ఢాకా: బంగ్లాదేశ్‌లో ఇటీవలే నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ఇంతకాలం ఆ దేశ చీఫ్ అడ్వయిజర్‌గా వ్యవహారించిన మహ్మద్ యూనస్ ఆ బాధ్యతలనుంచి వైదొలిగారు. అయితే యూనస్‌పై బంగ్లాదేశ్ అధ్యక్షుడు షహబుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాలో అస్థిరత నెలకొనడానికి యూనస్ ప్రయత్నించారని ఆరోపించారు. అంతేకాకుండా అధ్యక్షుడిగా ఉన్న తనను అనధికారికంగా తొలిగించే కుట్రపన్నారని పేర్కొన్నారు.
బంగ్లాదేశ్‌లో ఇంతకాలం పాటు రాజకీయ అస్థిరత నెలకొంది. షేక్ హసీనా దేశాన్ని వదలిన మెుదలు ఆ దేశంలో రాజకీయ అస్థిరత ఏర్పడింది. అయితే ఈ పరిస్థితులపై ఆ దేశ అధ్యక్షుడు షహాబుద్దీన్ సంచలన ఆరోపణలు చేశారు. ఇంతకాలం ఆ దేశ చీఫ్ అడ్వయిజర్‌గా వ్యవహరించిన మహ్మద్ యూనస్ ఈ పరిస్థితులకు ప్రధాన కారణమన్నారు. ఆయన కాలంలో దేశంలో రాజకీయ అస్థిరత సృష్టించి రాజ్యాంగ సంక్షోభ పరిస్థితులు తేవడానికి యత్నించారన్నారు.
బంగ్లాదేశ్ అధ్యక్షుడు షహబుద్దీన్ మాట్లాడుతూ " ఆయన పదవిలో ఉన్నంత కాలం నేను అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ ఎటువంటి చర్చల్లో పాల్గొనలేదు. నన్ను పదవిలోంచి తొలగించే కుట్రలు జరిగాయి. అదేవిధంగా చాలాసార్లు దేశంలో అస్థిరత, అశాంతి సృష్టించి రాజ్యాంగ సంక్షోభం సృష్టించే యత్నాలు జరిగాయి. అని ఆదేశ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో పేర్కొన్నారు.
అదేవిధంగా మహ్మద్ యూనస్ తన పదవి కాలంలో ఎటువంటి రాజ్యాంగంగా నిర్వహించాల్సిన తుంగలో తొక్కారని తన విదేశీ పర్యటనల సమయంలో దేశ అధ్యక్షునికి తెలపాల్సిన కనీస సమాచారం ఇవ్వలేదన్నారు. విదేశీ పర్యటనల వివరాలు అధ్యక్షునితో పంచుకోవాల్సి ఉండగా దానిని సైతం పాటించలేదని తెలిపారు. అంతే కాకుండా తన పదవికాలంలో ఒక్కసారి కూడా తనను కలవడానికి అధ్యక్షుని నివాసానికి రాలేదని షహబుద్దీన్ తెలిపారు.
ఏడాదిన్నర కాలం పాటు యూనస్ ప్రభుత్వం తనను ప్యాలెస్ ఖైదీగా బంధించిందని కోస్వో, ఖతార్ దేశ పర్యటనలను చేయాల్సి ఉండగా తనకు అనుమతులివ్వలేదని తెలిపారు. అయితే ఒకానోక సమయంలో తన స్థానంలో మాజీ న్యాయమూర్తిని అధ్యక్షున్ని చేద్దామని భావించగా రాజ్యాంగ నియమాలు సహకరించవని ఆ న్యాయమూర్తి చెప్పడంతో వారు వెనక్కి తగ్గారని తెలిపారు.
2024 అక్టోబర్ 22న జరిగిన సంఘటన తానిప్పటికి మరిచిపోనని ఆ సమయంలో అల్లరిమూక అధ్యక్ష భవనంపై దాడికి యత్నించిందని అయితే మిలిటరీ తక్షణమే స్పందించి వారిని అడ్డుకోవడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం బీఎన్‌పీ ప్రభుత్వం రాజ్యాంగ విలువలకు అనుగుణంగా పాలన సాగిస్తోందని నమ్మకముందని షహబుద్దీన్ ఆశాభావం వ్యక్తం చేశారు.


