మమతకు సీఎం సువేందు ఝలక్‌ | Damayanti Sen Returns To Key Role In Bengal Probe Panel, Seen As Setback For Mamata Banerjee, More Details Inside | Sakshi
Sakshi News home page

మమతకు సీఎం సువేందు ఝలక్‌

May 19 2026 10:38 AM | Updated on May 19 2026 11:12 AM

Damayanti Sen once sidelined under Mamata now empowered by Suvendu

పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. గత టీఎంసీ పాలనలో జరిగిన అవినీతి, మహిళలపై నేరాలపై దర్యాప్తు కోసం ఆయన రెండు కమిషన్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కమిషన్లలో ఒక దాని కీలక బాధ్యతలు సీనియర్ ఐపీఎస్‌ అధికారిణి దమయంతి సేన్‌కు ఆయన అప్పగించారు. 

దమయంతి సేన్‌ 1996 బ్యాచ్‌ అధికారిణి. కోల్‌కతాకు క్రైమ్‌ బ్రాంచ్‌ జాయింట్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ కూడా. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పార్క్ స్ట్రీట్ గ్యాంగ్‌రేప్ కేసు(2012) కేసును స్వయంగా చేధించి.. నిందితులను తక్కువ టైంలోనే పట్టుకున్నారామె. ఆ సమయంలో దేశం మొత్తం ఆమెపై ప్రశంసలు గుప్పించింది. అయితే..  
(పార్క్‌ స్ట్రీట్‌ గ్యాంగ్‌ రేసు కేసు గురించి.. 2012 ఫిబ్రవరి 6వ తేదీన ఒక మహిళపై కారులో గ్యాంగ్‌రేప్ జరిగింది)

ఈ కేసు విషయంలోనే ఆమె అప్పటి దీదీ సర్కార్‌ ఆగ్రహానికి కూడా గురయ్యారు. ఆ సమయంలో మమతా బెనర్జీ సంచలన ఆరోపణలకు దిగారు. ఈ కేసు ఒక కల్పితం అని, టీఎంసీ ప్రభుత్వాన్ని దెబ్బ తీసే కుట్రగా అభివర్ణించారామె. అంతటితో ఆగకుండా దమయంతిని క్రైమ్‌ బ్రాంచ్‌ నుంచి ట్రైనింగ్‌ కాలేజీకి బదిలీ చేశారు. ఈ నిర్ణయం తీవ్ర వివాదాస్పదంగా మారింది. నిజాయితీకి మమత ప్రభుత్వం ఇచ్చిన కానుక అంటూ బీజేపీ, వామపక్షాలు తిట్టిపోశాయి.

అటు ఆ టైంలో ఆమెకు సోషల్‌ మీడియాలో విపరీతమైన మద్దతు లభించింది. అయితే మమతా సర్కార్‌ తీసుకున్న నిర్ణయంపై దమయంతి సేన్‌ ఇన్నేళ్లు మౌనంగా పాటించారు. రోటీన్‌ ట్రాన్స్‌ఫర్‌ను అంగీకరించి తన విధుల్ని చేసుకుంటూ పోయారు. ఆపై ప్రమోషన్‌ల విషయంలోనూ ఆమెకు అన్యాయమే జరిగిందని.. పెద్దగా ప్రాధాన్యం లేని పోస్టింగ్‌లు ఇస్తూ వచ్చారని విమర్శలు ఉన్నాయి. అయితే ఆమె సిన్సియారిటీని గుర్తించిన కలకత్తా హైకోర్టు.. 2022లో నాలుగు అత్యాచార కేసులు, రసికా జైన్‌ మరణం కేసును అప్పగించి మమతా సర్కార్‌కు ఝలక్‌ ఇచ్చింది.

తాజాగా.. రిటైర్డ్ జస్టిస్ సంపతి చటర్జీ అధ్యక్షతన నేతృత్వంలో సువేందు సర్కార్‌ కమిషన్‌ వేయగా..  దమయంతి సేన్‌ను అందులో మెంబర్ సెక్రటరీగా నియమించారు. ఈ కమిషన్‌ మహిళలు, పిల్లలపై దాడులను పరిశీలించనుంది. ఇందులో సందేశ్‌ఖాలి, కస్బా, బోగ్టుయి వంటి కేసులు కూడా ఉన్నాయి. దమయంతి సేన్ తిరిగి కీలక బాధ్యతల్లోకి రావడం.. బెంగాల్ రాజకీయాల్లో ఒక ముఖ్య పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement