కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు గుర్తించిన ఏసీబీ
మహబూబ్‌నగర్ క్రైం/నేరేడుచర్ల, గరిడేపల్లి: కల్వకుర్తి వ్యవసాయశాఖ ఏడీ కిరణ్‌కుమార్ ఆస్తుల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఏసీబీ నుంచి మొత్తం ఏడు బృందాలు వేర్వేరుగా చేసిన సోదాలలో కోట్ల రూపాయల ఆస్తులను గుర్తించారు. శనివారం కల్వకుర్తిలోని ఆయన కార్యాలయంతో పాటు నివాసంలో సోదాలు నిర్వహించారు. కిరణ్‌కుమార్ స్వగ్రామమైన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని పొనుగోడు గ్రామంలో గల ఆయన ఇంట్లో తెల్లవారుజాము నుంచే తనిఖీలు ప్రారంభించారు.
గడ్డిపల్లి గ్రామంలోని కిరణ్‌కుమార్ అత్తగారింటి వద్ద, అదేవిధంగా అనంతగిరి మండలం అమీనాబాద్, సూర్యాపేటలోని కిరాయి ఇళ్లలోనూ సోదాలు చేసినట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్‌లో ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ మాట్లాడుతూ కల్వకుర్తి వ్యవసాయ శాఖ ఏడీ కిరణ్‌కుమార్‌పై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భాగంగా చేసిన తనిఖీల్లో దాదాపు రూ.4 కోట్ల ఆస్తులను మొదటి రోజు గుర్తించినట్లు వెల్లడించారు. దీంట్లో ప్రధానంగా 97 ఎకరాల భూమి, ఓపెన్ ప్లాట్లు మూడు, ఐదు కార్లు, ఇన్సూరెన్స్ పాలసీలు రూ.5.5 లక్షలు, పలు రకాల పెట్టుబడులు రూ.50 లక్షలు, ఫ్లాట్‌లు రెండు, ఒక ఇళ్లు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.
కిరణ్‌కుమార్‌పై అవినీతి చట్టం 1988 కింద కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచి, ఆ తర్వాత చర్లపల్లి జైలుకు తరలించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో ఇంకా విచారణ కొనసాగుతుందని అన్ని రకాల వివరాలు సేకరించి ప్రత్యేక నివేదిక అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ శాఖలలో ఎవరైనా లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీతో పాటు 9440446106 వాట్సాప్‌కు ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు.


