‘కోటా’ జోరుకు బ్రేక్‌.. తెరపైకి ‘సికార్‌’ విద్యా విప్లవం! | How Sikar Is Emerging As New Coaching Hub For NEET JEE Aspirants | Sakshi
Sakshi News home page

‘కోటా’ జోరుకు బ్రేక్‌.. తెరపైకి ‘సికార్‌’ విద్యా విప్లవం!

May 20 2026 7:44 AM | Updated on May 20 2026 7:52 AM

How Sikar Is Emerging As New Coaching Hub For NEET JEE Aspirants

రాజస్థాన్‌లోని కోటా నగరం అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది నీట్, జేఈఈ కోచింగ్ సెంటర్లు. ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు వదిలేస్తున్న విద్యార్థుల విషాదాలు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. కోటాకు ప్రత్యామ్నాయంగా, మధ్యతరగతి కుటుంబాల ఆశాదీపంగా ‘సికార్’ అనే చిన్న పట్టణం సరికొత్త విద్యా విప్లవానికి కేంద్రబిందువుగా ఎదుగుతోంది. జైపూర్‌కు నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ‘సికార్‌’ ఇటీవలి ‘నీట్’ పేపర్ లీకేజీ వ్యవహారంలోనూ  వార్తల్లోకి వచ్చి సంచలనంగా నిలిచింది.

కోటాతో పోటీ పడుతున్న ‘బి-టౌన్’ సికార్
కోటాతో పోలిస్తే సికార్ చాలా చిన్న నగరం. ఇక్కడ బ్రహ్మాండమైన హాస్టళ్లు లేవు. కనీసం ఒక షాపింగ్ మాల్ కూడా లేదు. నగరంలో ఒకే ఒక్క సినిమా థియేటర్ కనిపిస్తుంది. అయినప్పటికీ, ఇది దేశంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న నీట్-జేఈఈ కోచింగ్ హబ్‌గా మారుతోంది. డాక్టర్లు, ఇంజనీర్లు కావాలనే మధ్యతరగతి విద్యార్థుల కలలను నిజం చేస్తూ, కోటా స్థాయి ఖర్చులను భరించలేని కుటుంబాలకు సికార్ ఒక ఆశ్రయంగా నిలుస్తోంది. ఇక్కడి విద్యాసంస్థలు కేవలం ర్యాంకులకే ప్రాధాన్యత ఇవ్వకుండా, విద్యార్థులకు సొంత ఊరి వాతావరణాన్ని అందిస్తున్నాయి.

లీకేజీ గుట్టురట్టు చేసిన సికార్ లెక్చరర్
ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ వ్యవహారానికి సికార్ నగరంతో బలమైన సంబంధం ఉంది. ఇక్కడి ఒక కోచింగ్ సెంటర్‌లో కెమిస్ట్రీ బోధించే శశికాంత్ సుతార్ అనే ఉపాధ్యాయుడికి, తన హాస్టల్ యజమాని ద్వారా నీట్ ప్రశ్నపత్రం అందింది. ఆ హాస్టల్ యజమాని కుమారుడు కేరళలో ఎంబీబీఎస్ చదువుతుండగా, అతని స్నేహితుడి ద్వారా ఆ పేపర్ సికార్‌కు చేరింది. పరీక్షకు ముందే (ఏప్రిల్ 30 నుండి మే 3 మధ్య) ఈ ‘గెస్ పేపర్’ సికార్‌లో సర్క్యులేట్ అయింది. అయితే సికార్ కెమిస్ట్రీ లెక్చరర్ వెంటనే అలర్ట్ అయి నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ)కి ఈమెయిల్ పంపడం ద్వారా ఈ మహా కుంభకోణాన్ని బయటపెట్టారు. ఈ ఆధారాల ద్వారానే దర్యాప్తు సంస్థలు హర్యానా, మహారాష్ట్రల్లోని ప్రధాన నిందితులను పట్టుకోగలిగాయి.

ఆత్మహత్యల 'కోటా'కు భిన్నంగా..
కోటా నగరం ర్యాంకులతో పాటు విద్యార్థుల ఆత్మహత్యలకు కూడా కేరాఫ్ అడ్రస్‌గా మారింది. గత ఏడాదిలోనే అక్కడ 13 మంది విద్యార్థులు ఒత్తిడితో తనువు చాలించగా, గత దశాబ్ద కాలంలో దాదాపు 100 ఆత్మహత్యలు నమోదయ్యాయి. కానీ, సికార్ వాతావరణం దీనికి పూర్తిగా భిన్నం. ఇక్కడ విద్యార్థుల ఆత్మహత్యల రేటు చాలా తక్కువ. 2024 జూలై 1న నీట్ పరీక్ష రాసిన తర్వాత 17 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మినహా, ఇక్కడ పెద్దగా విచారకరమైన సంఘటనలు లేవు. కోటాలోని ఒంటరితనం, విపరీతమైన పోటీకి భయపడుతున్న తల్లిదండ్రులు ఇప్పుడు తమ పిల్లలను ధైర్యంగా సికార్‌కు పంపుతున్నారు.

కన్నీరు పెట్టించే పవిత్ర చౌదరి విజయగాథ
సికార్‌లో చదువుతున్న విద్యార్థుల వెనుక ఎన్నో కన్నీటి గాథలు, అంతకుమించిన పట్టుదలలు ఉన్నాయి. శ్రీమాధోపూర్ పరిధిలోని జాంకీపురా గ్రామానికి చెందిన 17 ఏళ్ల పవిత్ర చౌదరి కథ ఇందుకు నిదర్శనం. కరోనా సమయంలో తల్లి గుండెపోటుతో చనిపోగా, నీట్ పరీక్షకు కేవలం ఆరు నెలల ముందు (గత ఏడాది డిసెంబర్ 17న) తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ‘కార్డియాలజిస్ట్ కావాలనేది నా తండ్రి కల. మొదటి ప్రయత్నంలోనే నాకు 690 మార్కులు వస్తాయని ఆశించాను. కానీ పేపర్ రద్దు అయింది. అయినా నేను పట్టుదల వీడను. తదుపరి పరీక్షలో 710 పైగా మార్కులు సాధించి మా నాన్న కలను నిజం చేస్తా’ అంటూ పవిత్ర చౌదరి స్థిర నిశ్చయంతో చెప్పాడు. ప్రస్తుత అతని పరిస్థితిని చూసిన కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఫీజు, హాస్టల్ ఖర్చులను పూర్తిగా మినహాయించింది.

భూములు అమ్మి.. నగలు తాకట్టు పెట్టి..
ఉత్తరప్రదేశ్ కుషీనగర్ జిల్లాకు చెందిన అక్తర్ అన్సారీ కథ కూడా ఇలాంటిదే. అతని తండ్రి హిసాబుద్దీన్ ఒక పేద రైతు, కూలీ పనులు కూడా చేస్తాడు. తన కొడుకును డాక్టర్ చేయాలనే లక్ష్యంతో మొదట కాన్పూర్, ఆ తర్వాత కోటాకు పంపాడు. గత ఏడాది అక్తర్ సికార్‌కు మారాడు. ఇది అక్తర్‌కు 7వ ప్రయత్నం. ‘కీ ’ప్రకారం అతనికి 652 మార్కులు వస్తుండటంతో తండ్రి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కొడుకు చదువు కోసం ఈ ఏడాది జనవరిలోనే తండ్రి భూమి అమ్మేశాడు. తల్లి నగలను తాకట్టు పెట్టాడు. పేపర్ రద్దు వార్త వినగానే గుండె పగిలినంత పనైందని, అయినా తన తండ్రి ధైర్యం చెప్పి, మళ్లీ జూన్ 21న జరగబోయే పరీక్షకు సిద్ధం కావాలన్నారని అక్తర్  ఆవేదనతో తెలిపాడు.

సికార్ ఎందుకు చౌక? నిపుణులు ఏమంటున్నారు?
సికార్‌లోని గురుకృప ఇన్స్టిట్యూట్ డైరెక్టర్, విద్యా నిపుణుడు ప్రదీప్ బుడానియా ప్రకారం.. కోటాతో పోలిస్తే సికార్‌లో చదువుకోవడానికి అయ్యే ఖర్చు సగం మాత్రమే. కోటా నుంచి ఇక్కడికి విస్తరించిన పెద్ద పెద్ద సంస్థలు సైతం ఫీజులు తగ్గించక తప్పని పరిస్థితి నెలకొంది. ఇక్కడి హాస్టల్, పీజీ యజమానులు ఎక్కువగా స్థానిక గ్రామస్తులు కావడంతో విద్యార్థులను తమ సొంత పిల్లల్లా చూసుకుంటారు. 2021 నుండి 2025 మధ్య కాలంలో కోటాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య తగ్గగా, సికార్‌లో విద్యార్థుల చేరికలు మూడు రెట్లు పెరగడం విశేషం.

ఇది కూడా చదవండి: ఆమెకు 74, అతనికి 76.. ఒక్కటయ్యారిలా..

Advertisement
 
Advertisement
Advertisement