అమ్మో.. పులి | Tiger Serial attacks on animals in Yadadri district | Sakshi
Sakshi News home page

అమ్మో.. పులి

Feb 4 2026 4:43 AM | Updated on Feb 4 2026 4:43 AM

Tiger Serial attacks on animals in Yadadri district

యాదాద్రి జిల్లాలో మూగజీవాలపై వరుస దాడులు

ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న పులి

సాక్షి, యాదాద్రి: పులి సంచారం యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గత నెల 16న జిల్లాలోని రాజాపేట మండలం బేగంపేట– తుర్కపల్లి మండలం ఇబ్రహీంపూర్‌ అటవీ ప్రాంతంలో పులి పాదముద్రలు బయటపడ్డాయి. రాత్రి వేళ పులి ఆవులు, దూడలు, మేకలపై దాడులు చేసి తింటోంది. అటవీ శాఖ అధికారులు పులి సంచారంపై దృష్టి పెట్టినప్పటికీ దాన్ని బంధించలేకపోతున్నారు. పశువులను మేపడానికి అడవికి వెళ్లినవారు, వ్యవసాయ పనులకు వెళ్లిన వారు సాయంత్రం 4 గంటలకే పనులు ముగించుకుని ఇంటికి వస్తున్నారు. 

పులి మహారాష్ట్రలోని తిప్పేశ్వర వన్యప్రాణి అభయారణ్యం నుంచి కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు ప్రాజెక్టు మీదుగా ఆడ పులి తోడు కోసం మగ పులి బయలుదేరి జిల్లాకు చేరింది. జనవరి 16న భువనగిరి జిల్లా రాజాపేట, తుర్కపల్లి, అటవీ ప్రాంతంలో ఉన్న గుట్టల్లోంచి బయటకువచ్చి వ్యవసాయ బావుల వద్ద ఉన్న పశువులను చంపి తింటోంది. అటవీ శాఖ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో పులి ఆవును చంపి తింటున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. 

ఫిబ్రవరి 1, 2 తేదీలో జిల్లాకు పొరుగునే ఉన్న సిద్దిపేట జిల్లా జగ్‌దేవ్‌పూర్‌ వైపు వెళ్లింది. దీంతో అటవీ శాఖ అధికారులు పులి తిరిగి వెళ్లిపోయిందని, రైతులు ఆందోళన చెందవద్దని చెప్పారు. అయితే, మంగళవారం రాత్రి రాజాపేట మండలంలో పులి దాడితో మళ్లీ భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పెద్దగా అటవీ ప్రాంతంలేని ఆలేరు మండలం శ్రీనివాసపురంలో పులి అడుగులను గుర్తించారు. దీంతో పులి పొరుగునే ఉన్న జనగామ జిల్లాకు వెళ్లి ఉంటుందన్న అంచనా వేస్తున్నారు. 

అటవీశాఖ ముమ్మర చర్యలు
పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు మూడు బోన్లను ఏర్పాటు చేసి, వాటిలో మేకలను ఎరగా ఉంచారు. అలాగే 25 ట్రాప్‌ కెమెరాలు, థర్మల్‌ డ్రోన్‌ కెమెరాల సహాయంతో పులి కదలికలను పర్యవేక్షిస్తున్నారు. యానిమల్‌ ట్రాకింగ్‌ బృందం పులి జాడలను నిరంతరం గమనిస్తోంది. రాత్రివేళల్లో బయటకు వెళ్లవద్దని, ఒంటరిగా అడవులు, బావుల వద్దకు వెళ్లకూడదని అటవీశాఖ అధికారులు ప్రజలకు సూచించారు.

రాత్రిళ్లు గస్తీ తిరుగుతున్నాం... 
మా గ్రామానికి చెందిన మూడు పశువులను పులి చంపేసింది. అటవీ శాఖ అధికారుల సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. గుంపులుగా బావుల వద్దకు వెళ్లి పనులు త్వరగా ముగించుకుని వస్తున్నాం. యువకులు రాత్రివేళ గస్తీ తిరుగుతున్నారు. అధికారులు పులిని త్వరగా బంధించి ప్రజలకు రక్షణ కల్పించాలి. –జెర్రిపోతుల కర్ణాకర్, సర్పంచ్, దత్తాయపల్లి

పులి దాడిలో ఆవు మృతి
తాంసి: పులి దాడిలో ఆవు మృతి చెందిన ఘటన ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలంలో చోటుచేసుకుంది. పిప్పల్‌కోటి గ్రామంలోని రైతు విఠల్‌కు చెందిన ఆవు మేత కోసం సోమవారం పంట చేల వైపు వెళ్లింది. రాత్రి అయినా తిరిగి ఇంటికి రాకపోవడంతో రైతు పంట చేల వద్ద మంగళవారం ఉదయం గాలించగా ఆవు కళేబరం కనిపించింది. పులి దాడి చేసి హతమార్చినట్టుగా గుర్తించిన స్థానిక రైతులు, గ్రామస్తులు అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. 

వెంటనే ఎఫ్‌ఆర్వో గులాబ్‌సింగ్‌ సెక్షన్‌ అధికారి అహ్మద్‌ఖాన్‌ను అప్రమత్తం చేశారు. ఆయన బీట్‌ అధికారి సాయికుమార్‌తో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆనవాళ్లను పరిశీలించి పులి దాడిగా నిర్ధారించారు. పెన్‌గంగా పరీవాహక ప్రాంతాల్లో పులి సంచారం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్‌ఆర్వో స్థానికులకు సూచించారు. 

పులి కదలికల కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సిబ్బంది ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. బాధిత రైతుకు పరిహారం అందేలా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో అటవీశాఖ సిబ్బంది, యానిమల్‌ ట్రాకర్స్‌ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement