రాయ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా అదరగొట్టింది. బౌలింగ్‌లో విఫలమైనప్పటికి బ్యాటింగ్‌లో మాత్రం దుమ్ములేపింది. కివీస్ నిర్ధేశించిన 209 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 15.2 ఓవర్లలో చేధించింది.
తద్వారా న్యూజిలాండ్‌ను 7 వికెట్ల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. తన రీఎంట్రీ మ్యాచ్‌లో విఫలమైన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్.. రాయ్‌పూర్‌లో మాత్రం తన విశ్వరూపాన్ని చూపించాడు. తొలి ఓవర్‌లోనే క్రీజులోకి వచ్చిన ఇషాన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
కిషాన్ కేవలం 32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో ఏకంగా 76 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(37 బంతుల్లో 82 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది. ఇక సంచలన ఇన్నింగ్స్ ఆడిన కిషన్‌పై సూర్యకుమార్ ప్రశంసల వర్షం కురిపించాడు. పవర్‌ప్లేలో అతడు ఆడిన తీరు అద్భుతమని సూర్యకొనియాడాడు.
"ఇషాన్ లంచ్‌లో ఏం తిన్నాడో, మ్యాచ్‌కు ముందు ఏ 'ప్రీ-వర్కౌట్' డ్రింక్ తీసుకున్నాడో నాకు తెలియదు. కానీ అతడి బ్యాటింగ్ చేసిన తీరు మాత్రం అద్భుతం. కేవలం 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన స్థితిలో ఇలాంటి విధ్వంసకర బ్యాటింగ్‌ను నేను ఎప్పుడూ చూడలేదు. పవర్‌ప్లేలో తొలి రెండు ఓవర్లలో మాకు కేవలం 8 పరుగులకే వచ్చాయి. అటువంటిది పవర్‌ప్లేను 75 పరుగులతో ముగించడం నిజంగా గ్రేట్.
ఆ క్రెడిట్ మొత్తం కిషన్‌కే దక్కాలి. 200 పైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు బ్యాటర్ల నుంచి ఇటువంటి ఇన్నింగ్స్‌లే మేము ఆశిస్తాము. ప్రతీ ఒక్కరూ పూర్తి స్వేచ్చగా ఆడుతూ తమను తాము నిరూపించుకోవాలి. ఈ మ్యాచ్‌లో ఇషాన్ సరిగ్గా అదే చేశాడు.
పవర్‌ప్లేలో ఇషాన్ స్ట్రైక్ అస్సలు నాకు ఇవ్వలేదు, అందుకు కోపంగా ఉన్నాను(నవ్వుతూ). అయితే కిషాన్ దూకుడుగా ఆడడంతో క్రీజులో కుదురుకోవడానికి నాకు సమయం దొరికింది. చాలా రోజుల తర్వాత హాఫ్ సెంచరీ చేయడం సంతోషంగా ఉంది. గత మూడు వారాల నుంచి నెట్స్‌లో ఎక్కువగా గడిపాను. వాటి ఫలితం ఈ మ్యాచ్‌లో స్పష్టంగా కన్పించింది.
ఒకానొక దశలో న్యూజిలాండ్ 230 పరుగులు చేసేలా కనిపించింది. కానీ కుల్దీప్ యాదవ్, వరుణ్ అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్ధిని కట్టడి చేశారు. దూబే కూడా కీలక ఓవర్ బౌలింగ్ చేశాడు. ప్రస్తుతం డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం చాలా బాగుంది. రాబోయో మ్యాచ్‌లలో ఇదే బ్రాండ్ ఆఫ్ కొనసాగిస్తాము" అని సూర్య పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో పేర్కొన్నాడు.


