ఈజీగా రుణాల ఉచ్చులో..! | Instant Loans Become a Debt Trap | Sakshi
Sakshi News home page

ఈజీగా రుణాల ఉచ్చులో..!

Feb 4 2026 5:56 AM | Updated on Feb 4 2026 5:57 AM

Instant Loans Become a Debt Trap

అప్పుల ఊబిలో చిక్కుకుంటున్న రుణ గ్రహీతలు

బై నౌ పే లేటర్, ఇన్‌స్టంట్‌ లోన్‌ యాప్‌లు, వ్యక్తిగత రుణాలతో ఇబ్బందులు

అధిక శాతం మంది తమ ఆదాయంలో 40% కంటే ఎక్కువ ఈఎంఐలకే

రుణాల వసూలుకు ఆర్‌బీఐ మార్గదర్శకాల ఉల్లంఘన

వేధింపులు, బెదిరింపులు, గృహ, ఆఫీస్‌ సందర్శనలు

ఈరి సెల్యూషన్‌ కన్సల్టెన్సీ సంస్థ నిపుణుల ప్యానెల్‌ దేశవ్యాప్త సర్వేలో వెల్లడి  

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో సులభ రుణాలు అనేవి రుణగ్రహీతలకు ‘ఉచ్చు’లుగా మారుతున్నాయి. భారత్‌లో ‘ఈజీ క్రెడిట్‌’అనే ఆకర్షణీయమైన రుణాల వలలో పడి అప్పుల ఊబిలో చిక్కుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పుడు కొనండి...తర్వాత చెల్లించండి (బై నౌ పే లేటర్‌) పథకాలు, ఇన్‌స్టంట్‌ లోన్‌ యాప్‌లు, ఇతర వ్యక్తిగత రుణాల వంటివి విష వలయాలుగా మారుతున్నాయి. తాజాగా ఈరి సెల్యూషన్‌కన్సల్టెన్సీ సంస్థ నిపుణుల ప్యానెల్‌ దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఓ సర్వేలో వేలాది మంది రుణ గ్రహీతలు సులభంగా రుణం పొందే అవకాశాల కారణంగా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని వెల్లడైంది.

2025 జూన్‌–డిసెంబర్‌ల మధ్య దేశ వ్యాప్తంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పదివేల మంది రుణగ్రహీతలకు సంబంధించి రుణ ఎగవేతలు, చెక్కు బౌన్స్, రికవరీ ఏజెంట్ల వేధింపులకు సంబంధించిన ఉదంతాలను ఈ నిపుణుల ప్యానెల్‌ ప్రత్యేకంగా పరిశీలించింది. తమ నెలవారీ ఆదాయంలో 85% మంది రుణగ్రహీతలు 40% కంటే ఎక్కువ మొత్తాన్ని నెలవారీ కిస్తులకు (ఈఎంఐ) చెల్లించాల్సి వస్తుందని తేలింది. రుణ రికవరీ వేధింపులపై ఫిర్యాదు విషయంలో రుణ గ్రహీతలు పరిమిత అవగాహన కలిగి ఉన్నారని ఈ నివేదికలో వెల్లడైనట్లు నిపుణుల ప్యానెల్‌ డైరెక్టర్‌ అనురాగ్‌ మెహ్రా పేర్కొన్నారు.

ఆర్‌బీఐ రక్షణలపై అవగాహన లేక..
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఫెయిర్‌ ప్రాక్టీస్‌ కోడ్, బ్యాంకింగ్‌ అంబుడ్స్‌మన్‌ వ్యవస్థ వంటి మార్గ దర్శకాలు, రక్షణలను ఏర్పాటు చేసింది. కానీ చాలా మంది రుణగ్రహీతలకు రికవరీ ఏజెన్సీలు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్టుగా తెలియకపోవడమో లేక అవగాహన కలిగి లేకపోవడమో జరుగుతోంది. వేళ కాని వేళల్లో వేధింపులు, బెదిరింపులు, తిట్ల దండకం, అప్పుల విషయాన్ని ఇతరులకు అనధికారికంగా బహిర్గతం, పదేపదే ఇళ్లు, ఆఫీస్‌లకు వెళ్లడం వంటి పద్ధతులు ఆర్‌బీఐ మార్గదర్శకాలకు పూర్తి వ్యతిరేకం.

ఈ మార్గదర్శకాల గురించి రుణగ్రహీతలు తమ హక్కులు, రక్షణల గురించి అవగాహన పెంచుకోవాలి. ఏజెంట్లు, సంస్థల కాల్‌ లాగ్‌లను సేవ్‌ చేయడం...సందేశాలను స్క్రీన్‌ షాట్‌ చేయడం, వీలైతే సంభాషణలను రికార్డ్‌ చేయడం ద్వారా వేధింపుల ప్రతి సందర్భాన్ని డాక్యుమెంట్‌ చేయాలి. ఏజెంట్లు నియమాలను ఉల్లంఘించినప్పుడు, బ్యాంకింగ్‌ అంబుడ్స్‌మన్‌కు అధికారిక ఫిర్యాదులను దాఖలు చేయాలి.     

సర్వేలోని ముఖ్యాంశాలు..
దాదాపు 40% మంది రుణ గ్రహీతలు ఒక క్రెడిట్‌ కార్డును మరో క్రెడిట్‌ కార్డుకు చెల్లించేందుకు ఉపయోగిస్తున్నారు.  
మరో 22% మంది సహాయం కోసం స్నేహితులు, కుటుంబ సభ్యుల వైపు మొగ్గు చూపుతున్నారు. 
65% మంది రుణ గ్రహీతలు తమ అవసరాలను తగ్గించుకుంటున్నారు. పిల్లల విద్యను నిలిపివేయడం, వైద్య చికిత్సను వాయిదా వేయడం, బీమా పాలసీలను రద్దు చేయడం, ఆహారం/పోషకాహార బడ్జెట్‌ను తగ్గించడం వంటివి ఉన్నాయి. 

చెల్లింపుల కోసం...కొంతమంది రుణగ్రహీతలు (16%) జీతం అడ్వాన్స్‌లు, 15% మంది ఆస్తులు ఖర్చు చేస్తున్నారు.  
తాము తీసుకున్న అప్పులను రుణ గ్రహీతలు ఒప్పందం మేరకు టైమ్‌కు చెల్లించలేనపుడు రికవరీ ఏజెంట్లు రంగంలోకి దిగి నిరంతరం ఫోన్లలో బెదిరింపులతో మోత మోగిస్తున్నారు. ఇలా 72% రుణ గ్రహీతలు రికవరీ ఏజెన్సీల వేధింపులకు గురవుతున్నారు. 
దాదాపు 67% మందికి నెలకు సగటున 50 నుంచి 100 ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి. ఈ కాల్స్‌ ఉద్దేశపూర్వకంగా తెల్లవారుజామున (ఉదయం 6–8), రాత్రి ( 8–10) సమయాల్లో రావడంతో తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. 

రికవరీ ఏజెంట్లు వాట్సాప్, ఎస్‌ఎంఎస్‌లలో బెదిరింపు సందేశాలను పంపుతున్నట్లు 70% మంది పేర్కొన్నారు. 
18% ఉదంతాల్లో... అప్పుచేసిన వారి తల్లిదండ్రులు, జీవిత భాగస్వాములు, పిల్లలు సహా కుటుంబ సభ్యులు బెదిరింపులను ఎదుర్కొంటున్నారు.
12% మంది రుణాలు తీసుకున్న వారు...ఏజెంట్లు తమ యాజమాన్యాలను కలిసి ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని వాపోయారు. పర్యవసానంగా... 50% కంటే ఎక్కువ మంది రుణగ్రహీతలు ఆందోళన, నిరాశ, వైవాహిక ఒత్తిడి, కుటుంబ సంఘర్షణతో పనితీరుపై ప్రభావం చూపుతోంది. ఇవి తీవ్రమైన సందర్భాల్లో ఆత్మహత్య ఆలోచనలు వంటి తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement