న్యూఢిల్లీ: అంతర్జాతీయ వాణిజ్య రంగంలో న్యూజిలాండ్ మద్దతుతో భారత్ మరో కీలక మైలురాయిని అధిగమించింది. సుదీర్ఘ చర్చల అనంతరం న్యూజిలాండ్‌తో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ శనివారం అధికారికంగా ప్రకటించారు. ఇది తమ ప్రభుత్వ విజయమని, భవిష్యత్ అభివృద్ధికి ఇది పునాది వేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా ఈ ఒప్పందంపై న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి విన్‌స్టన్ పీటర్స్ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ ప్రధాని లక్సన్ భారత్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.
‘హిందుస్థాన్ టైమ్స్’ తెలిపిన వివరాల ఈ ఒప్పందం కేవలం రెండు దేశాల మధ్య వ్యాపార లావాదేవీలను మరింతగా పెంపొందించనుంది. భారత్‌లోని 140 కోట్ల మంది వినియోగదారుల మార్కెట్‌ను న్యూజిలాండ్‌కు చేరువ చేయనుంది. ప్రధాని మోదీ- లక్సన్ మధ్య జరిగిన చర్చల సారాంశం ప్రకారం.. రాబోయే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు కావడమే కాకుండా, వచ్చే 15 ఏళ్లలో భారత్‌లో సుమారు 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఏర్పడనుంది. భారత్ నుండి ఔషధ ఉత్పత్తులు, న్యూజిలాండ్ నుండి అటవీ, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు ప్రధానంగా ఈ ఒప్పందంలో భాగంగా ఉన్నాయి. తద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఇరు దేశాలు భావిస్తున్నాయి.
కాగా న్యూజిలాండ్ అధికార సంకీర్ణ ప్రభుత్వంలో ఈ భారత్‌తో ఒప్పందం చిచ్చు రేపింది. ఆ దేశ విదేశాంగ మంత్రి విన్‌స్టన్ పీటర్స్ ఈ డీల్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఇది అశాస్త్రీయమైనదని విమర్శించారు. ముఖ్యంగా న్యూజిలాండ్ పాడి పరిశ్రమ (డైరీ సెక్టార్) ప్రయోజనాలను ఈ ఒప్పందంలో తాకట్టు పెట్టారన్నారు. పాల ఉత్పత్తులపై భారత్ సుంకాలను తగ్గించలేదని పీటర్స్ ఆరోపిస్తున్నారు. అలాగే భారతీయులకు ఉపాధి వీసాల విషయంలో సులభతర నిబంధనలు తీసుకురావడాన్ని ఆయన తప్పుబట్టారు. దీని కారణంగా స్థానిక న్యూజిలాండ్ ప్రజల ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుందని ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందంపై తమ దేశంలో రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నప్పటికీ ప్రధాని లక్సన్ దీని అమలుకు మొగ్గుచూపారు. కాగా 2024 నాటికి రెండు దేశాల మధ్య వాణిజ్యం 2.07 బిలియన్ డాలర్లుగా ఉండగా, అందులో భారత్ ఎగుమతులే అధికంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ కొత్త ఒప్పందంతో భారత్‌కు న్యూజిలాండ్ రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది.
ఇది కూడా చదవండి: Myanmar Elections: ప్రజాస్వామ్యంపై ‘జుంటా’ బరితెగింపు..


