ఏలూరు, సాక్షి: నీళ్లపై రాజకీయాలు వద్దంటూ ఆవేశపూరితంగా మాట్లాడిన నారా చంద్రబాబు నాయుడు.. అసలు విషయంపై స్పందించలేదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను తానే ఆపించినట్టు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై ఏపీ సీఎం పెదవి మాత్రం విప్పలేదు.
పోలవరం సమీక్ష పనుల తర్వాత నిర్వహించిన సమీక్షలో మాట్లాడిన చంద్రబాబు.. నీటి రాజకీయాలంటూ ఏవేవో అంశాలపై మాట్లాడారు. అయితే.. కీలకమైన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను తానే ఆపించానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాత్రం స్పందించలేదు.
క్లోజ్ రూమ్‌లో తమ మధ్య భేటీ జరిగిందని రేవంత్ చెప్పగా.. ఆ గదిలో ఇద్దరి మధ్య ఎలాంటి ఒప్పందం కుదిరిందో చంద్రబాబు చెప్పలేకపోయారు. అలాగే తెలంగాణ ఒత్తిడికి ఎందుకు తలొగ్గారో అనే అంశంపై కూడా నోరు తెరవలేకపోయారు. అయితే..
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై మాత్రం తప్పుడు ప్రచారం చేశారు. సీమ రైతుల ఆందోళనను లెక్క చేయని చంద్రబాబు.. అసలు రాయలసీమ లిఫ్ట్ అవసరం లేదన్న ధోరణిలో మాట్లాడారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
‘‘సముద్రంలో కలిసే నీళ్లు ఎవరైనా వాడుకోవచ్చు. నీటి విషయంలో రాజకీయాలు చేయవద్దని తెలంగాణను కోరుతున్నా. రాజకీయ నేతలు పోటీపడి మాట్లాడటం సరికాదు. అక్కడి ప్రజలు కూడా ఆలోచించాలి. తెలుగు జాతి ఒక్కటే.. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. ఇద్దరి మధ్య విరోధాలు పెరిగి ఆనందించే పరిస్థితి రాకూడదు. భావోద్వేగాలతో ఆటలు ఆడటం మంచిది కాదు. ప్రజల కోసం రాజకీయాలు చేస్తే మంచిదే.
ఆర్టీఎస్‌లో నీళ్లు రాకుంటే జూరాల నుంచి నీళ్లు తెచ్చి మహబూబ్‌నగర్‌కు ఇచ్చాం. దేవాదుల, కల్వకుర్తి నేనే ప్రారంభించా. దేవాదులను మరింత ముందుకు తీసుకెళ్లండి.. ఎవరు వద్దన్నారు?. ఈ మధ్య కొందరి మాటలు చూస్తే.. రాజకీయాలు నాకే అర్థం కాలేదు. గోదావరి నదికి ఎగువన దేవాదుల ప్రాజెక్టు ఉంది. దేవాదుల నుంచి నీళ్లు వస్తే పోలవరానికి వస్తాయి. కిందకు వచ్చే నీళ్లకు మీరు అభ్యంతరం చెబితే ఏమైనా అర్థం ఉందా? ఆరోజు మంజీరాకు నీళ్లు తీసుకెళ్లారు.. అప్పుడు స్వాగతించాం. గోదావరి నదిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి.. పూర్తి చేసుకోండి. దేవాదులకు మేం ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. నీళ్లు పొదుపు చేస్తే తెలంగాణకు కూడా లబ్ధి కలుగుతుంది. మిగిలిన నీరు సాగర్, శ్రీశైలంలో నిల్వ చేస్తే తెలంగాణ కూడా వాడుకోవచ్చు.
కృష్ణా నదిలో నీళ్లు తక్కువ ఉన్నప్పుడు పైన ప్రాజెక్టులు కడితే నష్టం. కృష్ణా డెల్టాను కాపాడి గోదావరిని అనుసంధానం చేసుకుంటే ఇబ్బంది ఉండదు. రాయలసీమ ఎత్తిపోతలపై చేసిన వ్యాఖ్యల్లో అర్థం లేదు. అబద్ధాన్ని వందసార్లు చెబితే నిజం అవుతుందని భావిస్తున్నారు.సముద్రంలోకి వెళ్లే నీటిని అడ్డుకుంటే లాభాలు ఉంటాయి..నష్టాలు ఉంటాయి’’ అని చంద్రబాబు చెప్పారు.


