శిక్షణ ఇస్తుండగా ప్రమాదం... పైలట్, ట్రైనీకి గాయాలు
సాక్షి, బళ్లారి/బనశంకరి: కర్ణాటకలో చిన్నపాటి విమానం కూలిపోయింది. విజయపుర (బిజాపుర) జిల్లా బబళేశ్వర తాలూకా మంగళూరు వద్ద పొలాల్లో రెండు సీట్లు ఉన్న ఈ శిక్షణ విమానం కూలింది. ఇది రెడ్‌బర్డ్ పైలట్ ట్రైనింగ్ ఏవియేషన్‌కు చెందినదని తెలిసింది. ఈ సంస్థ విమాన పైలట్లకు శిక్షణ ఇస్తుంది. ఆదివారం శిక్షణలో భాగంగా ఓ పైలట్, ట్రైనీతో కలిసి కలబుర్గి నుంచి బెళగావికి బయలుదేరింది. అయితే మార్గంమధ్యలో విమానంలో యాంత్రిక లోపం తలెత్తడంతో పైలట్ అత్యవసరంగా దించేందుకు యతి్నంచాడు.
పంట కోసిన ఓ మొక్కజొన్న పొలంలో విమానం దిగుతూ పల్టీ కొట్టి పడిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ కెప్టెన్ కునాల్ మల్హోత్రా, ట్రైనీ పీఆర్ గౌతం శంకర్‌కి గాయాలయ్యాయి. కొంతసేపటికి స్థానికులు, పోలీసులు చేరుకుని వారిని విజయపురలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. విమానం ఆకాశం నుంచి గిరగిరా తిరుగుతూ పడిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ ధాటికి విమానం మూడు ముక్కలుగా దెబ్బతింది. గాయపడిన వారు నడుస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


