కెనడాలో కర్నాటక వాసి కాల్చివేత  | Bengaluru-origin techie shot dead in Canada | Sakshi
Sakshi News home page

కెనడాలో కర్నాటక వాసి కాల్చివేత 

Feb 10 2026 6:31 AM | Updated on Feb 10 2026 6:31 AM

Bengaluru-origin techie shot dead in Canada

ఒట్టావా/బెంగళూరు: కెనడాలోని టొరంటో నగరంలో ఉన్న షాపింగ్‌ సెంటర్‌ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో కర్నాటక వాసి (37) ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మృతుడిని బ్రాంప్టన్‌లో ఉండే చందన్‌ కుమార్‌ రాజా నందకుమార్‌గా కెనడా పోలీసులు గుర్తించారు. వుడ్‌బైన్‌ షాపింగ్‌ సెంటర్‌ వాహన పార్కింగ్‌ ప్రాంతంలో శనివారం సాయంత్రం 3.30 గంటల సమయంలో ఘటన చోటుచేసుకుంది. 

కాల్పుల గురించి సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నామని పోలీసులు తెలిపారు. బుల్లెట్‌ గాయాలతో పడి ఉన్న వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించామని, చికిత్స పొందుతూ అతడు చనిపోయాడన్నారు. చందన్‌కుమార్‌ వాహనం కిటికీల అద్దాలకు బుల్లెట్‌ రంధ్రాలు పడగా, డ్రైవర్‌ వైపు ఉన్న కిటికీ అద్దం పూర్తిగా ధ్వంసమైంది. కాగా, కాల్పులకు పాల్పడిన వ్యక్తుల వివరాలు తెలియనప్పటికీ, దీనిని లక్షిత ఘటనగా భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. 

ఇంటికి రావాలని చెబుతున్నా...వినలేదు:తల్లిదండ్రులు 
చందన్‌ మరణవార్త విని కర్నాటక రాజధాని బెంగళూరులో శివారు నెలమంగళలో ఉంటున్న అతడి తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. ఇలాంటిది జరుగుతుందని తాము కలలో సైతం ఊహించలేదన్నారు. దాదాపు ఏడేళ్ల నుంచి కెనడాలో ఉంటున్న చందన్‌ను ఇంటికి రావాలని ఎప్పటి నుంచో కోరుతున్నామని, కానీ వినిపించుకోలేదని తండ్రి నందన్‌ కుమార్‌ వాపోయారు. అంతిమ సంస్కారం జరిపేందుకు మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు సాయం చేయాలని భారత ప్రభుత్వాన్ని ఆయన కోరారు. చందన్‌ టొరంటోలో ఇటీవలే కన్నడ అసోసియేషన్‌ను స్థాపించారని, బహుశా ఇదే కక్షతో అతడిని బలి తీసుకుని ఉంటారని తల్లి అనుమానం వ్యక్తం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement