అరుణాచల్‌ సమీపంలో చైనా అణ్వస్త్ర ప్లాంట్లు!  | China upgrades hidden nuclear sites as it expands arsenal | Sakshi
Sakshi News home page

అరుణాచల్‌ సమీపంలో చైనా అణ్వస్త్ర ప్లాంట్లు! 

Feb 17 2026 4:49 AM | Updated on Feb 17 2026 4:49 AM

China upgrades hidden nuclear sites as it expands arsenal

సిచువాన్‌ ప్రావిన్స్‌లో ఏర్పాటు 

ముమ్మరంగా వార్‌హెడ్ల తయారీ 

2030 కల్లా 1,000 వార్‌హెడ్లే లక్ష్యం?

అణ్వ్రస్తాల విషయంలో కొంతకాలంగా దూకుడు కనబరుస్తున్న చైనా, మన సరిహద్దులకు సమీపంలోనే వాటిని భారీ సంఖ్యలో తయారు చేస్తోంది! అరుణాచల్‌ప్రదేశ్‌కు 800 కి.మీ. దూరంలో సిచువాన్‌ ప్రావిన్స్‌లో అత్యంత రహస్యంగా నిర్మించిన జిటాంగ్, పింగ్‌టాంగ్‌ ప్లాంట్లలో అణ్వాయుధాల తయారీని వేగవంతం చేస్తోంది!! అత్యున్నత స్థాయి నిఘా వర్గాలను, ఉపగ్రహ చిత్రాలను ఉటంకిస్తూ న్యూయార్క్‌ టైమ్స్‌ వార్తా పత్రిక ఈ మేరకు వెలువరించిన కథనం కలకలం రేపుతోంది. 

2030 నాటికి కనీసం 1,000 పై చిలుకు అణు వార్‌హెడ్ల సామర్థ్యం సంతరించుకోవడమే చైనా లక్ష్యమని ఆ కథనం పేర్కొంది! అరుణాచల్‌ సమీపంలో చైనా కొన్నేళ్లుగా సైనిక మౌలిక సదుపాయాలను పెంచుకుంటూ, జనావాసాలను ఏర్పాటు చేస్తూ భారత్‌ను కవి్వస్తున్న విషయం తెలిసిందే.  వాస్తవానికి వాయవ్య చైనాలోని సిచువాన్‌ పర్వత ప్రాంతాల్లో చైనా అణు ప్లాంట్లు కొత్తవేమీ కాదు. అమెరికా, నాటి సోవియట్‌ యూనియన్‌లకు దీటుగా ఎదిగే ఉద్దేశంతో 60 ఏళ్ల కిందట నిర్మించినవే. 

అప్పట్లోనే వాటిలో వేలాదిగా సైంటిస్టులు, ఇంజనీర్లు, కార్మికులను నియోగించింది. జిటాంగ్, పింగ్‌టాంగ్‌ ప్లాంట్లలో అణు కార్యక్రమాలను దూకుడుగా కొనసాగించింది. అయితే 1980ల నాటికి అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గిపోవడంతో అక్కడ సిబ్బందిని భారీగా తగ్గించేసింది. కానీ 20 ఏళ్లుగా ఆ రెండు ప్లాంట్లపై చైనా బాగా దృష్టి పెట్టినట్టు చెబుతున్నారు. అంతేగాక అణు వార్‌హెడ్ల తయారీకి వాటికి పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసిందట! 

ఆ క్రమంలో ఆ రహస్య అణు కేంద్రాలను జిన్‌పింగ్‌ సర్కారు నానాటికీ విస్తరిస్తూ వస్తున్నట్టు ఉపగ్రహ చిత్రాలు కూడా తాజాగా తేల్చాయి. అక్కడ అణు వార్‌హెడ్ల తయారీ పనులు ముమ్మరంగా సాగుతున్నట్టు వెల్లడైంది. ముఖ్యంగా 2019 నుంచి అక్కడ కార్యకలాపాలు అనూహ్య రీతిలో వేగం పుంజుకున్నట్టు శాటిలైట్‌ నిఘా నిపుణుడు రెనీ బాబియార్జ్‌ను ఉటంకిస్తూ న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది.

 ‘‘జిటాంగ్‌ ప్లాంటు వద్ద కొత్త బంకర్లు, అత్యంత దృఢమైన గోడలు పుట్టుకొచ్చాయి. పైపుల వ్యవస్థను బాగా విస్తృతపరిచారు. అక్కడ ప్రమాదకర అణువ్యర్థాల పరిమాణం భారీగా పెరుగుతోందనేందుకు ఇది నిదర్శనం. అత్యంత తీవ్రమైన పేలుడుతో కూడిన ప్రయోగాలను తరచూ నిర్వహిస్తున్నట్టు పలు ఆధారాలున్నాయి’’అని రెనీ పేర్కొన్నారు.

 వీటిని హార్వర్డ్‌ వర్సిటీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త హుయ్‌ జాంగ్‌ కూడా ధ్రువీకరించారు. ఇక పింగ్‌టాంగ్‌ ప్లాంటులో యురేనియం శుద్ధి కార్యకలాపాలు సాగుతున్నట్టు న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. అక్కడ ఏకంగా 360 అడుగుల ఎత్తైన నిర్మాణాలున్నట్టు తెలిపింది. ప్రధాన భవనం పరిసరాల్లో పలు కొత్త నిర్మాణాలు జోరుగా సాగుతున్నట్టు వెల్లడించింది. 

మూడో స్థానంలో చైనా 
అణ్వాయుధాల విషయంలో రష్యా, అమెరికా తర్వాత చైనా ప్రస్తుతం ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. దాని వద్ద ప్రస్తుతం కనీసం 600 అణు వార్‌హెడ్లు ఉన్నట్టు అమెరికా రక్షణ విభాగం పెంటగాన్‌ అంచనా వేసింది. 2030 నాటికి దాన్ని కనీసం 1,000కి పెంచుకోవాలని చైనా లక్ష్యంగా పెట్టుకున్నట్టు న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. ప్రస్తుతం రష్యా వద్ద ఏకంగా 5,400 అణు వార్‌హెడ్లు ఉండగా అమెరికా వద్ద 5,200 దాకా ఉన్నాయి.

 వాటితో పోలిస్తే చైనా అణు సంపత్తి తక్కువే అయినా, వాటి సంఖ్యను అది శరవేగంగా పెంచుకుంటున్న తీరు ఆందోళన కలిగించేదేనని నిపుణులు అంటున్నారు. అమెరికా, రష్యా నడుమ అమల్లో ఉన్న వ్యూహాత్మక అణు నిరాయు«దీకరణ ఒప్పందం ఇటీవలే ముగియడం తెలిసిందే. దాన్ని పునరుద్ధరించే క్రమంలో చైనాను కూడా ఒప్పందం పరిధిలోకి తేవాల్సిన తరుణం ఆసన్నమైందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.                            

 – సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement