మెగా చినాబ్‌ డ్యామ్‌ ప్రాజెక్ట్‌ వేగవంతం  | Narendra Modi Govt Kicks Off Mega Dam Project On Chenab River | Sakshi
Sakshi News home page

మెగా చినాబ్‌ డ్యామ్‌ ప్రాజెక్ట్‌ వేగవంతం 

Feb 9 2026 5:39 AM | Updated on Feb 9 2026 5:39 AM

Narendra Modi Govt Kicks Off Mega Dam Project On Chenab River

సావల్‌కోట్‌ జలవిద్యుత్‌ ప్రాజెక్ట్‌ను పూర్తిచేయాలని మోదీ సర్కార్‌ నిర్ణయం 

పాకిస్తాన్‌కు జలకష్టాలు తేనున్న భారత హైడ్రో ప్రాజెక్టులు

న్యూఢిల్లీ: ముష్కర మూకల దాడులతో పేట్రేగిపోతున్న పాకిస్తాన్‌కు బుద్ధిచెప్పే లక్ష్యంతో పాకిస్తాన్‌ జల జీవనాడిని దెబ్బకొట్టాలని మోదీ సర్కార్‌ నిర్ణయించింది. ఇందులోభాగంగా సరిహద్దు ప్రాంతాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా మెగా చినాబ్‌ డ్యామ్‌ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. రామ్‌బాన్‌ జిల్లాలో రూ.5,129 కోట్లతో నిర్మించతలపెట్టిన సావల్‌కోట్‌ జలవిద్యుత్‌ ప్రాజెక్ట్‌ కోసం తాజాగా టెండర్లు పిలిచింది. 

ప్రభుత్వ రంగ నేషనల్‌ హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఈ టెండర్లను ఆహ్వానించింది. పాకిస్తాన్‌కు నీటి అవసరాలు తీర్చే చినాబ్‌ నదిపై ఈ జలవిద్యుత్‌ కేంద్రాన్ని నిర్మించనున్నారు. 1,856 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించబోయే ఈ ప్రాజెక్ట్‌పూర్తయితే ఈ ప్రాంతంలోనే అతిభారీ హైడ్రోఎలక్ట్రిక్‌ ప్రాజెక్ట్‌గా ఇది నిలిచిపోనుంది. 

సిందూ నదీజలాల ఒప్పందాన్ని స్తంభింపజేసిన నేపథ్యంలో పాకిస్తాన్‌కు బుద్ధిచెప్పడంతోపాటు సరిహద్దు ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి కొత్త ప్రాజెక్ట్‌ బాటలుపరుస్తుందని ఎన్‌డీఏ సర్కార్‌ తాజాగా పునరుద్ఘాటించింది. కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించి డ్యామ్, సొరంగాలు, అనుబంధ పనులకు సంబంధించిన టెండర్లు వచ్చే నెల 12వ తేదీతో మొదలై 20వ తేదీతో ముగుస్తాయి. టెండర్లలోని నిబంధనలు బిడ్‌ అనేది గరిష్టంగా 180 రోజులపాటు మనుగడలో ఉంటుంది. గరిష్టంగా 3,285 రోజుల్లోపు ప్రాజెక్ట్‌ను పూర్తిచేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఏకబిగిన దాదాపు పదిసంవత్సరాలపాటు డ్యామ్‌ నిర్మాణపనులు జరగనున్నాయి.  

దశాబ్దాల కల...: ఈ ప్రాంతంలో సావల్‌కోట్‌ హైడ్రోఎలక్ట్రిక్‌ డ్యామ్‌ కట్టాలని భారత్‌ దశాబ్దాల క్రితమే భావించింది. అయితే గతంలో పాక్‌తో సింధూ నదీజలాల ఒప్పందం అమల్లో ఉండటం, సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు కాస్తంత తగ్గుముఖం పట్టడంతో ఈ ప్రాజెక్ట్‌ కాగితాలకే పరిమితమైంది. అయితే గత ఏడాది పహల్గామ్‌ పచ్చికమైదానాల్లో 26 మంది అమాయక పర్యాటకులను ముష్కరులు పాయింట్‌ బ్లాంక్‌లో కాల్చి హేయమైన చర్యలకు దిగడంతో భారత్‌ ఉగ్రరూపం దాల్చింది. 

ఆపరేషన్‌ సిందూర్‌ పేరిట ముష్కరుల శిక్షణ శిబిరాలతోపాటు పాక్‌ వైమానిక స్థావరాలపై ముప్పేట దాడులు చేసింది. ఆ తర్వాత సిందూ నదీజలాల ఒప్పందం నుంచి గత ఏడాది ఏప్రిల్‌ నెలలో తప్పుకుంది. పాకిస్తాన్‌కు నీటికష్టాలు పెంచాలనే ఉద్దేశంతో వెంటనే పాత సావల్‌కోట్‌ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించింది. ఈ ప్రాజెక్ట్‌ పూర్తయితే జమ్మూకశీ్మర్‌ విద్యుత్‌ కష్టాలు తీరడంతోపాటు జాతీయ పవర్‌గ్రిడ్‌ సామర్థ్యం సైతం పెరుగుతుంది. స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు ఈ ప్రాంతంలో మౌలికసదుపాయాలు మెరుగవనున్నాయి.  

Advertisement
 
Advertisement
Advertisement