణాలు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలవైపు అడుగులు వేస్తున్నారు. మరోవైపు వెండి కూడా పసిడితో పోటీపడుతోంది. కాస్తోకూస్తో మధ్యతరగతి (middle class) ప్రజలకు అందుబాటులో ఉన్న వెండి కాస్తా రయ్‌ మంటూ దూసుకుపోతోంది. ఒకప్పుడు రూ.40వేలకు లభ్యమయ్యే కిలో సిల్వర్‌ నేడు రూ.4.25 లక్షలకు చేరింది. దీంతో వెండి కొనడం కూడా కలగానే మారే పరిస్థితి. దీన్ని కూడా తులాల రూపంలో తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.  – సాక్షి, హైద‌రాబాద్‌ సిటీబ్యూరో

చ‌ద‌వండి: ఊహించ‌ని స్థాయికి వెండి ధ‌ర‌లు

బంగారం కొనడం సెంటిమెంట్‌.. 
ఉగాదితో పండుగల సీజన్‌ మొదలుకానుంది. సాధారణంగా పండుగల సీజన్‌లో బంగారం కొనడం మహిళలు సెంటిమెంట్‌గా భావిస్తుంటారు. మధ్యతరగతి గృహిణులు ఎంతోకొంత బంగారం కొనడం ఆనవాయితీ. అయితే కొంతకాలంగా పసిడి కొనేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదు. 
– వేణుగోపాల్‌ చారి, బంగారం వ్యాపారి, సిద్దిఅంబర్‌ బజార్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement