ఢాకా: బంగ్లాదేశ్‌లో పరిస్థితులు రోజురోజుకు దారుణంగా మారుతున్నాయి. హిందువులే టార్గెట్‌గా దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. తాజాగా మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ హిందూ వితంతు మహిళ (40)పై బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు.. ఆమెను చెట్టుకు కట్టేసి, జుట్టు కత్తిరించారు. దీనికి సంబంధించిన వీడియో తీవ్ర కలకలం సృష్టించింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సెంట్రల్ బంగ్లాదేశ్‌లోని జెనైద్ జిల్లా, కాళిగంజ్ ప్రాంతంలో బాధితురాలు నివాసం ఉంటోంది. అయితే, కొంతకాలం క్రితం స్థానిక షహీన్ అనే వ్యక్తి నుంచి బాధితురాలు.. అక్కడ కొంత స్థలంతోపాటు, రెండు అంతస్తుల ఇంటిని కొనుగోలు చేసింది. అప్పటినుంచి షహీన్.. ఆమెను పలురకాలుగా వేధించాడు. దీనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను కొనుగోలు చేసిన ఆస్తులపై షహీన్ జోక్యం ఏంటని ప్రశ్నించింది.
ఈ క్రమంలో ఆగ్రహంతో రగలిపోయిన షహీన్.. ఆమెపై దాడి చేయడానికి సిద్దమయ్యాడు. దీంతో, హషీన్.. హసన్ అనే వ్యక్తితో కలిసి వచ్చి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. అలాగే ఆమెను చెట్టుకు కట్టేసి జుట్టు కత్తిరించారు. ఈ ఘటనను వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేకాదు.. బాధితురాలి నుంచి డబ్బు కూడా డిమాండ్ చేశారు. డబ్బు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆమె బంధువులపై కూడా దాడికి పాల్పడ్డారు. దీంతో బాధిత మహిళపై మరింతగా దాడి చేయడంతో ఆమె స్పృహ కోల్పోయింది. స్థానికులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం, బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
#BREAKING: Minority Hindu Woman raped, tortured in Bangladesh. Attacks against Hindus continue under Pro-Islamist Yunus Govt. Two locals raped a 40-year-old Hindu widow in Kaliganj, Jhenaidah l, tied her to a tree, cut off her hair & subjected her to brutal torture on Saturday. pic.twitter.com/u2wj9vOJK0
— Aditya Raj Kaul (@AdityaRajKaul) January 5, 2026
రాణా ప్రతాప్‌పై కాల్పులు..
ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్‌లో మరో హిందువుపై దాడి జరిగింది. జోషోర్ జిల్లాలో రాణా ప్రతాప్(45)పై దుండగులు కాల్పులు జరిపారు. దీంతో, రాణా ప్రతాప్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మణిరాంపూర్ ఉపజిల్లాలోని 17వ వార్డులో ఉన్న కోపాలియా బజార్ వద్ద సోమవారం సాయంత్రం 5:45 గంటల ప్రాంతంలో జరిగింది. మృతుడిని కేశబ్‌పూర్ ఉపజిల్లాలోని అరువా గ్రామానికి చెందిన తుషార్ కాంతి బైరాగి కుమారుడు రాణా ప్రతాప్ (45)గా గుర్తించారు. ఇక, ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్ లో హిందువులు, మైనారిటీలపై దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. గత నెలలో దీపు చంద్రదాస్ ను దాడి చేసి చంపేయగా, మరో హిందూ ఖోకోన్ చంద్ర దాస్ పై దాడి చేయగా అతడు కూడా మరణించారు. కాగా, గడిచిన మూడు వారాల్లో బంగ్లాదేశ్‌లో దాడుల కారణంగా మరణించిన హిందువుల సంఖ్య ఐదుకు చేరుకుంది.


