సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గొర్రె, మేకల రక్తం మాఫియా వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించింది. బతికున్న గొర్రెలు, మేకల నుంచి రక్తాన్ని సేకరించి అక్రమంగా వ్యాపారం చేస్తున్న ముఠాపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. సీఎన్‌కే ఇంపోర్ట్ ఎక్స్‌పోర్టు కంపెనీపై దాడులు చేసిన 1000 లీటర్ల రక్తాన్ని సంబంధించిన ప్యాకెట్లను డ్రగ్ కంట్రోల్ అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై కేంద్ర డ్రగ్ కంట్రోల్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి దర్యాప్తు ప్రారంభమైంది.
వివరాల ప్రకారం.. కేంద్ర డ్రగ్ కంట్రోల్ అధికారుల సూచనలతో హైదరాబాద్ పోలీసులు, రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అధికారులతో కలిసి కాచిగూడ ప్రాంతంలోని CNK ఇంపోర్ట్ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీలో బుధవారం ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీ మొత్తంలో రక్త నిల్వలు బయటపడ్డాయి. సుమారు 1000 లీటర్లకు పైగా గొర్రె, మేక రక్తంతో నిండిన ప్యాకెట్లను అధికారులు సీజ్ చేశారు. ఇంత పెద్ద మొత్తంలో రక్తం నిల్వ చేయడం వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే, ఈ రక్తంతో క్లినికల్ ట్రయల్స్ ఏమైనా చేస్తున్నారనే అనుమానాన్ని డ్రగ్ కంట్రోల్ అధికారులు వ్యక్తం చేశారు. సీఎన్‌కే కంపెనీ యజమాని నికేష్ పరారీలో ఉన్నాడు. రెండు రోజులుగా నికేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నికేష్ దొరికితే రక్త సేకరణపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కీసరలోని నిర్మానుష్య ప్రాంతం నుంచి నికేష్.. గొర్రెలు, మేకల రక్తాన్ని తెప్పించుకుంటున్నట్టు అధికారులు గుర్తించారు.


