పైల్స్‌ నుంచి ఫ్రీ అవండి ఇలా... | Hemorrhoids: Symptoms Causes And Treatment | Sakshi
Sakshi News home page

పైల్స్‌ నుంచి ఫ్రీ అవండి ఇలా...

Mar 15 2026 3:38 PM | Updated on Mar 15 2026 4:48 PM

Hemorrhoids: Symptoms Causes And Treatment

ముళ్ల మీద కూర్చోవడం అనే మాట వాడుకగా వాడుతుంటారు. మొలల సమస్య ఉంటే ఈ మాట అక్షరాలా నిజమే అనిపిస్తుంది. ‘మొల’ అంటే మేకు అని అర్థం. ఆకృతిలోనూ అవి మేకును పోలి ఉంటాయి. అలాగే కూర్చునే చోట నిజంగా మేకులే ఉంటే ఎంత సమస్యగా ఉంటుందో తెలుసు కాబట్టే ఈ సమస్యకు ఆ పేరొచ్చిందేమో అనిపిస్తుంటుంది. మలద్వారం దగ్గర వచ్చే మొలల సమస్యను ఇంగ్లిష్‌లో పైల్స్‌ అనీ, హిమరాయిడ్స్‌ అని అంటారు. ఈ సమస్యకు కారణాలు, నివారణ, చికిత్స వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. 

మలద్వారం దగ్గరి కణజాలంలో రక్తనాళాలు చాలా ఎక్కువ. ఒకరకంగా ఇది దేహానికి చివరి ప్రాంతం కూడా కావడంతో ఇక్కడ పెద్ద ఎత్తున రక్తనాళాలు ఎక్కువ సంఖ్యలో అల్లుకు΄ోయినట్టుగా ఉంటాయి. కొందరిలో ఈ రక్తనాళాలు వ్యాకోచించినట్లుగా అయి ఉబ్బి బుడిపెలా మారతాయి. 

ఇలా బుడిపెలుగా వచ్చే వాటిని తెలుగులో మొలలు అనీ మూలశంక అని వ్యవహరిస్తుంటారు. ఇవి కొందరిలో మల ద్వారం నుంచి బయటకూ వచ్చేసి బాధిస్తుంటాయి. ఒక్కోసారి కొందరిలో ఆ బుడిపెలు  ఒరుసుకు΄ోవడం వల్ల ఒక్కోసారి రక్తస్రావమూ అవుతుంటుంది. మలద్వారం వద్ద తీవ్రమైన దురదా నొప్పీ కూడా ఉంటాయి. వెరసి అవన్నీ కూర్చోనివ్వకుండా, కదల్లేకుండా బాధపెడుతుంటాయి. కారణాలు... మలద్వారం వద్ద రక్తనాళాల వాపునకు కారణమైన ఏ అంశాల వల్లనైనా ఇవి రావచ్చు. ఉదాహరణకు...

కడుపులో ఒత్తిడి పెరగడం (మలబద్ధకం ఉన్నవాళ్లు ముక్కుతూ విసర్జన చేయడానికి ప్రయత్నించడంతో అక్కడి రక్తనాళాల్లో ఒత్తిడి పెరగడం మొలలకు ప్రధాన కారణం)

స్థూలకాయం 

హై΄ో థైరాయిడిజం 

మహిళల్లో ప్రెగ్నెన్సీ సమయంలో కడుపు కండరాలపైనా, రక్తనాళాలపైనా పడే ఒత్తిడి వల్ల

శారీరక శ్రమ లేని వృత్తుల్లో ఉన్నవాళ్లలో దేహానికి తగినంత వ్యాయామం లేకపోవడంతో

దీర్ఘకాలం పాటు నీళ్ల విరేచనాలు అవుతుండటం (డయేరియా)... ఈ అంశాలన్నీ మొలల సమస్యకు కొన్ని కారణాలు 

నివారణ / చికిత్స... 
మూలశంకవ్యాధిలో లక్షణాల తీవ్రతను బట్టి చికిత్స ఉంటుంది. ఇందుకు కారణాలను తెలుసుకుని వాటినీ అదుపు చేయాల్సిన అవసరముంటుంది. ఉదాహరణకు... మలబద్దకం, స్థూలకాయం, బరువు పెరగడం వంటి అంశాలు కారణమైతే వాటినీ అదుపు చేయాలి.  అక్కడి రక్తనాళాలను గాయపరచకుండా విసర్జితమయ్యేందుకు మలం మృదువుగా ఉండాలంటే ఫైబర్‌ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. 

ఆకుకూరలు, తాజాపండ్లు, పాలిష్‌ చేయని తృణధాన్యాలతో వండిన పదార్థాల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇక ద్రవాహారం, నీళ్లు కూడా ఎక్కువగా తీసుకోవడం మంచిది. రోజూ ఒకేవేళలో మలవిసర్జనకు వెళ్లేలా విసర్జన అలవాట్లు ఉండాలి. తగినంత శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. వ్యాయామం చేయాలి. 

ఈ జాగ్రత్తలతో కొద్దిపాటి తీవ్రత ఉన్న మొలలను నివారించుకోవచ్చు. కాని నొప్పి తీవ్రతరమై, రక్తస్రావం అవుతుంటే దానికి చికిత్స అవసరం. తీవ్రతను బట్టి డాక్టర్లు కొన్ని రకాల చికిత్సలు మొదలుకొని శస్త్రచికిత్స వరకు సూచిస్తుంటారు. ఈ శస్త్రచికిత్సల్లోనూ లేజర్, క్రయోథెరపీ, మినిమల్లీ ఇన్వేజివ్‌ ప్రోసీజర్‌ ఫర్‌ హీమరాయిడ్స్‌ / హీమరాయిడోపెక్సీ (ఇందులో అదనంగా పెరిగిన రక్తనాళాలకు రక్తసరఫరా జరగకుండా ఆపి, అవి తొలగి΄ోయేలా చేయడంతో పాటు నొప్పి, రక్తస్రావం వీలైనంతగా నివారించే అడ్వాన్స్‌డ్‌ ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవల ‘రఫాలో ప్రొసిజర్‌’ అనే నొప్పిలేని అత్యాధునిక చికిత్స ప్రక్రియ కూడా అందుబాటులోకి వచ్చింది. 

లక్షణాలు... 
మొలల వ్యాధి ఉన్నా... చాలా సందర్భాల్లో ఎలాంటి లక్షణాలూ కనిపించక΄ోవచ్చు. మొలలు ఉన్నాయన్న విషయమే వాళ్లకు తెలియకపోవచ్చు కూడా. మరికొందరిలో మాత్రం కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి... 

మలవిసర్జన తర్వాత ప్రక్షాళన సమయంలో ఓ ఉబ్బులాగా లేదా కండలాగా చేతికి తగలడం. (అందులో రక్తం గడ్డకట్టి ఉంటే గట్టిగా కూడా తగలవచ్చు) 

కొందరిలో మలద్వారం నుంచి రక్తస్రావం అవుతుండటం ∙మల విసర్జన తర్వాత మలంపై రక్తపు చారికలా కనిపించడం

కొన్సిసార్లు లోపలి దుస్తులకు తడిలా నీళ్లలా ఏదైనా మరకలా అంటడం 

మలద్వారం చుట్టూరా దురదగా అనిపించడం.

కొందరిలో అరుదుగా నొప్పి... 
పైల్స్‌ వల్ల నొప్పి చాలా అరుదుగా కలుగుతుంది. మొలలలోపల రక్తం గడ్డకట్టినప్పుడు మాత్రమే మొలలతో నొప్పి తెలుస్తుంది. కొందరిలో పైల్స్‌తో పాటు మలద్వారంలో చిన్న పగులు (ఫిషర్‌) కూడా ఉండవచ్చు. అలాంటి సమయంలో మాత్రం నొప్పి రావచ్చు. కొందరిలో మల విసర్జన వల్ల లోపల ఉండే మొలలన్నీ గుత్తిలా బయటకు రావచ్చు. అలాంటప్పుడు అవి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. మొలల సమస్యలో ఇది సమస్య తీవ్రతకు ఇదొక తార్కాణం.
డాక్టర్‌ ఆసిఫ్‌ మెహరాజ్‌, సీనియర్‌ కోలోరెక్టల్‌ సర్జన్‌ 

(చదవండి:  జీఎస్‌ఎమ్‌’: చెప్పుకోకుంటే ముప్పు అవుతుంది!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement