భారతదేశంలో అరుదైన లోహ అయస్కాంతాల తయారీని ప్రోత్సహించడానికి కేంద్ర కేబినెట్ బుధవారం రూ.7,280 కోట్ల భారీ పథకానికి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ‘సింటెర్డ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్ తయారీని ప్రోత్సహించే పథకం’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ పథకం ద్వారా దేశీయంగా అరుదైన లోహ అయస్కాంతాల తయారీని ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకం ద్వారా 6,000 ఎంటీపీఏ (సంవత్సరానికి మెట్రిక్ టన్) సామర్థ్యంతో అరుదైన లోహ అయస్కాంతాలను తయారు చేయాలని నిర్ణయించినట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు.
కీలక రంగాల్లో వీటి ఉపయోగం
ఈ అరుదైన లోహ అయస్కాంతాలు అనేక కీలక, అత్యాధునిక పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నారు. వీటిలో కింది విభాగాలున్నాయి.
ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు)
ఏరోస్పేస్
ఎలక్ట్రానిక్స్
వైద్య పరికరాలు
రక్షణ రంగం
లబ్ధిదారులకు కేటాయింపు, ప్రోత్సాహకాలు.
దేశీయంగా ఈ విభాగంలో తయారీని వేగవంతం చేసేందుకు ఈ పథకం ప్రపంచ పోటీ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా మొత్తం సామర్థ్యాన్ని ఐదుగురు లబ్ధిదారులకు కేటాయించాలని భావిస్తోంది. ప్రతి లబ్ధిదారునికి 1,200 ఎంటీపీఏ సామర్థ్యం వరకు కేటాయించనున్నారు.
పథకం కాలపరిమితి
ఈ ఇంటిగ్రేటెడ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్ (ఆర్ఈపీఎం) తయారీ సదుపాయాన్ని ప్రోత్సహించే పథకం వ్యవధి 7 సంవత్సరాలు ఉంటుంది. ఇందులో తయారీ సదుపాయాన్ని ఏర్పాటు చేయడానికి 2 సంవత్సరాలు ఉంటాయి. ఆర్ఈపీఎం అమ్మకంపై ప్రోత్సాహకాన్ని పంపిణీ చేయడానికి 5 సంవత్సరాలు గడువు నిర్ణయించారు.
ఇదీ చదవండి: ఎన్వీడియాకు గూగుల్ గట్టి దెబ్బ


