‘హనీ ట్రాప్’పై పోలీసులను ఆశ్రయించిన యజమాని
జూలూరుపాడు: ఆ పుంజులో ఏం ప్రత్యేకత ఉందో ఏమో కానీ.. ఇద్దరు వ్యక్తులు కోడిపెట్టను ఎరగా వేసి మరీ దాన్ని ఎత్తుకెళ్లారు. మనుషులను బురిడీ కొట్టించడానికి, డబ్బు లాగడానికి కేటుగాళ్లు హనీ ట్రాప్‌ను ఆయుధంగా వాడినట్లే ఇక్కడ కూడా వ్యవహరించడం విశేషం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం జేత్యాతండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. మాచినేనిపేటతండా గ్రామపంచాయతీ పరిధి జేత్యాతండాకు చెందిన రైతు లకావత్ జేత్‌రామ్ తన ఇంట్లో మూడు కోడి పుంజులు, ఒక పెట్టను పెంచుతున్నాడు.
ఈనెల 19వ తేదీన మధ్యాహ్నం ఆయన పొలానికి వెళ్లి సాయంత్రం వచ్చేసరికి ఒక పుంజు కనిపించలేదు. ఇరుగుపొరుగు వారిని ఆరా తీయగా ద్విచక్రవాహనంపై ఇద్దరు వ్యక్తులు కోడి పెట్టను తీసుకుని వచ్చినట్లు తేలింది. ఆ వ్యక్తులే పెట్టను ఎరగా వేయగా.. జేత్‌రామ్ ఇంట్లోని కోడి పుంజు దగ్గరకు రావడంతో దాన్ని పట్టుకుని బైక్‌పై పారిపోయినట్లు గుర్తించాడు. దీనిపై జేత్‌రామ్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


