న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘భారత్ పర్వ్’ ఉత్సవాలకు ఢిల్లీలోని ఎర్రకోట ముస్తాబైంది. జనవరి 26 నుండి 31 వరకు ఆరు రోజుల పాటు జరగనున్న ఈ జాతీయ సాంస్కృతిక, పర్యాటక మహోత్సవాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సంయుక్తంగా ప్రారంభించనున్నారు.
దేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, రుచులను ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ ఉత్సవ ప్రధాన ఉద్దేశ్యం. భారతదేశపు భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పేలా ఈ ఉత్సవం రూపుదిద్దుకుంది. ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణగా 41 శకటాల ప్రదర్శన నిలవనుంది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన కళాకారులు తమ సంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలతో సందర్శకులను అలరించనున్నారు.
ఈ ఉత్సవంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన విభిన్న రుచులను అందించే 60 స్టాల్స్‌తో కూడిన భారీ ఫుడ్ కోర్ట్, లైవ్ కుకింగ్ డెమోలు ఆహార ప్రియులను ఆకట్టుకోనున్నాయి. ఈ ఆరు రోజుల పండుగలో అందరూ పాల్గొనేందుకు ఉచిత ప్రవేశాన్ని కల్పించారు. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, 25కి పైగా కేంద్ర మంత్రిత్వ శాఖలు, ప్రముఖ సంస్థలు ఈ వేడుకలో భాగస్వామ్యం కానున్నాయి. ఈ వేడుకకు ప్రజలు భారీగా తరలివస్తారని అధికారులు ఆశిస్తున్నారు.


