డీజీపీ ఎదుట లొంగిపోయిన కొయ్యడ సాంబయ్య
దళసభ్యుడి నుంచి స్టేట్ కమిటీ సభ్యుడి వరకు ప్రస్థానం
మూడు దశాబ్దాలుగా అజ్ఞాతవాసం.. డీకేఎస్‌జెడ్‌సీలో కీలకం
ఆయన స్వస్థలం గోవిందరావుపేట మండలంలోని మొద్దులగూడెం
అజ్ఞాతంలో మరో 16 మంది ఉమ్మడిజిల్లా వాసులు?
సాక్షిప్రతినిధి, వరంగల్ : మావోయిస్టు పార్టీ నేత కొయ్యడ సాంబయ్య అలియాస్ గోపన్న, ఆజాద్ అడవిబాట విడిచారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన ఆయన బీకే–ఏఎస్‌ఆర్ డివిజనల్ కమిటీ కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా వ్యవహరించగా, శనివారం 37మంది సహచరులతో కలిసి రాష్ట్ర డీజీపీ ఎదుట లొంగిపోయాడు. మూడు దశాబ్దాలపాటు మావోయిస్టు పార్టీలో వివిధ కేడర్లలో పనిచేసిన ఆయన చివరకు జనజీవన స్రవంతిలో కలవడం చర్చనీయాంశంగా మారింది.
ఆజాద్‌పై కొద్ది రోజులుగా లొంగుబాటు ప్రచారం..
ఇటీవల మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్లు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న ఆయుధాలతో సహా తమ టీమ్‌తో లొంగిపోవడంతో.. ఆజాద్ కూడా లొంగిపోవడానికి ప్రయత్నించినట్టు తెలిసింది. ఈ నెల 15న ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఈయనను స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్‌ఐబీ) పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కూడా ప్రచారం జరిగింది. ఒక దశలో 16నే ఆయన పోలీసులకు లొంగిపోయారన్నది కూడా వైరల్ అయ్యింది. వీటిపై స్పందించిన ఆజాద్ తండ్రి సమ్మయ్య తన కుమారుడికి ఎలాంటి హానీ తలపెట్టవద్దని, అరెస్ట్ చేసి అప్పగించాలని కోరారు. ఈ నేపథ్యంలో ఆజాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారా? లేక ఆయన లొంగిపోయారా? అన్న చర్చ జరుగుతుండగా.. డీజీపీ శివధర్‌రెడ్డి సమక్షంలో లొంగిపోయారన్న ప్రకటనతో సస్పెన్స్‌కు తెరపడింది. ఇదిలా ఉండగా ఉమ్మడి వరంగల్‌కు చెందిన పలువురు ఎన్‌కౌంటర్లలో మృతిచెందగా, కొందరు లొంగిపోయారు. ప్రస్తుతం బడే దామోదర్ అలియాస్ చొక్కారావుతో పాటు మరో 16 మందికి పైగా అజ్ఞాతంలో ఉన్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి.
మూడు దశాబ్దాలుగా అజ్ఞాతవాసం..
20 ఏళ్ల వయసులో పీపుల్స్‌వార్ గ్రూపులో చేరిన కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ మూడు దశాబ్దాలపాటు అజ్ఞాతంలో గడిపారు. దళసభ్యుడి నుంచి తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, బీకే ఏఎస్‌ఆర్ డివిజనల్ కమిటీ కార్యదర్శిగా ఎదిగారు. దండకారణ్యం స్పెషల్ జోన్‌లో కీలకంగా వ్యవహరించిన ఈయనపై 50కి పైగా కేసులు ఉన్నాయి. తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దు, ఏఓబీలోనూ పని చేసినట్లు పోలీసు రికార్డులోకెక్కగా, ఎన్‌ఐఏ హిట్‌లిస్టులో కూడా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ– ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో దాడులు చేయడానికి కేడర్‌కు శిక్షణ, ఆయుధాల సరఫరా వంటి పనులు చేయడంతోపాటు కొత్త రిక్రూట్‌మెంట్ బాధ్యతలు నిర్వహించారన్న పేరుంది. ఈ క్రమంలో దండకారణ్యంలో ఎన్‌కౌంటర్లు జరిగినప్పుడల్లా ఈయన పేరు వినిపించింది.


