టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో సైబర్ నేరాలు కూడా ఎక్కువవుతున్నాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టడానికి బ్యాంకులు ప్రజలలో అవగాహన పెంచుతున్నాయి. దీనికోసం బ్యాంకింగ్ సంస్థలు ప్రత్యేకంగా సైబర్ ఫ్రాడ్ ప్రొటెక్షన్ ప్లాన్స్ కూడా తీసుకొస్తున్నాయి. సైబర్ ఇన్యూరెన్స్‌లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి సమయంలో.. సైబర్ మోసాలకు బాధితులవుతున్న వారికి అండగా నిలిచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ప్రకటన చేసింది. గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం ముగింపు రోజున ఈ ప్రకటన చేశారు.
వినియోగదారుల రక్షణలో భాగంగా.. డిజిటల్ మోసాల వల్ల నష్టపోయిన కస్టమర్లకు తక్షణ ఆర్థిక సాయంగా గరిష్టంగా రూ.25,000 వరకు పరిహారం చెల్లించనున్నట్లు ఆర్‌బీఐ ప్రతిపాదించింది. త్వరలో దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించి విడుదల చేయనున్నారు. డిజిటల్ చెల్లింపులు వేగంగా విస్తరిస్తున్న ఈ కాలంలో, ఇలాంటి చర్యలు ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇలాంటి సమయాల్లో పరిహారం..
బ్యాంకింగ్ సంస్థల నిర్లక్ష్యం లేదా సిస్టం లోపల వల్ల ప్రజలు సైబర్ నేరాలకు గురైతే.. రిజర్వ్ బ్యాంక్ పరిహారం అందించనుంది. అంతే కాకుండా.. చిన్న మొత్తంలో నష్టపోయినవారికి మాత్రమే ఈ పరిహారం అందించడం జరుగుతుంది. భారీ మొత్తంలో సైబర్ మోసాలకు గురైనప్పుడు.. ఈ పరిహారం లభించదు.
ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ బీఎల్ఎస్ ఈ సర్వీసెస్ సీఎఫ్ఓ రాహుల్ శర్మ.. చిన్న మోసాల వల్ల కలిగే నష్టాలకు ఈ పరిహారం కొంత ఉపశమనం కలిగిస్తుందని ఆన్నారు. వెల్స్ ఫార్గో మాజీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ గ్లోబల్ బ్యాంకింగ్ లీడర్ సంతాను సెంగుప్తా కూడా ఈ నిర్ణయాన్ని డిజిటల్ ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్‌లో విశ్వాసాన్ని పెంచుతుందని వెల్లడించారు.


