మహిళలకు అది బయటకు చెప్పుకోలేని ఓ సమస్య. ఎవరితోనూ పంచుకోలేని ఓ పెను ఇబ్బంది. ఇప్పటి తరానికి ఒక తరం ముందున్న వారు కావడంతో వీళ్లంతా ఓపెన్‌గా చర్చించాలంటే కొంతైనా అసౌకర్యంగా, ఇంకాస్త బిడియంగా ఫీలయ్యే ఈ సమస్య పేరు ‘జెనైటో యూరినరీ సిండ్రోమ్ ఆఫ్ మెనోపాజ్’. సంక్షిప్తంగా దీన్ని ‘జీఎస్‌ఎమ్’గా పేర్కొంటారు. సమస్య ఎప్పటినుంచో ఉన్నదే అయినప్పటికీ... ఇటీవల ఆధునిక జీవనశైలితో వచ్చే హార్మోన్ల అసమతౌల్యపు సమస్యలు ఎక్కువ కావడంతో ఇంతకుముందు కంటే ఇప్పుడు మరికాస్త ఎక్కువగా కనిపిస్తోంది. కేవలం పీరియడ్స్ ఆగిపోయిన ముందు తరానికే కాకుండా అండాశయాలు తొలగించుకున్న ఈతరం వారినీ వేధిస్తూ ఇటీవల ఈ కేసులు మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయి. జస్ట్... ఒక్కసారి తమ బిడియం వీడి... గైనకాలజిస్టులనూ, యూరో గైనకాలజిస్టులను సంప్రదిస్తే నూరుశాతం తగ్గి΄ోయే ఈ సమస్య ఇది. మరెవరితోనో అంత ఓపెన్‌గా మాట్లాడే అవకాశం లేకపోయినా మహిళలు చదువుకొని తెలుసుకోగలిగే ఈ సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం.
సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా మెనోపాజ్ తర్వాత దాదాపు 40 నుంచి 60 శాతం మహిళల్లో కనిపించే ఈ సమస్య ఇప్పుడు మనదేశంలో ప్రతి ఇద్దరు మహిలల్లో ఒకరికి తప్పక ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అంటే మెనోపాజ్ వచ్చివారిలో 50% మంది జీఎస్‌ఎమ్ సమస్యతో బాధపడుతున్నారు.
ఇక మెనోపాజ్ నుంచి కాలం గడుస్తున్నకొద్దీ జీఎస్‌ఎమ్ బారిన పడే మహిళల సంఖ్య పెరుగుతూ ఉంది. ఒక అధ్యయనం ప్రకారం మహిళలకు తమ చివరి పీరియడ్ నుంచి కేవలం ఐదేళ్ల వ్యవధిలోపే ఆ సంఖ్య 65% చేరుకుంటోంది. ఇక పూర్తిగా మోనోపాజ్ వచ్చిన వాళ్లలో చూస్తే వారిలో ఐదేళ్లలోపే 74% మందిలో జీఎస్‌ఎమ్ కనిపిస్తోంది.
పేరును బట్టి కేవలం మెనోపాజ్ వచ్చినవారిలోనే కనిపిస్తుందా అంటే అది కూడా అపోహే. ఈతరం మహిళల్లోనూ... అంటే 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వారిలోనూ కనిపిస్తోంది. కేవలం మెనోపాజ్ వచ్చినవారిలోనే కాకుండా ఏదైనా మెడికల్ కారణాల వల్ల అండాశయాలు తొలగించుకున్నవారిలో లేదా క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నవారిలోనూ కనిపించే సమస్య ఇది.
తొలుత శారీరకమైన సమస్యే... కానీ తర్వాత మానసికంగా కూడా...
సాధారణంగా ఇది శారీరకంగా ఇబ్బంది పెట్టే సమస్యే అయినప్పటికీ దీర్ఘకాలంలో ఇది మహిళను కుంగదీస్తుంది. చికిత్స తీసుకోకపోవడం వల్ల భర్త నుంచి దూరం జరుగుతుండటంతో భార్యాభర్తల మధ్య ఏడబాటు, బయటకు వెళ్లడానికి ఇష్టపడకపోవడంతో సామాజికంగా నలుగురికీ దూరం అవ్వడం, ప్రయాణాలకు దూరంగా ఉండటం, ఏ పనిలోనూ ఆసక్తిలేకపోవడం వంటి కారణాలతో సమాజం నుంచి దూరంగా జరుగుతూ కుంగుబాటుకూ (డిప్రెషన్‌కూ) లోనయ్యే అవకాశాలు లేక΄ోలేదు.
గుర్తించడమెలా (డయాగ్నసిస్)
జీఎస్‌ఎమ్‌కు ఎలాంటి నిర్దిష్టమైన వైద్య పరీక్ష ఉండదు. కానీ మహిళలు తమ బిడియం విడిచి డాక్టర్‌ను సంప్రదిస్తే తేలిగ్గా తెలుసుకోగల వైద్య సమస్య ఇది. పైగా వైద్య చికిత్సతో నూటికి నూరు΄ాళ్లు నయం చేయగల (ట్రీటబుల్) సమస్య ఇది. చేయాల్సిందల్లా మహిళలు ఈ సమస్యనలా భరిస్తూ ఉండేందుకు బదులు డాక్టర్ దగ్గర చెప్పుకుంటే చాలు.
చికిత్స
ఈ సమస్యకు చికిత్స అన్నది అందరికీ ఒకేరకంగా కాకుండా వ్యక్తిగత ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని వ్యక్తిగతంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు కొందరిలో ఇన్ఫెక్షన్ / ఇన్‌ఫ్లమేషన్ ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్‌తో పాటు జీవనశైలి మార్పులు సూచించడం, పెల్విక్ ఫ్లోర్ కండరాలకు వ్యాయామాన్ని ఇచ్చే వర్కవుట్స్ సూచించడం వంటివి.
అలాగే సమస్య తీవ్రతను బట్టి పూతమందులుగా ఇచ్చే మాయిశ్చరైజర్లు, ల్యూబ్రికెంట్లతో పాటు సిస్టమేటిక్ హార్మోనల్ రీప్లేస్‌మెంట్ థెరపీగా హార్మోన్‌లు ఇవ్వడంలాంటి వైద్య చికిత్సతో పాటు కౌన్సెలింగ్ ఇస్తూ సలహా సూచనలందిస్తూ పేషెంట్లలో ధైర్యం, స్థైర్యం పాదుగొలిపేలా మాట్లాడటమూ అవసరమవుతుంది.
సమస్య ఎందుకొస్తుందంటే...
సాధారణంగా మహిళల్లో స్రవించే ఈస్ట్రోజెన్... వారి ప్రైవేట్ పార్ట్స్‌ను తేమగా ఉంచుతుంది. కానీ మెనోపాజ్ తర్వాత ప్రైవేట్ పార్ట్స్ పొడిబారిపోవడం (ఇలా పొడిబారడం వల్ల ఇన్ఫెక్షన్లు తరచూ వస్తుంటాయి), సాగే గుణం తగ్గడంతో కండరాలు స్టిఫ్‌గా మారడంతో మూత్రవిసర్జనలో నొప్పి, మంట, తీవ్రమైన అసౌకర్యం వంటివి కనిపిస్తాయి.
డాక్టర్ సిందూరి గోరంట్ల, కన్సల్టెంట్ ఆబ్‌స్టెట్రీషియన్ – గైనకాలజిస్ట్


