వెండి ధరలు గణనీయంగా పెరిగి.. కేజీ రేటు రూ.3 లక్షలకు చేరింది. ఇలాంటి సమయంలో కొంతమంది వ్యాపారస్తులు నకిలీ వెండి లేదా ఇతర మిశ్రమాలు ఎక్కువగా కలిసి ఉండే సిల్వర్ విక్రయించే అవకాశం ఉంటుంది. ఇలా జరిగినప్పుడు మీరు కొన్నది నిజమైనదా.. కాదా? తెలుసుకోవడం కష్టం అనుకోవచ్చు. కానీ.. కొన్ని చిట్కాల ద్వారా ఇంట్లోనే వెండిని టెస్ట్ చేసుకోవచ్చని బహుశా చాలామందికి తెలిసుండకపోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మ్యాగ్నెట్ టెస్ట్: నిజమైన వెండిని మ్యాగ్నెట్‌ను ఆకర్శించదు. ఒకవేలా మ్యాగ్నెట్ వెండిని లేదా వెండి వస్తువును ఆకర్శించిందంటే.. అది నిజమైన వెండి కాదు. అయితే ఈ పరీక్షతోనే దానిని ప్యూర్ సిల్వర్ అని నిర్దారించలేము. మరిన్ని టెస్టులు చేయాల్సి ఉంది. ఇది ఒక బేసిక్ టెస్ట్ మాత్రమే.

ఐస్ టెస్ట్: ఇది నిజమైన వెండిని గుర్తించడానికి చేసే మరో టెస్ట్. సిల్వర్ అనేది మంచి ఉష్ణ వాహకం (హీట్ కండక్టర్). ఐస్ మీద వెండిని ఉంచినప్పుడు.. అది వెంటనే కరిగితే అలాంటి వెండి నిజమైనదని, ఒకవేలా ఐస్ నెమ్మదిగా కరిగితే అందులో ఇతర మిశ్రమాలు కలిసి ఉన్నయనడానికి సూచన.
స్మెల్ టెస్ట్ (వాసన ద్వారా టెస్ట్): నిజమైన వెండికి ప్రత్యేకమైన వాసన ఉండదు. సిల్వర్ వస్తువును తేలికగా రుద్ది మీ ముక్కు దగ్గరకు తీసుకువచ్చినప్పుడు.. ఏదైనా వాసన వస్తే.. అందులో ఇతర మిశ్రమాలు ఉన్నట్లు. రాగి లేదా ఇతర లోహాలను కలిపినప్పుడే వెండికి ఒక స్మెల్ వస్తుంది. దీని ద్వారా కూడా నిజమైన వెండిని గుర్తించవచ్చు.

క్లాత్ టెస్ట్: వెండిని శుభ్రమైన తెల్లటి వస్త్రంతో సున్నితంగా రుద్దండి. ఆక్సీకరణ కారణంగా నిజమైన వెండి మందమైన నలుపు లేదా బూడిద రంగు గుర్తులను ఏర్పరుస్తుంది. ఎటువంటి గుర్తు కనిపించకపోతే.. అలాంటిది మిశ్రమం కలిసి ఉండొచ్చు అని అర్థం చేసుకోవాలి.
వాటర్ టెస్ట్: సాధారణంగా వెండి కొంత బరువుగా ఉంటుంది. కాబట్టి దీనిని నీటిలో వేయగానే వేగంగా కిందికి వెళ్తుంది. ఒకవేలా వేగంగా కిందికి వెళ్లకపోతే.. అది నకిలీదని గుర్తించాలి. వెండిలో కొన్ని లోహాలు కలిసి ఉన్నప్పుడే.. అది నెమ్మదిగా నీటి అడుగు భాగానికి చేరుకుంటుంది.
సౌండ్ టెస్ట్: వెండిని ఇతర మెటల్ వస్తువుతో తాకినప్పుడు.. ఎక్కువ శబ్దం చేస్తుంది. నకిలీ వెండి అయితే.. సున్నితమైన శబ్దం చేస్తుంది.
వెండి ధరలు భారీగా పెరుగుతున్న సమయంలో కొనుగోలుదారులు.. సిల్వర్ కొనే ఆతృతలో పెద్దగా జాగ్రత్తలు తీసుకోకపోవచ్చు. ఇలాంటి సమయంలోనే.. విక్రయదారులు వారిని మోసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి స్వచ్ఛమైన వెండిని.. వివిధ రకాలుగా టెస్ట్ చేసి, అది నిజమైనదా.. కాదా? అని తెలుసుకోవచ్చు.

వెండికి హాల్ మార్క్
భారతదేశంలో బంగారు ఆభరణాలు మాత్రమే కాకుండా.. వెండికి కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగానే సిల్వర్ రేటు కూడా భారీగా పెరిగింది. ఇలాంటి సమయంలో కొంతమంది నకిలీ లేదా కల్తీ వెండి ఆభరణాలను విక్రయించే అవకాశం ఉంటుంది. ఈ మోసాల నుంచి వినియోగదారులను కాపాడటానికి వెండి ఆభరణాలకు కూడా హాల్ మార్క్ అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఇదీ చదవండి: ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో ఆందోళన.. మైఖేల్ బరీ హెచ్చరిక!
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెండి ఆభరణాలకు 900, 800, 835, 925, 970, 990 వంటి స్వచ్ఛత స్థాయిలను బట్టి ప్రత్యేకమైన 6 అంకెల హాల్‌మార్క్ సంఖ్యతో హాల్‌మార్క్ చేయడానికి మార్గదర్శకాలను జారీ చేసింది. హాల్‌మార్కింగ్ ప్రవేశపెట్టిన తరువాత వినియోగదారులు కూడా స్వచ్ఛమైన వెండిని కొనుగోలు చేయవచ్చు.
హాల్‌మార్కింగ్ అంటే: బంగారు, వెండి వంటి విలువైన లోహాలతో చేసిన వస్తువుల స్వచ్ఛతను, నాణ్యతను ధృవీకరించే ప్రక్రియ. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తుంది. హాల్‌మార్క్ చేసిన వస్తువులు నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని స్పష్టం చేస్తుంది. తద్వారా నాణ్యమైన ఆభరణాలను కొనుగోలు చేయవచ్చు.


