
అరుణాచల్ సీఎం ఖండూ
రాష్ట్ర అస్తిత్వానికే ముప్పని ఆందోళన
బ్రహ్మపుత్రా నది పై చైనా తలపెట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్ట ‘మెడోగ్’భారత్ పాలిట ‘నీటి బాంబు’గా మారనుందని అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ ఆందోళన వెలిబుచ్చారు. ఈశాన్యంలోని సరిహద్దు రాష్ట్ర ప్రజలకు, వారి జీవనోపాధికి ఈ ప్రాజెక్టు పెను ముప్పు అవుతుందన్నారు. ‘‘ఏ అంతర్జాతీయ జల ఒప్పందాలపైనా సంతకం చేయని చైనా ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. ఆ డ్యామ్‌ను మనపైకి నీటి బాంబుగా కూడా ఉపయోగించొచ్చు’’అని హెచ్చరించారు. దాంతో మెడోగ్ డ్యామ్ మరోసారి చర్చల్లో నిలిచింది.
గోప్యతపై అనుమానాలు...
టిబెట్‌లోని యార్లుంగ్ సాంగ్సో (బ్రహ్మ పుత్ర) నదిపై ప్రపంచంలోనే అతి పెద్ద ఆనకట్టను చైనా నిర్మిస్తోంది. ఈ నది అరుణాచల్‌లో సియాంగ్‌గా, అస్సాంలో బ్రహ్మపుత్రగా మారి, బంగ్లాదేశ్‌లోకి ప్రవహిస్తుంది. అక్కడి నుంచి సముద్రంలో కలుస్తుంది. మెడోగ్ డ్యామ్ ద్వారా ఏకంగా 60 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తిని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. ఇది భారత సరిహద్దుకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందుకే దీన్ని ‘టిక్‌టిక్ అంటున్న వాటర్ బాంబ్’గా ఖండు అభి
వరి్ణంచారు.
మెడోగ్ కేవలం నదీప్రవాహ ప్రాజెక్టు అని చైనా అంటున్నా ఆ ముసుగులో అతి భారీ జలాశయాన్ని నిర్మిస్తోందని చెబుతున్నారు. ఇది భారీగా నీటిని నిల్వ చేస్తుందని, దిగువ ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుందని అంటున్నారు. ఆనకట్ట నిర్మాణానికి ఆమోదం లభించినట్లు 2024లో వార్తలొచ్చాయి. ఈ ప్రాజెక్టుపై చైనా ఆద్యంతం గోప్యత పాటిస్తుడటం, అంతర్జాతీయ జల ఒప్పందాలపై సంతకం చేయడానికి నిరాకరించడం పర్యావరణంగా, భౌగోళికంగా, రాజకీయపరంగా భారత్‌కు పెను ఆందోళన కలిగిస్తోంది. అంతేగాక ప్రాంతీయ ఉద్రిక్తతలను కూడా రాజేస్తోంది. ఈ ఆనకట్టను అరుణాచల్ అస్తిత్వానికే ముప్పుగా నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు.
‘గ్రేట్ బెండ్’ వద్దే నిర్మాణం
అరుణాచల్‌కు సమీపంలో సాంగ్సో నది ఉన్నట్టుండి వలయాకారంగా వంపు తిరుగుతుంది. సరిగ్గా ఈ ‘గ్రేట్ బెండ్’వద్దే చైనా ఆనకట్ట కడుతోంది. అక్కడి నుంచి నేరుగా అరుణాచల్‌కు చేరుతుంది. ఈ నేపథ్యంలో నదీ ప్రవాహంలో ఎలాంటి అసాధారణ మార్పులు జరిగినా భారీ వరదలు తప్పవు. అదే జరిగితే సియాంగ్ బెల్ట్ మొత్తం నాశనమవుతుంది. అక్కడి ఆదిమ తెగలు, ఇతర వర్గాలతో పాటు విస్తారమైన అటవీ ప్రాంత అస్తిత్వం కూడా ముప్పులో పడుతుంది.
ఎగువ దేశంగా నదీ ప్రవాహంపై చైనాకు అతి కీలకమైన వ్యూహాత్మక నియంత్రణ ఉండటమే ఇందుకు కారణం. నీటిని అది ఏకపక్షంగా మళ్లిస్తే భారత్‌తోపాటు బంగ్లాదేశ్‌కు కూడా తీవ్ర నష్టం తప్పదు. నీటి ప్రవాహాన్ని తగ్గితే ఈశాన్య రాష్ట్రాలతో పాటు బంగ్లాలో సాగు, మత్స్యకార కార్యకలాపాలు, జీవనోపాధికి నష్టం వాటిల్లుతుంది.
అందుకే ఈ డ్యామ్ నిర్మాణంపై భారత్ గట్టిగా అభ్యంతరాలు వ్యక్తం చేయాలని చైనాలోని భారత మాజీ రాయబారి అశోక్ కాంత సూచించారు. ‘మెడోగ్ కేవలం ప్రాజెక్టు కాదు. చాలా క్లిష్టమైన ప్రాంతంలో వ్యూహాత్మకంగా నిర్మిస్తున్న అతి భారీ జలాశయం. ఇది చాలా ప్రమాదకర పరిణామం. అత్యంత బాధ్యతారహితమైన ప్రాజెక్టు’’అని హెచ్చరించారు. మరికొందరు నిపుణులు మాత్రం భయాందోళనలు అవసరం లేదంటున్నారు. ఈ ఆనకట్ట ద్వారా బ్రహ్మపుత్రా జలాలను మనపైకి ఆయుధంగా వాడటం చైనా ఉద్దేశం కాబోదని చెబుతున్నారు. నదిలోని భారీ ప్రవాహాన్ని చైనా ఆపజాలదని చెబుతున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్