వాషింగ్టన్: ప్రపంచంలోని పలు దేశాల్లో విరివిరిగా లభించే సహజ వనరులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్నుపడింది. చమురు నిక్షేపాలు ఇస్తారా? లేదంటే నన్నే తీసుకోమంటారా అన్న ధోరణితో బెదిరింపులకు దిగుతున్నారు.
వెనెజువెలాలో చమురు నిక్షేపాల కోసం అమెరికా సైన్యం మాజీ అధ్యక్షుడు నికొలస్ మదురోను అదుపులోకి తీసుకుంది. కేసుల మీద కేసులు బనాయించి విచారణ కొనసాగిస్తోంది. ఈ చర్యతో అమెరికా సహజ వనరులపై చూపుతున్న దాహం మరోసారి బయటపడిందని విమర్శలు వచ్చాయి. ఇక ఇప్పుడు ట్రంప్ డెన్మార్క్‌లోని లిథియం, రాగి నిక్షేపాలున్న గ్రీన్‌లాండ్ దీవిపై దృష్టి పెట్టారు.‘మాకు గ్రీన్‌లాండ్ కావాల్సిందే’ అని ఆయన ప్రత్యక్షంగా, పరోక్షంగా సంకేతాలు పంపుతున్నారు. జాతీయ భద్రత దృక్కోణంలో గ్రీన్‌లాండ్ అవసరమని ఆయన విలేకరులతో స్పష్టం చేశారు.
ట్రంప్ సీనియర్ సహాయకుడు స్టీఫెన్ మిల్లర్ భార్య కేటీ మిల్లర్ సోషల్ మీడియాలో ‘త్వరలో’ అనే పదంతో పాటు అమెరికన్ జెండా రంగులలో గ్రీన్‌లాండ్ మ్యాప్‌ను పోస్ట్ చేశారు. ఈ పోస్టు అమెరికా ఉద్దేశాలను మరింత స్పష్టంగా చూపించిందని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా ధోరణిపై గ్రీన్‌లాండ్ ప్రధాని జెన్స్ ఫ్రెడెరిక్ నీల్సన్ స్పందించారు. మీ బెదిరింపులు ఆపండి. ద్వీపాన్ని తమ నియంత్రణలోకి తీసుకోవాలని చూస్తున్న అమెరికాకు కలే అని అభివర్ణించారు. డెన్మార్క్ ప్రధాన మంత్రి మెట్టే ఫ్రెడెరిక్సెన్ కూడా డెన్మార్క్ రాజ్యంలోని మూడు దేశాలలో ఉన్న దీవిని స్వాధీనం చేసుకున్నే హక్కు అమెరికాకు లేదన్నారు.
గ్రీన్‌లాండ్ స్వయం ప్రతిపత్తి కలిగిన డానిష్ భూభాగం. ఇది నాటో సభ్యదేశం కింద వస్తుంది. ఇప్పటికే అమెరికాకు రక్షణ ఒప్పందం ద్వారా ద్వీపంలో ప్రవేశం కల్పించబడింది. అయినప్పటికీ, ట్రంప్ పదేపదే విలీనం గురించి లేవనెత్తుతూ, రక్షణ ప్రయోజనాలు, ఖనిజ సంపద కోసం దాని వ్యూహాత్మక స్థానాన్ని ప్రస్తావిస్తున్నారు.
కేటీ మిల్లర్ చేసిన సోషల్ మీడియా పోస్టుపై డెన్మార్క్ ప్రధాని స్పందించగా.. అమెరికాలోని డెన్మార్క్ రాయబారి కూడా రెండు దేశాలు మిత్రదేశాలు. డెన్మార్క్ తన భూభాగం, సరిహద్దులు, స్వయం ప్రతిపత్తి, రాజ్యంలోని భాగాలపై (డెన్మార్క్, గ్రీన్‌లాండ్, ఫారో దీవులు) ఇతర దేశాలు జోక్యం చేసుకోకుండా చూడాలని కోరుకుంటుందన్నారు.
వెనెజువెలా చమురు నిక్షేపాల కోసం అమెరికా చేసిన చర్యల తర్వాత, ఇప్పుడు గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ చూపు పడటం అంతర్జాతీయ చర్చాంశంగా మారింది. సహజ వనరుల కోసం అమెరికా తీసుకుంటున్న ధోరణి, డెన్మార్క్ ప్రతిస్పందన, నాటో ఒప్పందాలు ప్రపంచ రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి.


