సిగాచీ ప్రమాదంపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
విచారణ పూర్తి చేసి అభియోగపత్రం దాఖలు చేయాలి
పిల్‌లోని విచారణ ట్రయల్ కోర్టుపై ప్రభావం చూపదు
సాక్షి, హైదరాబాద్: సిగాచీ దారుణ ఘటనకు అసలైన బాధ్యులెవరో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాల్సిన బాధ్యత సర్కార్‌దేనని హైకోర్టు స్పష్టం చేసింది. తాము దర్యాప్తును నియంత్రించడం లేదని, విచారణ పూర్తి చేసి అభియోగపత్రం దాఖలు చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ పిల్ విచారణ ట్రయల్ కోర్టుపై ప్రభావం ఉంటుందని తాము భావించడం లేదని అభిప్రాయపడింది. తమ ముందున్న వాస్తవాల ఆధారంగా ట్రయల్‌కోర్టు నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించింది.
అయితే, సర్కార్ నివేదిక, చట్టాలను విశ్లేషించేందుకు సమయం కావాలని అమికస్‌క్యూరీ కోరడంతో ధర్మాసనం విచారణ జనవరి 29కి వాయిదా వేసింది. పటాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ పరిశ్రమలో జూన్ 30న సంభవించిన పేలుడు ఘటనలో 54 మంది మృతి చెందగా, 8 మంది ఆచూకీ ఇంకా లభించాల్సి ఉందని హైదరాబాద్ స్నేహపురి కాలనీకి చెందిన రిటైర్డ్ సైంటిస్ట్ కలపాల బాబురావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేసిన విషయం విదితమే.
ఫ్యాక్టరీలో భద్రతా నిబంధనలు లేకపోవడం, బాధిత కార్మికుల కుటుంబాలకు పరిహారం చెల్లింపులో జాప్యం జరుగుతోందన్నారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) తేరా రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘దర్యాప్తు గణనీయంగా పురోగతి సాధించింది. సిగాచీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో (నిందితుడు–2) అమిత్ రాజ్ సిన్హాను అరెస్టు చేశాం.
ఇతర నిందితులు (3 నుంచి 7) పరారీలో ఉన్నారు. గల్లంతైన 8 మందిని కూడా మరణించినట్లుగా గుర్తించాం. వారికి కూడా మృతిచెందిన వారిలాగానే పరిహారం అందించే చర్యలు తీసుకుంటాం. ఇప్పటివరకు రూ.22.30 కోట్ల పరిహారం పంపిణీ జరిగింది’అని చెప్పారు.
దర్యాప్తునకు సహకారం అందిస్తున్నాం..
కంపెనీ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘దురదృష్టకర సంఘటన జరిగిన వెంటనే అధికారులతో చర్చలు జరిపాం. మరణించిన ప్రతి కార్మికుడి కుటుంబానికి రూ. 42 లక్షలు చెల్లించడానికి అంగీకరించాం. తీవ్రంగా గాయపడిన కార్మికులకు రూ. 2 లక్షలు చెల్లించాం.
వారి పూర్తి వైద్య ఖర్చులనూ భరించాం. అరెస్టయిన ఎండీ, పరారీలోని నిందితులకు బెయిల్ పిటిషన్లు దాఖలు చేయాల్సి వస్తే ట్రయల్ కోర్టుపై ఈ పిల్ ప్రభావం లేకుండా చూడాలి’అని కోరారు. పిటిషనర్ తరఫున న్యాయవాది వసుధా నాగరాజ్ వాదనలు వినిపిస్తూ.. కంపెనీ రూ.కోటి పరిహారం ఇస్తామని హామీ ఇచ్చి రూ.42 లక్షలు మాత్రమే పంపిణీ చేస్తామని చెప్పడం సరికాదన్నారు.


