బ్యాంకాక్: ఆగ్నేయాసియా దేశాలు థాయ్‌లాండ్- కంబోడియా మధ్య కొద్దివారాలుగా కొనసాగుతున్న భీకర పోరుకు ఎట్టకేలకు తెరపడింది. శనివారం జరిగిన ఉన్నత స్థాయి చర్చల అనంతరం ఉభయ దేశాలు తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని నిర్ణయించాయి. కొన్ని గంటలకే ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఇరు దేశాల రక్షణ మంత్రుల సమక్షంలో జరిగిన ఈ కీలక భేటీలో ‘ఇకపై ఇరు దేశాల మధ్య ఎటువంటి సైనిక కదలికలు ఉండకూడదని, ప్రస్తుతం ఎక్కడి సైన్యాలు అక్కడే ఉండి, శాంతిని కాపాడాలంటూ ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. దీంతో గత 20 రోజులుగా వినిపిస్తున్న బాంబుల మోత ఆగిపోయి, సామాన్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
దశాబ్దాల కాలంగా ఇరు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం ఈ ఏడాది డిసెంబర్ ప్రారంభంలో తిరిగి ముదిరింది. గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో కుదిరిన శాంతి ఒప్పందం ఈ నెలలో విచ్ఛిన్నం కావడంతో, యుద్ధం తీవ్రతరమయ్యింది. థాయ్‌లాండ్ తన ఎఫ్-16 యుద్ధ విమానాలతో వైమానిక దాడులు చేయగా, కంబోడియా రాకెట్ లాంచర్లతో దీటుగా బదులిచ్చింది. ఈ హింసాకాండలో ఇప్పటివరకు సుమారు 101 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు ఐదు లక్షల మందికి పైగా జనం తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.
చారిత్రక దేవాలయాలు ఉన్న భూభాగం కోసం జరిగిన ఈ పోరు అంతర్జాతీయంగా ఆందోళన రేకెత్తించింది. శాంతి పునరుద్ధరణ కోసం రెండు దేశాల రక్షణ మంత్రులు.. నాత్థాఫోన్ నాక్ఫానిత్ (థాయ్‌లాండ్), టీ సీహా (కాంబోడియా) సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశానికి ఆసియాన్ (ఆసియాన్) పరిశీలకులు సాక్ష్యంగా నిలిచారు. తాజా ఒప్పందం ప్రకారం, సరిహద్దుల్లో ఎటువంటి అదనపు బలగాలను మోహరించకూడదని, పౌర నివాస ప్రాంతాలపై దాడులు చేయకూడదని నిర్ణయించారు. వచ్చే 72 గంటల పాటు కాల్పుల విరమణ సజావుగా సాగితే, తమ వద్ద బందీలుగా ఉన్న 18 మంది కంబోడియా సైనికులను విడుదల చేస్తామని థాయ్‌లాండ్ హామీ ఇచ్చింది. ఇరుపక్షాలు ఈ మేరకు అంగీకారం కుదుర్చుకున్నాయి.
ప్రస్తుతానికి ఇరు దేశాల సరిహద్దుల్లో తుపాకుల మోత ఆగిపోయినప్పటికీ, ఇది ఎంతకాలం నిలుస్తుందనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. మరోవైపు యుద్ధం కారణంగా నిర్వాసితులైన లక్షలాది మందిని తిరిగి వారి స్వస్థలాలకు పంపే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. కాగా గతంలో కూడా ఇలాంటి ఒప్పందాలు జరిగిన కొద్ది రోజులకే విచ్ఛిన్నం కావడంతో, అంతర్జాతీయ సమాజం పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తోంది. తాత్కాలికంగా ఇరు దేశాల మధ్య శాంతి నెలకొన్నప్పటికీ, శాశ్వత సరిహద్దు పరిష్కారం కోసం దౌత్యపరమైన చర్చలు జరగాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: భారత్‌తో వాణిజ్య ఒప్పందం.. న్యూజిలాండ్ ప్రధాని ‘ముందడుగు’


