న్యూ ఇయర్ ప్రసంగంలో జిన్‌పింగ్ వెల్లడి
బీజింగ్: భారత్‌కు అత్యంత ముప్పుగా చెబుతున్న బ్రహ్మపుత్ర నదిపై భారీ డ్యామ్ నిర్మాణానికి ఏకంగా దాదాపు రూ.15.27 లక్షల కోట్లు(170 బిలియన్ డాలర్లు) కేటాయిస్తున్నట్టు అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ప్రకటించారు. బుధవారం నూతన సంవత్సర ప్రసంగంలో ఆయన ఈ మేరకు వెల్లడించారు. విద్యుదుత్పత్తి సాకుతో అరుణాచల్ ప్రదేశ్ కు అతి సమీపంగా టిబెట్ భూభాగంలో ఈ భారీ డ్యామ్ నిర్మాణాన్ని చైనా తలపెట్టడం తెలిసిందే.
దీనివల్ల ఈశాన్య రాష్ట్రాలకు వరద ముప్పు పెరుగుతుందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక వైషమ్యాలు పెచ్చరిల్లిన వేళ ప్రా జెక్టులోని జలరాశిని మనపైకి జలఖడ్గంలా చైనా వాడే ప్రమాదం కూడా ఉందని వారంటున్నారు. అలాంటి డ్యామ్ విషయంలో దూకుడుగా ముందుకు వెళ్లేందుకే చైనా నిర్ణయించుకుందని జిన్ పింగ్ ప్రకటన తేటతెల్లం చేసింది.
తైవాన్‌కు వార్నింగ్
తైవాన్‌ను ఎప్పటికైనా చైనాలో విలీనం చేసుకుని తీరతామని జిన్ పింగ్ పునరుద్ఘాటించారు. దీన్ని ఎవరూ ఆపలేరని కూడా అన్నారు. తద్వారా తైవాన్ కు మద్దతు పలుకుతున్న అమెరికా వంటి దేశాలను అన్యాపదేశంగా ఆయన హెచ్చరించారు. తైవాన్ చుట్టూ సైనిక కసరత్తులను కొద్ది రోజులుగా చైనా మరింత ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే.


