దక్షిణ ఫిలిప్పీన్స్ తీరంలో సోమవారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. సుమారు 350 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న ‘ఎం/వి త్రిషా కెర్సిన్ 3’ అనే ఇంటర్-ఐలాండ్ ఫెర్రీ.. బాసిలన్ ప్రావిన్స్ సమీపంలో నడిసంద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 15 మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు.
జాంబోంగా సిటీ నుండి సులు ప్రావిన్స్‌లోని జోలో ద్వీపానికి వెళ్తుండగా ఫెర్రీ గమ్యస్థానానికి చేరుకోకముందే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో వాతావరణం అనుకూలంగానే ఉన్నప్పటికీ, సాంకేతిక లోపం తలెత్తడంతో ఫెర్రీ మునిగిపోయినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే ఫిలిప్పీన్స్ కోస్ట్ గార్డ్, నేవీ దళాలు అప్రమత్తమయ్యాయి. ఫెర్రీలో ప్రయాణిస్తున్న ఒక కోస్ట్ గార్డ్, సేఫ్టీ ఆఫీసర్.. అధికారులను అప్రమత్తం చేయడంతో సహాయక చర్యలు తక్షణమే ప్రారంభమయ్యాయి. కోస్ట్ గార్డ్ నౌకలు, నేవీ షిప్‌లు, నిఘా విమానాలు, బ్లాక్ హాక్ హెలికాప్టర్లను రంగంలోకి దింపి, నీట మునిగినవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
BREAKING: Ferry Trisha Kerstin 3 with over 350 on board sinks near Basilan, southern Philippines pic.twitter.com/YO4H8Yn9Us
— Rapid Report (@RapidReport2025) January 25, 2026
స్థానిక మత్స్యకారులు కూడా తమ పడవలతో సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు. ఇప్పటివరకు సుమారు 316 మందిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. సహాయక బృందాలు వెలికితీసిన మృతదేహాలను, బాధితులను బాసిలన్ ప్రావిన్షియల్ రాజధాని ఇసాబెలా సిటీకి తరలించారు. క్షతగాత్రులతో స్థానిక ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయని, వైద్య సిబ్బంది కొరత ఉన్నప్పటికీ బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తున్నామని ఎమర్జెన్సీ రెస్పాండర్లు తెలిపారు.
బాసిలన్ గవర్నర్ ముజివ్ హటమన్ మాట్లాడుతూ, మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాగా ఫెర్రీలో పరిమితికి మించి ప్రయాణికులు లేరని, జాంబోంగా నౌకాశ్రయం నుండి బయలుదేరే ముందు కోస్ట్ గార్డ్ నుండి అనుమతి లభించిందని కమాండర్ రోమెల్ దువా తెలిపారు. పడవ ఎందుకు మునిగిపోయిందనే దానిపై సమగ్ర విచారణకు అధికారులు ఆదేశించారు. ఫిలిప్పీన్స్ దేశంలో సముద్ర రవాణా అత్యంత కీలకం. భద్రతా ప్రమాణాల పాటించకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: కనిపించని ఆ నాలుగో సింహమే..


