భారతదేశ గృహ రియల్ ఎస్టేట్ రంగంలో 2025లో ధరల పెరుగుదల గణనీయంగా మందగించింది. దేశంలోని టాప్ ఎనిమిది నగరాల్లో ఇళ్ల సగటు ధరలు 2025లో కేవలం 6 శాతం మాత్రమే పెరిగాయి. కాగా 2024లో ఈ వృద్ధి 17 శాతంగా నమోదైంది. ఈ విషయాన్ని ప్రాప్‌టైగర్ విడుదల చేసిన ‘రియల్ ఇన్‌సైట్ – రెసిడెన్షియల్ CY 2025’ నివేదిక వెల్లడించింది.
అయితే, అమ్మకాలు తగ్గినప్పటికీ, సరఫరాపై నియంత్రణ, ధరల స్థిరత్వం కారణంగా గృహ మార్కెట్ బలహీనపడలేదని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాలు డిమాండ్‌ను నిలుపుకొంటూ స్థిరమైన ప్రదర్శన చూపించాయి.
హైదరాబాద్‌లో 8 శాతం ధరల వృద్ధి
2025లో హైదరాబాద్‌లో గృహాల సగటు ధరలు 8 శాతం పెరిగాయి. ఇది బెంగళూరుతో కలిసి దేశంలోనే మెరుగైన పనితీరు చూపిన మార్కెట్లలో ఒకటిగా హైదరాబాద్‌ను నిలిపింది. ఐటీ, సేవా రంగాల ఆధారంగా ఉన్న ఎండ్-యూజర్ డిమాండ్ హైదరాబాద్ మార్కెట్‌కు ప్రధాన బలం అని నివేదిక తెలిపింది.
ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ధరలు ఇంకా అందుబాటులో ఉండటం, మెరుగవుతున్న రహదారి మౌలిక సదుపాయాలు, కొత్త నివాస కారిడార్‌ల అభివృద్ధి కూడా డిమాండ్‌ను నిలబెట్టిన కీలక కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. స్పెక్యులేటివ్ కొనుగోళ్ల కంటే స్వయంగా నివసించేందుకు కొనుగోలు చేసే వారి వాటా ఎక్కువగా ఉండటం మార్కెట్‌కు స్థిరత్వాన్ని ఇచ్చింది.
బెంగళూరు ముందంజ
దేశంలోని టాప్ ఎనిమిది నగరాల్లో బెంగళూరు 13 శాతం ధరల పెరుగుదలతో అగ్రస్థానంలో నిలిచింది. 2025 చివరి త్రైమాసికానికి బెంగళూరులో చదరపు అడుగుకు సగటు ధర రూ.9,500కు చేరి, ఢిల్లీ-ఎన్‌సీఆర్ (రూ.9,167)ను దాటి దేశంలో రెండో అత్యంత ఖరీదైన గృహ మార్కెట్‌గా అవతరించింది. మొదటి స్థానంలో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (రూ.14,000) ఉంది.
ఇతర నగరాల్లో ధరల వృద్ధి పరిమితంగానే నమోదైంది. ముంబై ఎంఎంఆర్‌లో 4 శాతం, ఢిల్లీ-ఎన్‌సీఆర్, కోల్‌కతాల్లో 6 శాతం, అహ్మదాబాద్‌లో 8 శాతం పెరుగుదల కనిపించింది. పుణేలో కేవలం 1 శాతం, చెన్నైలో ఎలాంటి పెరుగుదల లేకపోవడం గమనార్హం.
అమ్మకాలు, సరఫరాలో తగ్గుదల
2025లో దేశవ్యాప్తంగా గృహ అమ్మకాలు 12 శాతం తగ్గి 3.86 లక్షల యూనిట్లకు పరిమితమయ్యాయి. ఇది 2022 తర్వాత నమోదైన కనిష్ట స్థాయి. కొత్త గృహ ప్రాజెక్టుల ప్రారంభాలు కూడా 6 శాతం తగ్గి 3.61 లక్షల యూనిట్లకు చేరాయి.
అయితే, 2025 చివరి త్రైమాసికంలో సరఫరా స్వల్పంగా మెరుగుపడింది. Q4లో కొత్త లాంచ్‌లు 4 శాతం పెరగడం డెవలపర్లలో మెల్లగా విశ్వాసం పెరుగుతున్న సంకేతంగా నివేదిక పేర్కొంది. హైదరాబాద్‌లో సరఫరా నియంత్రితంగా ఉండటంతో ఇన్వెంటరీ ఒత్తిడి తక్కువగానే కొనసాగింది.
2026పై అంచనాలు
ప్రాప్‌టైగర్ నివేదిక ప్రకారం, హైదరాబాద్, బెంగళూరు వంటి ఎండ్-యూజర్ ఆధారిత నగరాలు 2026లోనూ స్థిరమైన ప్రదర్శన కొనసాగించే అవకాశముంది. పరిమిత సరఫరా, నియంత్రిత ఇన్వెంటరీతో గృహ రంగం ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. “అమ్మకాలు తగ్గినప్పటికీ ధరల స్థిరత్వం కొనసాగుతోంది. డెవలపర్లు స్వయంనియంత్రిత సరఫరాతో ధరల సమగ్రతను కాపాడుతున్నారు” అని ఆరమ్ ప్రాప్‌టెక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఓంకార్ షెట్టి పేర్కొన్నారు.


