ప్రముఖ స్ట్రక్చరల్ స్టీల్ సంస్థ ఫాబెక్స్ స్టీల్ స్ట్రక్చర్స్ తమ రెండవ తయారీ యూనిట్‌ను తెలంగాణలో ప్రారంభించింది. హైదరాబాద్ సమీపంలోని చిట్యాల్ వద్ద రూ.120 కోట్ల పెట్టుబడితో 40 ఎకరాల్లో ఈ తయారీ కేంద్రం ఏర్పాటైంది.
నూతన మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏటా 50 వేల మెట్రిక్ టన్నుల అదనపు ఉత్పత్తి సామర్థ్యాన్ని అందిస్తుంది. దీంతో కంపెనీ మొత్తం ఉత్పత్తి సామర్థ్యం రెండు యూనిట్లలో కలిపి లక్ష మెట్రిక్ టన్నులకు పెరగనుంది.
ఈ ఫాబెక్స్ సంస్థ ప్రీ-ఇంజినీర్డ్ నిర్మాణాలు, ఉక్కు అమరికల రూపకల్పన, డిటైలింగ్, తయారీ, ఇన్‌స్టాలేషన్ వంటి విభాగాల్లో పనిచేస్తుంది. కంపెనీ ప్రస్తుతం విజయవాడలోని యూనిట్ ద్వారా దేశీయ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇక్కడి నుంచే ఉత్పత్తుల ఎగుమతులు సైతం చేస్తోంది.
ప్రస్తుతం రూ.463 కోట్ల టర్నోవర్ కలిగిన ఫాబెక్స్, 400 మందికి ఉపాధి కల్పిస్తోంది. కార్యకలాపాల విస్తరణతో, ఈ సంఖ్యను 800 మందికి పెంచాలని యోచిస్తోంది. తయారీ సామర్థ్యాన్ని మరింత విస్తరించడానికి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి రాబోయే 2–3 ఏళ్లల్లో మరో రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు ఫాబెక్స్ స్టీల్ స్ట్రక్చర్స్ సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ వేణు చావా తెలిపారు.


