బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రక్కా ప్రణాళిక ప్రకారమే ఆ దేశంలో మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని వాటిని నియంత్రించాల్సిన అవసరం ఉందని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితికి లేఖ రాశాయి.
ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో హిందువులపై పెద్దఎత్తున దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్కడి రాడికల్ నేత ఉస్మాన్ హాదీ మరణంతో ఆ దేశంలో మైనార్టీలపై ప్రత్యేకించి హిందువులపై పెద్దఎత్తున దాడులు చేసి చంపారు. దీనిపై భారత్ సైతం ఎన్ని సార్లు స్పందించిన పెద్దగా ఫలితం లేకపోయింది. అయితే ఇప్పుడు ఈ అంశంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
"హిందూ అడ్వాన్సింగ్ ఉమన్ రైట్స్" అనే అంతర్జాతీయ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఈ దాడులకు నిరసనగా మద్దతు కూడగట్టింది. దాదాపు 15 దేశాలకు చెందిన 125 సంస్థల సహకారంతో ఐక్యరాజ్య సమితికి లేఖ రాసింది. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వంలో పక్కా ప్రణాళిక ప్రకారమే హిందువులపై దాడులు జరుగుతున్నాయని తక్షణమే వాటిని నివారించాల్సిన అవసరం ఉందని కోరింది. ఈ అంశంలో యూరోపియన్ యూనియన్ తో పాటు భారత్ ఇతర దేశాలు, సంస్థలు జోక్యం చేసుకోవాలని తెలిపింది.
ఈ దాడులు ఇలాగే కొనసాగితే ఆ దేశంలోని మైనార్టీలు తీవ్రఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొంది. అయితే 2024లో షేక్ హాసీనా బంగ్లాదేశ్‌ను వదిలిన నాటి నుంచి ఆ దేశంలో మైనార్టీలపై విపరీతంగా దాడులు తీవ్రంగా జరుగుతన్నాయి. హత్యలు, ఆలయాలపై దాడి, ఆస్తుల ఆక్రమణ ఇలా ఎన్నో అఘాయిత్యాలతో ఆ దేశంలోని హిందువులు భయభ్రాంతులకు గురువుతున్నారు. అయితే బంగ్లాదేశ్‌లో రేపు ఫిబ్రవరి 12న సాధారణ ఎన్నికలు జరగనున్నాయి.


