
నిన్న మల్లోజుల, నేడు ఆశన్న.. రేపు ఎవరో?. వరుస పరిణామాలతో యాభై ఏళ్ల మావోయిస్టు పార్టీ ఉద్యమం చివరి అంకానికి చేరుకుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్(Operation Kagar)తో పార్టీ కేడర్ కకావికలం కాగా.. అదే సమయంలో కీలక నేతలు వరుసగా లొంగిపోతుండడమూ తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
2026 మార్చికల్లా మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా అణచివేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. లెక్కలు చూస్తే.. ఆయన చెప్పినట్లు నిజంగానే గత పదేళ్లలో ఉద్యమం తీవ్రంగా క్షీణించింది కూడా. మరీ ముఖ్యంగా.. మావోయిస్టు పార్టీ చీఫ్ నంబాల కేశవరావు( Nambala Keshava Rao) ఎన్‌కౌంటర్ మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ అయ్యింది.
గత రెండేళ్లలో వివిధ ఎన్‌కౌంటర్‌లలో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టుల సంఖ్య 430 మంది. లొంగిపోయిన వాళ్లు 1,500 మంది. ఈ మధ్యకాలంలో కేంద్ర కమిటీ సభ్యులే లొంగిపోతుండగా.. చేసేదేం లేక కింది స్థాయిలో కేడర్ కూడా పార్టీని వీడుతోంది. ప్రస్తుతం పార్టీలో కేవలం 12మంది కేంద్ర కమిటీ సభ్యులు మాత్రమే మిగిలినట్లు తెలుస్తోంది. ఇందులో మరో విశేషం ఒకటి ఉంది.
ఆ పన్నెండు మందిలో.. 8 మంది రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలే ఉన్నారు. హనుమంతు, గణపతి, తిరుపతి, చంద్రన్న, సంగం వీళ్లంతా ఇక్కడి వాళ్లే. ఇక కీలకంగా ఉన్న ఒకే ఒక్కడు మడావి హిడ్మా. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఈయన పలు రాష్ట్రాలకు మోస్ట్‌వాంటెడ్. ఆయన కోసం స్పెషల్ ఆపరేషన్ ఏడాది కాలంగా ఉదృతంగా సాగుతోంది. ఆయన ‘లెక్క తేలిస్తే’.. మావోయిస్టు పార్టీ అధ్యాయం ముగిసినట్లేనని కేంద్ర హోం శాఖ బలంగా భావిస్తోంది.
ఇదీ చదవండి: మడావి హిడ్మా ఎక్కడ?
మావోయిస్టు ఉద్యమం 1967లో పశ్చిమ బెంగాల్‌లోని నక్సల్‌బరి గ్రామంలో ప్రారంభమైంది.
మార్క్సిజం–లెనినిజం–మావోయిజం సిద్ధాంతాల ఆధారంగా ప్రభుత్వ వ్యవస్థను కూల్చి.. సమసమాజాన్ని స్థాపించాలనే లక్ష్యంతో ఇంతకాలం సాగింది.
ఉద్యమం కాలక్రమంలో.. CPI (ML) పీపుల్స్ వార్, మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్(MCC) విలీనంతో 2004లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) ఏర్పడింది.
ఉద్యమం ప్రజాసమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని భావించింది. కానీ హింసా మార్గం వల్ల పోను పోను ప్రజల మద్దతు తగ్గుతూ వచ్చింది.
ప్రస్తుతం ఈ ఉద్యమం తీవ్రంగా క్షీణించగా.. 2026 నాటికి పూర్తిగా నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంతో ఉంది.