
ఛత్తీస్‌గఢ్ సీఎం ఎదుట దళంతో లొంగిపోయిన ఆశన్న
వరుస బెట్టి అన్నలు జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. కేంద్ర హోం శాఖ ఆపరేషన్ కగార్ ప్రభావంతో.. కీలక నేతలు ఒక్కొక్కరుగా లొంగిపోతున్నారు. ఈ ఏడాది మే 21న సీపీఐ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ చత్తీస్‌గఢ్‌లోని అబుజ్‌మాద్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాల చేతిలో హతమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే పార్టీ అంతర్గతంగా గందరగోళానికి లోనవుతూ వస్తోంది.
ఆపరేషన్ కగార్(Operation kagar)తో మావోయిస్టు శిబిరాల్లో భయాందోళనలు పెరిగిపోయాయి. బస్వరాజ్ మరణం తర్వాత CPI (మావోయిస్టు)లో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీ ఆంతర్గత విభేదాలు బయటపడడం, కీలక నేతల ఆరోగ్య సమస్యలు లొంగుబాటుకు కారణాలవుతున్నాయి. దీనికి తోడు భద్రతా దళాల ఒత్తిళ్ల కారణంగా అగ్రనేతలు వరుసగా లొంగిపోతున్నారు.
తాజాగా కేంద్ర కమిటీలో సభ్యుడిగా ఉన్న ఆశన్న ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ఎదుట శుక్రవారం లొంగిపోయారు. జగదల్‌పూర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో 208 మావోయిస్టులతో కలిసి ఆయన ఆయుధాలు అప్పగించారు. మొత్తం 153 తుపాకులు అగప్పించగా.. లొంగిపోయినవాళ్లలో 110 మంది మహిళా మావోయిస్టులు ఉండడం గమనార్హం.

లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత ఆశన్న(రెడ్ సర్కిల్‌లో)
ఆశన్న అసలు పేరు తక్కపల్లి వాసుదేవరావు. ములుగు జిల్లా వెంకటాపురం ఆయన స్వస్థలం. బైరంగూడా అడవుల్లో దశాబ్దాలుగా అండర్‌గ్రౌండ్‌గా జీవనం కొనసాగిస్తూ వచ్చారు. 2003లో చంద్రబాబుపై అలిపిరిలో జరిగిన దాడి, మాజీ మంత్రి మాధవరెడ్డి, IPS అధికారి ఉమేశ్ చంద్ర హత్యలకు ప్రధాన సూత్రధారిగా ఆయనకు పేరుంది. అలాంటి కీలక నేత లొంగుబాటును మావోయిస్టులకు భారీ దెబ్బ అనే చెప్పొచ్చు. లొంగిపోవాలని నిర్ణయించుకున్న వాళ్లు తనను సంప్రదించవచ్చని తన చివరి ప్రసంగంలో ఆయన దళ సభ్యులకు సూచించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే..
మల్లోజుల, ఆశన్న.. రేపు ఎవరా? అనే చర్చ నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం మావోయిస్ట్ పార్టీకి మరో ఝలక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం కమిటీ సభ్యుడు బండి ప్రకాశ్(Bandi Prakash) లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ ప్రజా ప్రతినిధి ద్వారా లొంగుబాటు యత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
బండి ప్రకాశ్ అలియాస్ ప్రభాత్, అశోక్, క్రాంతి.. స్వస్థలం మంచిర్యాల జిల్లా మందమర్రి. ప్రకాశ్ తండ్రి సింగరేణి కార్మికుడు. 1982–84 మధ్య గో టు ద విలేజెస్ ఉద్యమం ద్వారా రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (RSU) తరఫున పోరాడారు. ఆపై మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎదిగాడు. అయితే అనారోగ్య కారణాలతో ఆయన లొంగిపోవడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. అన్నీ సవ్యంగా జరిగితే.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేదా డీజీపీ లేకుంటే స్థానిక పోలీసుల ఎదుట బండి ప్రకాశ్ లొంగిపోయే ఛాన్స్ ఉంది.
ఇదిలా ఉంటే.. 2026 మార్చి కల్లా మావోయిస్టు పార్టీ లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ కగార్‌ను ఉధృతం చేశారు. గత రెండేళ్లలో దేశంలో వివిధ ఎన్‌కౌంటర్‌లలో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టుల సంఖ్య 430 మంది. లొంగిపోయిన వాళ్లు 1,500 మంది. ప్రస్తుతం పార్టీలో కేవలం 12మంది కేంద్ర కమిటీ సభ్యులు మాత్రమే మిగిలి ఉండగా.. అందులో 8 మంది తెలంగాణ నుంచే ఉండడం గమనార్హం.
ఇదీ చదవండి: ఆ ఒక్కడి లెక్క తేలిస్తే మావోయిస్టు పార్టీ ఖతమైనట్లే!