మైసూరు: బాంబు బెదిరింపులతో ఇటు ఒక కోర్టు ప్రాంగణంలో, మరోవైపు ఒక రైల్వే స్టేషన్ కలకలం చెలరేగింది. వివరాల్లోకి వెళితే కర్ణాటకలోని మైసూర్ జిల్లా కోర్టుకు మంగళవారం ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. ఈ సమాచారం అందిన వెంటనే అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా కోర్టు కార్యకలాపాలను నిలిపివేసి, ప్రాంగణాన్ని ఖాళీ చేయించారు. న్యాయాధికారులు, న్యాయవాదులు, కక్షిదారులు, కోర్టు సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఘటనతో కోర్టు ఆవరణలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.
విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు వెంటనే బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌తో పాటు సంఘఘటనా స్థలానికి చేరుకున్నారు. కోర్టు ప్రాంగణమంతా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం పరిస్థితి పోలీసుల నియంత్రణలో ఉందని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి భద్రత ఏర్పాటు చేశామని ఒక సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. ఈ బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై దర్యాప్తు ప్రారంభించామన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో..
మరోవైపు, ఉత్తరప్రదేశ్‌లోని మౌ (Mau) రైల్వే జంక్షన్‌లో కూడా బాంబు కలకలం చెలరేగింది. గోరఖ్‌పూర్ నుండి ముంబై వెళుతున్న కాశీ ఎక్స్‌ప్రెస్ (15018 డౌన్) రైలులో బాంబు అమర్చినట్లు పోలీసు కంట్రోల్ రూమ్‌కు మంగళవారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఒక అజ్ఞాత ఫోన్ కాల్ వచ్చింది. ఈ వార్తతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానిక పోలీసులు, జిఆర్‌పి (జీఆర్‌పీ), ఆర్‌పిఎఫ్ (ఆర్‌పీఎఫ్)బృందాలు సంయుక్తంగా రైలులోని ప్రయాణికులను ఖాళీ చేయించి, సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఒకటవ నంబర్ ప్లాట్‌ఫారమ్‌ను చుట్టుముట్టిన పోలీసులు ఎవరినీ లోపలికి అనుమతించలేదు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ అన్ని కోచ్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇది నకిలీ బెదిరింపు అని అధికారులు భావిస్తున్నారు. అజ్ఞాతంగా కాల్ చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ‘నా నోబెల్ ట్రంప్‌కే..’ మచాడో సంచలనం


