breaking news
Dam project
-
మెగా చినాబ్ డ్యామ్ ప్రాజెక్ట్ వేగవంతం
న్యూఢిల్లీ: ముష్కర మూకల దాడులతో పేట్రేగిపోతున్న పాకిస్తాన్‌కు బుద్ధిచెప్పే లక్ష్యంతో పాకిస్తాన్ జల జీవనాడిని దెబ్బకొట్టాలని మోదీ సర్కార్ నిర్ణయించింది. ఇందులోభాగంగా సరిహద్దు ప్రాంతాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా మెగా చినాబ్ డ్యామ్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. రామ్‌బాన్ జిల్లాలో రూ.5,129 కోట్లతో నిర్మించతలపెట్టిన సావల్‌కోట్ జలవిద్యుత్ ప్రాజెక్ట్ కోసం తాజాగా టెండర్లు పిలిచింది. ప్రభుత్వ రంగ నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ఈ టెండర్లను ఆహ్వానించింది. పాకిస్తాన్‌కు నీటి అవసరాలు తీర్చే చినాబ్ నదిపై ఈ జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మించనున్నారు. 1,856 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించబోయే ఈ ప్రాజెక్ట్పూర్తయితే ఈ ప్రాంతంలోనే అతిభారీ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్‌గా ఇది నిలిచిపోనుంది. సిందూ నదీజలాల ఒప్పందాన్ని స్తంభింపజేసిన నేపథ్యంలో పాకిస్తాన్‌కు బుద్ధిచెప్పడంతోపాటు సరిహద్దు ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి కొత్త ప్రాజెక్ట్ బాటలుపరుస్తుందని ఎన్డీఏ సర్కార్ తాజాగా పునరుద్ఘాటించింది. కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించి డ్యామ్, సొరంగాలు, అనుబంధ పనులకు సంబంధించిన టెండర్లు వచ్చే నెల 12వ తేదీతో మొదలై 20వ తేదీతో ముగుస్తాయి. టెండర్లలోని నిబంధనలు బిడ్ అనేది గరిష్టంగా 180 రోజులపాటు మనుగడలో ఉంటుంది. గరిష్టంగా 3,285 రోజుల్లోపు ప్రాజెక్ట్‌ను పూర్తిచేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఏకబిగిన దాదాపు పదిసంవత్సరాలపాటు డ్యామ్ నిర్మాణపనులు జరగనున్నాయి. దశాబ్దాల కల...: ఈ ప్రాంతంలో సావల్‌కోట్ హైడ్రోఎలక్ట్రిక్ డ్యామ్ కట్టాలని భారత్ దశాబ్దాల క్రితమే భావించింది. అయితే గతంలో పాక్‌తో సింధూ నదీజలాల ఒప్పందం అమల్లో ఉండటం, సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు కాస్తంత తగ్గుముఖం పట్టడంతో ఈ ప్రాజెక్ట్ కాగితాలకే పరిమితమైంది. అయితే గత ఏడాది పహల్గామ్ పచ్చికమైదానాల్లో 26 మంది అమాయక పర్యాటకులను ముష్కరులు పాయింట్ బ్లాంక్‌లో కాల్చి హేయమైన చర్యలకు దిగడంతో భారత్ ఉగ్రరూపం దాల్చింది. ఆపరేషన్ సిందూర్ పేరిట ముష్కరుల శిక్షణ శిబిరాలతోపాటు పాక్ వైమానిక స్థావరాలపై ముప్పేట దాడులు చేసింది. ఆ తర్వాత సిందూ నదీజలాల ఒప్పందం నుంచి గత ఏడాది ఏప్రిల్ నెలలో తప్పుకుంది. పాకిస్తాన్‌కు నీటికష్టాలు పెంచాలనే ఉద్దేశంతో వెంటనే పాత సావల్‌కోట్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే జమ్మూకశీ్మర్ విద్యుత్ కష్టాలు తీరడంతోపాటు జాతీయ పవర్‌గ్రిడ్ సామర్థ్యం సైతం పెరుగుతుంది. స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు ఈ ప్రాంతంలో మౌలికసదుపాయాలు మెరుగవనున్నాయి. -
బ్రహ్మపుత్రపై డ్యామ్‌కు రూ. 15.27 లక్షల కోట్లు!
బీజింగ్: భారత్‌కు అత్యంత ముప్పుగా చెబుతున్న బ్రహ్మపుత్ర నదిపై భారీ డ్యామ్ నిర్మాణానికి ఏకంగా దాదాపు రూ.15.27 లక్షల కోట్లు(170 బిలియన్ డాలర్లు) కేటాయిస్తున్నట్టు అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ప్రకటించారు. బుధవారం నూతన సంవత్సర ప్రసంగంలో ఆయన ఈ మేరకు వెల్లడించారు. విద్యుదుత్పత్తి సాకుతో అరుణాచల్ ప్రదేశ్ కు అతి సమీపంగా టిబెట్ భూభాగంలో ఈ భారీ డ్యామ్ నిర్మాణాన్ని చైనా తలపెట్టడం తెలిసిందే. దీనివల్ల ఈశాన్య రాష్ట్రాలకు వరద ముప్పు పెరుగుతుందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక వైషమ్యాలు పెచ్చరిల్లిన వేళ ప్రా జెక్టులోని జలరాశిని మనపైకి జలఖడ్గంలా చైనా వాడే ప్రమాదం కూడా ఉందని వారంటున్నారు. అలాంటి డ్యామ్ విషయంలో దూకుడుగా ముందుకు వెళ్లేందుకే చైనా నిర్ణయించుకుందని జిన్ పింగ్ ప్రకటన తేటతెల్లం చేసింది. తైవాన్‌కు వార్నింగ్ తైవాన్ను ఎప్పటికైనా చైనాలో విలీనం చేసుకుని తీరతామని జిన్ పింగ్ పునరుద్ఘాటించారు. దీన్ని ఎవరూ ఆపలేరని కూడా అన్నారు. తద్వారా తైవాన్ కు మద్దతు పలుకుతున్న అమెరికా వంటి దేశాలను అన్యాపదేశంగా ఆయన హెచ్చరించారు. తైవాన్ చుట్టూ సైనిక కసరత్తులను కొద్ది రోజులుగా చైనా మరింత ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. -
మనపై చైనా వాటర్ బాంబ్
బ్రహ్మపుత్రా నది పై చైనా తలపెట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్ట ‘మెడోగ్’భారత్ పాలిట ‘నీటి బాంబు’గా మారనుందని అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ ఆందోళన వెలిబుచ్చారు. ఈశాన్యంలోని సరిహద్దు రాష్ట్ర ప్రజలకు, వారి జీవనోపాధికి ఈ ప్రాజెక్టు పెను ముప్పు అవుతుందన్నారు. ‘‘ఏ అంతర్జాతీయ జల ఒప్పందాలపైనా సంతకం చేయని చైనా ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. ఆ డ్యామ్‌ను మనపైకి నీటి బాంబుగా కూడా ఉపయోగించొచ్చు’’అని హెచ్చరించారు. దాంతో మెడోగ్ డ్యామ్ మరోసారి చర్చల్లో నిలిచింది. గోప్యతపై అనుమానాలు... టిబెట్‌లోని యార్లుంగ్ సాంగ్సో (బ్రహ్మ పుత్ర) నదిపై ప్రపంచంలోనే అతి పెద్ద ఆనకట్టను చైనా నిర్మిస్తోంది. ఈ నది అరుణాచల్‌లో సియాంగ్‌గా, అస్సాంలో బ్రహ్మపుత్రగా మారి, బంగ్లాదేశ్‌లోకి ప్రవహిస్తుంది. అక్కడి నుంచి సముద్రంలో కలుస్తుంది. మెడోగ్ డ్యామ్ ద్వారా ఏకంగా 60 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తిని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. ఇది భారత సరిహద్దుకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందుకే దీన్ని ‘టిక్‌టిక్ అంటున్న వాటర్ బాంబ్’గా ఖండు అభివరి్ణంచారు. మెడోగ్ కేవలం నదీప్రవాహ ప్రాజెక్టు అని చైనా అంటున్నా ఆ ముసుగులో అతి భారీ జలాశయాన్ని నిర్మిస్తోందని చెబుతున్నారు. ఇది భారీగా నీటిని నిల్వ చేస్తుందని, దిగువ ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుందని అంటున్నారు. ఆనకట్ట నిర్మాణానికి ఆమోదం లభించినట్లు 2024లో వార్తలొచ్చాయి. ఈ ప్రాజెక్టుపై చైనా ఆద్యంతం గోప్యత పాటిస్తుడటం, అంతర్జాతీయ జల ఒప్పందాలపై సంతకం చేయడానికి నిరాకరించడం పర్యావరణంగా, భౌగోళికంగా, రాజకీయపరంగా భారత్‌కు పెను ఆందోళన కలిగిస్తోంది. అంతేగాక ప్రాంతీయ ఉద్రిక్తతలను కూడా రాజేస్తోంది. ఈ ఆనకట్టను అరుణాచల్ అస్తిత్వానికే ముప్పుగా నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు.‘గ్రేట్ బెండ్’ వద్దే నిర్మాణం అరుణాచల్‌కు సమీపంలో సాంగ్సో నది ఉన్నట్టుండి వలయాకారంగా వంపు తిరుగుతుంది. సరిగ్గా ఈ ‘గ్రేట్ బెండ్’వద్దే చైనా ఆనకట్ట కడుతోంది. అక్కడి నుంచి నేరుగా అరుణాచల్‌కు చేరుతుంది. ఈ నేపథ్యంలో నదీ ప్రవాహంలో ఎలాంటి అసాధారణ మార్పులు జరిగినా భారీ వరదలు తప్పవు. అదే జరిగితే సియాంగ్ బెల్ట్ మొత్తం నాశనమవుతుంది. అక్కడి ఆదిమ తెగలు, ఇతర వర్గాలతో పాటు విస్తారమైన అటవీ ప్రాంత అస్తిత్వం కూడా ముప్పులో పడుతుంది. ఎగువ దేశంగా నదీ ప్రవాహంపై చైనాకు అతి కీలకమైన వ్యూహాత్మక నియంత్రణ ఉండటమే ఇందుకు కారణం. నీటిని అది ఏకపక్షంగా మళ్లిస్తే భారత్‌తోపాటు బంగ్లాదేశ్‌కు కూడా తీవ్ర నష్టం తప్పదు. నీటి ప్రవాహాన్ని తగ్గితే ఈశాన్య రాష్ట్రాలతో పాటు బంగ్లాలో సాగు, మత్స్యకార కార్యకలాపాలు, జీవనోపాధికి నష్టం వాటిల్లుతుంది. అందుకే ఈ డ్యామ్ నిర్మాణంపై భారత్ గట్టిగా అభ్యంతరాలు వ్యక్తం చేయాలని చైనాలోని భారత మాజీ రాయబారి అశోక్ కాంత సూచించారు. ‘మెడోగ్ కేవలం ప్రాజెక్టు కాదు. చాలా క్లిష్టమైన ప్రాంతంలో వ్యూహాత్మకంగా నిర్మిస్తున్న అతి భారీ జలాశయం. ఇది చాలా ప్రమాదకర పరిణామం. అత్యంత బాధ్యతారహితమైన ప్రాజెక్టు’’అని హెచ్చరించారు. మరికొందరు నిపుణులు మాత్రం భయాందోళనలు అవసరం లేదంటున్నారు. ఈ ఆనకట్ట ద్వారా బ్రహ్మపుత్రా జలాలను మనపైకి ఆయుధంగా వాడటం చైనా ఉద్దేశం కాబోదని చెబుతున్నారు. నదిలోని భారీ ప్రవాహాన్ని చైనా ఆపజాలదని చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రైతుబంధు అక్రమార్కులకు షాక్.. రూ. 300 కోట్లు ఆదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం సేకరించిన భూముల బదలాయింపు జరగకపోవడంతో, రైతుల పేరిట దర్జాగా ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు సాయం తీసుకుంటున్న అక్రమార్కులకు షాక్ తగిలింది. భూముల లెక్కలు పక్కాగా తేలడంతో, ప్రాజెక్టుల కిందికి వచ్చే సుమారు లక్షా యాభై వేల ఎకరాల భూమిని ఇరిగేషన్ శాఖ స్వాధీనం చేసుకుంది. మ్యుటేషన్ ప్రక్రియ కూడా పూర్తి కావడంతో ప్రభుత్వానికి పెద్దమొత్తంలో ఆర్థిక భారం తగ్గింది. అక్రమార్కులకు ఏటా కనీసంగా రూ.300 కోట్లు చెల్లించాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రాజెక్టుల ముంపు భూములతో పాటు, గుట్టలకు, ఎప్పుడో ఏర్పడిన కాలనీల భూములకు సైతం కొందరు అక్రమార్కులు.. రైతుల పేరిట ‘రైతుబంధు’ సాయం పొందుతుండటంపై ‘సాక్షి’ ఇటీవల కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఏడాదిగా కసరత్తు..ఎట్టకేలకు కొలిక్కి రాష్ట్రంలో వివిధ సాగు నీటి ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములు, వాటిల్లో కబ్జాకు గురైన భూములు, మ్యుటేషన్ జరగని భూముల వివరాలు తేల్చాలని గత ఏడాది కేసీఆర్ ఇరిగేషన్ శాఖను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఇన్వెంటరీ (ఆస్తుల జాబితా) పేరుతో శాఖ ఆస్తులు, భూముల వివరాలు సేకరించారు. ఇందులో భాగంగానే నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, బీమా, నెట్టెంపాడు, కాళేశ్వరంతో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టుల కింద ఉన్న భూముల వివరాలు సేకరించారు. ఆయా భూముల నిమిత్తం రైతులకు పరిహారం అందజేసినా, మ్యుటేషన్ కాని కారణంగా వాటిని భూ యజమానులే అనుభవిస్తున్నారని, రైతుబంధు సైతం పొందుతున్నారని గుర్తించారు. అలాగే కొన్నిచోట్ల ముంపులో ఉన్న భూములకు కొందరు అక్రమార్కులు పెట్టుబడి సాయం పొంతున్నారని తేల్చారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో భూములు మ్యుటేషన్ కాలేదని గుర్తించిన సాగునీటి శాఖ, ఆయా ప్రాజెక్టుల పరిధిలోని జిల్లాల్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయాల్లో రికార్డుల ఆధారంగా ఆ భూముల వివరాలను బయటకు తీసింది. భారీ ప్రాజెక్టుల కింద 6.19 లక్షల ఎకరాలు, మధ్యతరహా ప్రాజెక్టుల కింద 76 వేల ఎకరాలు, చిన్నతరహా ప్రాజెక్టుల కింద 5.84 లక్షల ఎకరాలు కలిపి మొత్తంగా 12.79 లక్షల ఎకరాలు శాఖకు చెందినవిగా గుర్తించింది. ఇందులో సుమారు 1.50 లక్షల ఎకరాల భూమి మ్యుటేషన్ జరగలేదని గుర్తించింది. వీటిల్లో ప్రధాన ప్రాజెక్టులైన ఎస్సారెస్పీ స్టేజ్–1లో సుమారు 10,600 ఎకరాలు, స్టేజ్–2లో 6,300 ఎకరాలు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు పరిధిలో 7,170 ఎకరాలు, ప్రాణహితలో 5 వేలు, వట్టివాగులో 740, సత్నాలలో 730, బీమాలో 425 ఎకరాలు, నెట్టెంపాడులో 2,700 ఎకరాలు, కాళేశ్వరం ప్రాజెక్టులో సుమారు 22 వేలు, వరద కాల్వ పరిధిలో 4,500, మిడ్‌మానేరులో 2వేల ఎకరాల మేర మ్యుటేషన్ కాలేదని గుర్తించారు. ఈ భూములకు అక్రమార్కులు రైతుబంధు పొందుతున్నారని తేల్చారు. ఇటీవల ఈ భూముల తిరిగి స్వాధీనంపై సమావేశాలు నిర్వహించి, రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకుంటూ భూములను శాఖ పేరుపై బదలాయించారు. దీంతో ప్రభుత్వంపై ఏటా రూ.300 కోట్ల మేర రైతుబంధు భారం తగ్గుతుందని లెక్కగట్టారు. -
ఎట్టకేలకు ‘మెయింటెనెన్స్’కు మోక్షం!
బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వరద గేట్ల నిర్వహణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. మరో రెండు రోజుల్లో పనులను ప్రారంభించనున్నట్లు ప్రాజెక్ట్ ఉన్నతాధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ డ్యాం వద్ద మొత్తం 42 వరద గే ట్లు ఉన్నాయి. అలాగే కాకతీయ కాలువ హెడ్ రెగ్యులేటర్ గేట్లు నాలుగు, లక్ష్మీ కాలువ గేట్లు రెండు, సరస్వతి కాలువ గేట్లు రెండు వీటన్నింటితో పాటు ప్రస్తుత సంవత్సరం వ రద కాలువ ఆరు గేట్లకు ప్రతి ఏటా వేసవి కాలంలో ప్రాజెక్ట్ అధికారులు నిర్వహణ (మెయింటెనెన్స్) పనులు చేపడతారు. దీనికి సుమారు 10 లక్షల బడ్జెట్ అవసరం ఉండగా, గేట్లకు గ్రీస్, గేట్ల రోప్‌కు ఆయిల్, ప్యూజ్‌లు తదితర పనులు చేయాల్సి ఉంటుంది. అయితే మే 20 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో గేట్ల నిర్వహణ పనులకు ఏఎంఏ ( ఏన్యువల్ మెయింటెనెన్స్ ఎస్టిమేట్) మంజూరు కాలేదు. రెండు రోజుల క్రితం గేట్ల నిర్వహణకు బడ్జెట్ మంజూరు చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు ప్రాజెక్ట్ ఈఈ రామారావు తెలిపారు. గతేడాది చేపట్టిన నిర్వహణ పనులకు సంబంధించిన బిల్లులు ఇప్పటి వరకు చెల్లించలేదు. దీంతో ప్రస్తుత సంవత్సరం పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో గేట్ల ‘నిర్వహణ’ ఆలస్యమైంది. ప్రభుత్వాల నిర్లక్ష్యం ప్రాజెక్ట్‌పై డ్యాం నిర్వహణకు ఏఎంఏ మంజూరుకు ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కించడంవల్ల వేసవి కాలంలో చేపట్టాల్సిన నిర్వహణ పనులను వర్షకాలంలో చేపట్టాల్సిన దుస్థితి నెలకొంది. వర్ష కాలంలో పనులు చేపట్టిన వెంటనే వర్షం కురిస్తే ప్రయోజనం శూన్యమని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ పనులు చేపట్టకుంటే గేట్ల పరిస్థితిని ఊహించడం కష్టంగానే ఉంటుందనే అభిప్రాయాన్ని కూడా వారే వ్యక్తం చేస్తున్నారు. ముందస్తుగా ఏఎంఏ మంజూరు చేసి ఉంటే ఇప్పటి వరకు నిర్వహణ పూర్తయ్యేదని రైతులు అంటున్నారు. ప్రాజెక్ట్ నుంచి ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరదలు వచ్చి ప్రాజెక్ట్ నిండు కుండలా మారితే వరద గేట్ల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇది వరకే ప్రాజెక్ట్ వరద గేట్లు (18, 19 ) టన్బక్కెల్ చెడిపోయి పని చేయడం లేదు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని రైతులు కోరుతున్నారు. ప్రతి ఏటా సీజన్‌కు ముందు.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు జూన్ మధ్యలో నుంచి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదలు వచ్చి చేరుతాయి. నీటి మట్టం ఆధారంగా ప్రాజెక్ట్ నుంచి వరద గేట్ల ద్వా రా నీటి విడుదలను అధికారులు గోదావరిలోకి విడుదల చేపడతారు. ప్రతి ఏట సీజన్‌కు ముందు గేట్ల మరమ్మతులు, నిర్వహణ పనులు చేపడతారు. సీజన్లో అత్యవసరంగా గేట్లను ఎత్తి నప్పుడు ఎలాంటి సమస్య తలెత్తకుండా గేట్ల మెయింటెనెన్స్ చేపడుతారు. అంతేకాకుండా గేట్లను ఎత్తడానికి ఉప యోగించే క్రేన్ రోప్ కు కూడా మెయింటెనెన్స్ చేపడతారు. ఇవన్నీ ప్రస్తుత సంవత్సరం సీజన్లో జరిగే అవకాశం ఉంది.


