ఆ డ్యాన్సులే కొంప ముంచాయా? | Nicolas Maduro dance may have led Trump to capture him after US warnings | Sakshi
Sakshi News home page

ఆ డ్యాన్సులే కొంప ముంచాయా?

Jan 6 2026 5:05 AM | Updated on Jan 6 2026 12:30 PM

Nicolas Maduro dance may have led Trump to capture him after US warnings
  • అమెరికాను ఎద్దేవా చేస్తూ మదురో స్టెప్పులు
  • పదేపదే వెక్కిరించడంతో రగిలిపోయిన ట్రంప్‌

వాషింగ్టన్‌: డ్యాన్సు స్టెప్పులు వేసి మరీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను అనవసరంగా రెచ్చగొట్టడమే వెనెజువెలా నియంత నికోలస్‌ మదురో కొంప ముంచిందా? అవుననే అంటోంది న్యూయార్క్‌ టైమ్స్‌ వార్తా పత్రిక. నృత్యాలతో తమను ఎద్దేవా చేయడమే గాక ఏం చేసుకుంటారో చేసుకోండంటూ ఆయన బాహాటంగా సవాలు విసిరినట్టు కూడా ట్రంప్‌ యంత్రాంగం భావించిందట. గత నవంబర్‌లో మదురో పలుమార్లు టీవీల్లో కనిపించారు. 

‘యుద్ధం వద్దు, శాంతే కావాలి’ అంటూ తాను చేసిన ప్రసంగం తాలూకు మ్యూజికల్‌ రీమిక్స్‌కు సరదాగా స్టెప్పులు వేశారు. ‘మతిలేని యుద్ధం వద్దే వద్దు (నో క్రేజీ వార్‌)’ అనే లైన్లకు కూడా అలాగే పాదాలు కదిపారు. అమెరికాను, ట్రంప్‌ను, ప్రత్యక్ష దాడి తప్పదన్న ఆయన హెచ్చరికలను తేలిగ్గా తీసుకుంటున్నాననే అర్థం వచ్చేలా ఆ సందర్భంగా పదే పదే నవ్వుతూ కన్పించారు. ఇదంతా ట్రంప్‌కు తీవ్ర ఆగ్రహం కలిగించిందని వైట్‌హౌస్‌ అధికారులను ఉటంకిస్తూ న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. 

‘‘నిజానికి మదురో అధికారిక నివాసంపై నేరుగా దాడి చేసి ఆయనను ఎత్తుకొచ్చేందుకు అప్పటికి కొద్ది నెలలుగా అమెరికా సైన్యం తాలూకు స్పెషల్‌ ఫోర్సెస్‌ రిహార్సల్స్‌లో మునిగి తేలుతూనే ఉన్నాయి. కాకపోతే నిజంగా అలాంటి ప్రత్యక్ష చర్యకు దిగే విషయంలో మాత్రం అప్పటిదాకా ట్రంప్‌ కాస్త సంశయంలోనే ఉన్నారు. కానీ మదురో డ్యాన్సింగ్‌ సవాళ్లు చూసి ఆయనకు చిర్రెత్తుకొచ్చింది’’అని తెలిపింది. దాంతో, ‘‘మదురో స్టెప్పులు మరీ శ్రుతి మించాయి. ఇక గుణపాఠం నేర్పి తీరాల్సిందే’అని ట్రంప్‌తో పాటు ఆయన యంత్రాంగంలోని ఉన్నతాధికారులు కూడా నిర్ణయానికి వచ్చారట.

 అలా ట్రంప్‌ను అనవసరంగా పరిధి దాటి రెచ్చగొట్టి, ఆ ఫలితాన్ని మదురో ఇలా అనుభవిస్తున్నారన్నది న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం! గత శనివారం అర్ధరాత్రి అమెరికా ప్రత్యేక సైనిక దళాలు మెరుపు ఆపరేషన్‌ చేపట్టి మదురోను ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌తో పాటు బెడ్రూంలో నుంచి లాక్కొచ్చి మరీ న్యూయార్క్‌కు తరలించడం తెలిసిందే. ఇప్పుడాయన విచారణ కోసం ఎదురుచూస్తూ న్యూయార్క్‌ జైల్లో కాలం గడుపుతున్నారు. మదురో దంపతులతో పాటు వారి కుమారునిపై కూడా అమెరికా డ్రగ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం పలు అభియోగాలు మోపింది. సైనిక చర్యకు ముందు పలుమార్లు మదురోకు దేశం వీడి ఏ తుర్కియేలోనో ఆశ్రయం పొందాల్సిందిగా ట్రంప్‌ ఆఫర్‌ ఇచ్చారు. వాటిని మదురో నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తూ వచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement