అఫోర్డబిలిటీ కూడా ముఖ్యం
లీప్ స్కాలర్ నివేదికలో విద్యార్థుల అభిప్రాయం
జర్మనీ, యూఏఈ, న్యూజిలాండ్‌పై ఆసక్తి
ముంబై: అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు, వీసా పాలసీలు మారిపోతున్న నేపథ్యంలో విదేశీ విద్యాభ్యాసంపై ఆసక్తి గల విద్యార్థుల ప్రాధాన్యతలు మారుతున్నాయి. అఫోర్డబిలిటీతో పాటు (అందుబాటు స్థాయిలో వ్యయాలు) చదువు అనంతరం ఉద్యోగావకాశాలు, తాము చదివే కోర్సులపై కృత్రిమ మేథ (ఏఐ) ప్రభావం తదితర అంశాలకు వారు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏఐ ఆధారిత విదేశీ విద్య సేవల ప్లాట్‌ఫాం లీప్ స్కాలర్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
30 లక్షల మంది పైగా విద్యార్థుల నుంచి సేకరించిన అభిప్రాయాలతో ఇది రూపొందింది. దీని ప్రకారం 2024–25లో జర్మనీపై భారతీయ విద్యార్థుల ఆసక్తి వార్షికంగా 377 శాతం పెరిగింది. అంతకు ముందు సంవత్సరం ఇది 219 శాతం వృద్ధి చెందింది. ఇక న్యూజిలాండ్‌పై 6 శాతం నుంచి 2,900 శాతం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)పై 7 శాతం నుంచి 5,400 శాతానికి ఆసక్తి పెరిగింది.
విద్యాభ్యాసం పూర్తయ్యాక 18 నెలల పాటు వర్క్ వీసా లభిస్తుండటం జర్మనీ విషయంలో సానుకూలాంశం. పాశ్చాత్య వర్సిటీలతో పోలిస్తే విద్యా వ్యయాలు తక్కువగా ఉండటం, కాస్త అందుబాటు దూరంలో ఉండటం యూఏఈకి సానుకూలంగా నిలుస్తోంది. అటు విద్యాభ్యాసం పూర్తయ్యాక మూడేళ్ల పాటు నివసించేందుకు, పని చేసేందుకు వర్క్ వీసా ఇచ్చే ఇమ్మిగ్రేషన్ పాలసీలతో భారతీయ విద్యార్థులకు న్యూజిలాండ్ ఆకర్షణీయంగా ఉంటోంది.
‘విద్యార్థులు ఇప్పుడు కేవలం అఫోర్డబిలిటీని మాత్రమే చూడటం లేదు. ఫలానా యూనివర్సిటీలో చదివామని గొప్పలకు పోవడం కన్నా సదరు డిగ్రీతో ఎంత వరకు ప్రయోజనం ఉంటుందనేది కూడా వారికి కీలకంగా ఉంటోంది. పెట్టిన పెట్టుబడిపై రాబడి అవకాశాలను సైతం వారు లెక్కలు వేసుకుంటున్నారు‘ అని లీప్ స్కాలర్ సహ–వ్యవస్థాపకుడు ఆర్నవ్ కుమార్ తెలిపారు.
నివేదికలో మరిన్ని విశేషాలు..
→ స్పెషలైజేషన్‌కి విద్యార్థులు గతంలో కన్నా మరింతగా ప్రాధాన్యం ఇస్తున్నారు. 40.4 శాతం మంది విద్యార్థులు ఏఐ, మెషిన్ లెరి్నంగ్, డేటా సైన్స్ మొదలైన వాటిల్లో మాస్టర్స్ ప్రోగ్రామ్స్‌పై ఆసక్తిగా ఉన్నారు.
→ 59.6 శాతం మంది వివిధ కోర్సుల్లో ఏఐ మాడ్యూల్స్ కూడా ఉన్న మాస్టర్స్ డిగ్రీలను ఎంచుకుంటున్నారు.
→ బిజినెస్, ఇంజినీరింగ్, హెల్త్‌కేర్ తదితర రంగాలకు ఉపయోగపడే ప్రత్యేక కోర్సులు చేసినా, ఏఐకి కూడా ప్రాధాన్యం ఇస్తున్నారనడానికి ఇది నిదర్శనం.
→ ఏఐ కోర్సులు చదివేందుకు విదేశాలకు వెళ్లే విద్యార్థులు ఇప్పుడు యూనివర్సిటీ ర్యాంకింగ్‌ల కన్నా తాము చదువుపై పెడుతున్న పెట్టుబడిపై రాబోయే రాబడులను కూడా లెక్కలు వేసుకుంటున్నారు.
→ కోర్సు ఖర్చు, ఇతరత్రా వ్యయాలూ తమకు అత్యంత ప్రాధాన్యతాంశాలని 75 శాతం మంది వెల్లడించారు. స్కాలర్‌షిప్‌కు 70 శాతం, కెరియర్ పురోగతికి 58 శాతం, జీతభత్యాల పెరుగుదల అవకాశాల అంశానికి 49 శాతం ఓట్లు లభించాయి. 40 శాతం ఓట్లతో అధ్యాపకుల అనుభవం, రీసెర్చ్ అవకాశాలకు అయిదో ర్యాంకు దక్కింది. టాప్ 5 ప్రాధాన్యతాంశాల్లో యూనివర్సిటీ ర్యాంకింగ్‌లకు చోటు దక్కకపోవడం గమనార్హం.
→ విదేశీ విద్యను ఎంచుకునే అబ్బాయిలు (58 శాతం), అమ్మాయిల (42 శాతం) మధ్య అంతరం తగ్గుతోంది. అమ్మాయిలు ఎక్కువగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడికల్ (స్టెమ్) కోర్సులను ఎంచుకుంటున్నారు. అందులోనూ ఏఐ, డేటా సైన్స్‌కి మరింత ప్రాధాన్యం ఇస్తున్నారు.


