కేంద్రంలో బీజేపీ రాజ్యం కూలబోతోంది: మమత హెచ్చరిక | Mamata Banerjee Says BJP govt will be removed from Centre | Sakshi
Sakshi News home page

కేంద్రంలో బీజేపీ రాజ్యం కూలబోతోంది: మమత హెచ్చరిక

May 20 2026 7:39 AM | Updated on May 20 2026 7:39 AM

Mamata Banerjee Says BJP govt will be removed from Centre

కోల్‌కత్తా: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీని త్వరలోనే కేంద్రంలో అధికారం నుంచి తొలగిస్తామని మమత చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో బెంగాల్‌లో సువేందు ప్రభుత్వం మైనార్టీ వర్గాలను లక్ష్యంగా చేసుకుందని.. వారి ఇళ్లను, దుకాణాలను అన్యాయంగా కూల్చివేస్తున్నారని ఆరోపించారు.

మాజీ సీఎం మమతా బెనర్జీ మంగళవారం తన నివాసంలో టీఎంసీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ..‘పశ్చిమ బెంగాల్‌లో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం మైనారిటీ వర్గాలను, రోడ్డు పక్కన దుకాణాలు నడిపేవారిని లక్ష్యంగా చేసుకుంటోంది. మైనారిటీ వర్గాలను టార్గెట్‌ చేస్తున్నారు.  దుకాణాలను బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారు. ఈ ప్రభుత్వం మన రాజ్యాంగ భావనలు, విలువలతో చెలగాటం ఆడుతోంది. దేశాన్ని పాలిస్తున్న జాతీయ ప్రజాస్వామ్య కూటమికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ, సమీప భవిష్యత్తులో కేంద్రంలో అధికారాన్ని కోల్పోతుంది. రాబోయే రోజుల్లో ఢిల్లీలో బీజేపీని అధికారం నుంచి తొలగిస్తారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. అలాగే.. తాను, తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఎలాంటి బెదిరింపులకు లొంగబోనని స్పష్టం చేశారు.

ఇక, మమతా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కూడా హాజరయ్యారు. దక్షిణ కోల్‌కతాలోని తన ఇంటిలోని అనధికార కట్టడాలను కూల్చివేయాలని కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ) పంపిన నోటీసుపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా అభిషేక్‌ బెనర్జీ మాట్లాడుతూ..‘వారు ఏం చేయాలనుకున్నా చేయనివ్వండి... నా ఇంటిని కూల్చివేయండి, నాకు నోటీసు పంపండి. నేను ఈ విషయాలకు తలవంచను.

మన రాష్ట్రానికి చాలా మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి లాంటి వారు ఎవరూ లేరు. కెమెరా ముందు డబ్బులు తీసుకుంటూ(2014లో వివాదాస్పద నారద స్టింగ్ ఆపరేషన్‌) కనిపించిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేశారు. ఏది ఏమైనప్పటికీ, బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుంది అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే, కూల్చివేత నోటీసు పంపిన కేఎంసీ ఇప్పటికీ టీఎంసీ నియంత్రణలోనే ఉందని, మమతకు సన్నిహితుడిగా భావించే ఆ పార్టీ ఎమ్మెల్యే ఫిర్హాద్ హకీం కోల్‌కతా మేయర్‌గా ఉన్నారని ఇక్కడ ప్రస్తావించడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement