బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో ప్రముఖ పర్యాటక ప్రాంతం నుంచి ట్రాట్ ప్రావిన్స్‌లోని ప్రధాన భూభాగం వైపు వస్తున్న ఫెర్రీ ప్రమాదంలో చిక్కుకుంది. సకాలంలో స్పందించిన అధికార యంత్రాంగం సిబ్బంది సహా మొత్తం 100 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. దీంతో, పెనుప్రమాదం తప్పినట్లయిందని అధికారులు తెలిపారు. ప్రైవేట్ సంస్థకు చెందిన ఫెర్రీ గురువారం పర్యాటక ప్రాంతమైన కోహ్ కూద్ నుంచి ట్రాట్ నగరం వైపు బయలుదేరింది.
దాదాపు 40 కిలోమీటర్ల దూరానికి గాను మధ్యలోకి వచ్చేసరికి ఫెర్రీకి రంధ్రం పడి లోపలికి నీరు చేరడం మొదలైంది. సముద్రంలో భారీ అలలు ఎగసి పడుతుండటంతో అప్రమత్తమైన సిబ్బంది ఫెర్రీకి లంగరేసి అధికారులకు ప్రమాద సందేశాన్ని పంపించారు. సమాచారమందుకున్న ఇతర ఫెర్రీల నిర్వాహకులు, సమీప బోట్లలోని మత్స్యకారులతోపాటు నేవీ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని గంట వ్యవధిలోనే ఫెర్రీలో ఉన్న 97 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. అనంతరం ఫెర్రీలోని నీటిని తోడివేసి, తీరానికి తీసుకెళ్లారు.


