మయన్మార్.. ఒకనాడు శాంతికి, ఆధ్యాత్మికతకు నిలయం. అయితే ఇప్పుడు ఈ దేశం హింసాయుత ఘటనల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఇక్కడి అందమైన పగోడాల(బౌద్ధ ఆరామాలు) నీడన అమాయక ప్రజల ఆర్తనాదాలు ప్రతిధ్వనిస్తున్నాయి. దశాబ్దాలుగా సాగుతున్న సైనిక అణచివేత, ఇప్పుడు ఎన్నికల పేరుతో మరింత శక్తిని పొందేందుకు సిద్ధమవుతోంది. ప్రజాస్వామ్యం పునరుద్ధరణ పేరుతో జరుగుతున్న ఈ తతంగం వెనుక దాగిన వాస్తవాలను తెలియజెప్పడమే ఈ కథనం ఉద్దేశం.
అంతులేని ‘జుంటా’ అరాచకాలు
మయన్మార్ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే.. ఈ దేశంలో ప్రజాస్వామ్యానికీ సైనిక నియంతృత్వానికీ మధ్య యుద్ధం కొన్ని తరాలుగా సాగుతూ వస్తోంది. 2021 ఫిబ్రవరిలో జరిగిన సైనిక తిరుగుబాటు ఆ దేశ ప్రజల ప్రజాస్వామ్య ఆశలపై ఒక్కసారిగా నీళ్లు చల్లింది. నాడు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన అంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని కూల్చివేసి, అధికారాన్ని హస్తగతం చేసుకున్న మిలిటరీ ‘జుంటా’ దేశంలో నిరంతరం తన ప్రతాపాన్ని చూపుతూ వస్తోంది. ‘జుంటా’ అరాచకాలకు వేలాది మంది ప్రజలు మృతి చెందారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అయితే స్వేచ్ఛ కోసం వారి పోరాటం కొనసాగుతూనే ఉంది.
40కి పైగా పార్టీలను నిషేధించి..
ఇప్పుడు జరగబోతున్న ఈ ఎన్నికలు, క్రూరమైన ‘జుంటా’ సైనిక పాలనకు చట్టబద్ధత కల్పించే ఒక ప్రయత్నంగా కనిపిస్తున్నాయని ‘ది గార్డియన్’ తన కథనంలో పేర్కొంది. మయన్మార్‌లో ప్రస్తుతం మూడు దశలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి దశ పోలింగ్ 2025, డిసెంబర్ 28న, రెండవ దశ 2026, జనవరి 11న, చివరి దశ పోలింగ్ జనవరి 25న జరగనుంది. అంగ్ సాన్ సూకీ తదితర నేతలు ఇంకా జైలులోనే మగ్గుతుండగా, ‘జుంటా’ 40కి పైగా రాజకీయ పార్టీలను నిషేధించి, కేవలం తమకు అనుకూలంగా ఉండే వారితోనే ఎన్నికలు నిర్వహించడం అనేది ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమేననే వాదన వినిపిస్తోంది. ఇది కేవలం ప్రపంచ దేశాల కళ్లకు గంతలు కట్టడానికి వేస్తున్న ఒక నాటకం తప్ప, ప్రజల అభీష్టాన్ని గౌరవించే ప్రక్రియ కాదని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు.
‘జుంటా’ సైన్యానికి ఎదురు దెబ్బలు
ఈ ఎన్నికల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం ఏమిటినే విషయానికొస్తే.. దేశంలోని సగం కంటే ఎక్కువ భూభాగం ప్రస్తుతం సైనిక నియంతృత్వం చేతుల్లో లేదు. వివిధ జాతుల సాయుధ బలగాలు, పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్.. జుంటా సైన్యాన్ని ముప్పు తిప్పులు పెడుతున్నాయి. దేశం అంతర్యుద్ధంతో అట్టుడుకుతోంది. ఇటువంటి సమయంలో పోలింగ్ పూర్తయ్యాక ఓట్ల లెక్కింపు సవ్యంగా సానేగా అనేది ప్రశ్నార్థకంగా మారింది. దేశంలో సగానికిపైగా ప్రాంతాల్లో ఓటర్ల జాబితా కూడా సిద్ధం కాకుండానే సైన్యం అన్నీ బాగున్నాయని చెబుతూ ప్రపంచాన్ని భ్రమ పరుస్తూ, ఎన్నికల దిశగా ముందుకు వెళుతోందనే మాట వినిపిస్తోంది. మయన్మార్ సైన్యాన్ని జుంటా అని పిలవడానికి ప్రత్యేక కారణముంది. దేశాన్ని సైనిక నేతల కమిటీ పాలిస్తున్నందున దీనికి ‘జుంటా’ అనే పేరు వచ్చింది. జుంటా అంటే ‘కమిటీ’ లేదా ‘సమావేశం’ అని అర్థం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకున్నప్పుడు ‘జుంటా’ అనే పదాన్ని ఉపయోగిస్తారు. 2021లో మయన్మార్ సైన్యం.. అంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని తప్పించి, అధికారం చేపట్టినప్పటి నుండి ‘జుంటా’ సైన్యం పాలన అని అంటున్నారు.
కత్తి పెట్టి ఓటు అడుగుతారా?
ఇటువంటి తరుణంలో సైన్యం విడుదల చేసిన కొత్త ఎన్నికల నిబంధనలు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఏదైనా పార్టీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు భారీ మొత్తంలో నగదు డిపాజిట్ చేయాలి. వేల సంఖ్యలో సభ్యులను కలిగి ఉండాలి. ఈ నిబంధన చిన్న రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్యవాదులపై నీళ్లు చల్లేదిగా మారింది. దీనివల్ల రేపు ఎన్నికల్లో గెలిచేది ఎవరో ముందే అంచనా వేయవచ్చంటున్నారు. ఈ పరిస్థితుల్లో
మయన్మార్ సామాన్య ప్రజల వేదన వర్ణనాతీతంగా ఉంది. ‘మాకు ఓటు వేసే హక్కు కావాలి.. అయితే అది మా గొంతు మీద కత్తి పెట్టి అడిగేదిగా కాకూడదు’ అని వారంటున్నారు. భయం నీడన జరిగే ఏ ఎన్నికలైనా ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించలేవు. ఈ ఎన్నికల తంతు పూర్తయ్యాక దేశంలో హింస మరింతగా పెరుగుతుందని, సాయుధ తిరుగుబాటుదారుల పోరాటం ఉధృతం అవుతుందని మేధావులు హెచ్చరిస్తున్నారు.
చైనా మద్దతు వెనుక ఏముంది?
మయన్మార్ ‘జుంటా’ నిర్వహించిన జనాభా గణన ప్రకారం దేశంలోని 5.1 కోట్ల జనాభాలో దాదాపు 1.9 కోట్ల మంది వివరాలు సేకరించడం సాధ్యపడలేదు. భద్రతా కారణాల రీత్యా దేశంలోని పలు ప్రాంతాలకు అధికారులు వెళ్లలేకపోయారు. దీంతో ఏ ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. అయితే చైనా వంటి దేశాలు ఈ ఎన్నికలకు మద్దతు ఇవ్వడం వెనుక వారి వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే మయన్మార్ ప్రజలు ఈ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నారు. ప్రజాస్వామ్య ముసుగులో నిరంకుశ సైనిక పాలన కొనసాగుతున్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం వారు ప్రపంచదేశాల సాయం వైపు చూస్తున్నారు.
ఇది కూడా చదవండి: విష్ణు విగ్రహం కూల్చివేత.. థాయ్ వివరణ


