విద్యార్థులకు సరిపడా టీచర్లు! | An additional 16000 teachers are needed in 8000 schools | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు సరిపడా టీచర్లు!

Feb 4 2026 4:22 AM | Updated on Feb 4 2026 4:22 AM

An additional 16000 teachers are needed in 8000 schools

హేతుబద్దీకరణ వైపు ప్రభుత్వం అడుగులు 

వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పూర్తి 

8 వేల స్కూళ్లలో 16 వేల మంది టీచర్లు అదనం 

యూడైస్‌ లెక్కతో ముందుకెళ్తున్న విద్యాశాఖ 

స్కూళ్ల మూత, విలీనంపై ముమ్మర కసరత్తు!

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలలు, టీచర్ల హేతుబద్దీకరణకు విద్యాశాఖ కసరత్తు మొదలు పెట్టింది. ఇందుకోసం యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ (యూడైస్‌) లెక్కలను ప్రామాణికంగా తీసుకుంటోంది. హేతుబద్ధీకరణకు ఇటీవల ముఖ్యమంత్రి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో పాఠశాల విద్య అధికారులు అవసరమైన డేటాను తెప్పించుకుంటున్నారు. ఈ ఏడాది జూన్‌లో విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి హేతుబద్దీకరణ పూర్తి చేయాలని నిర్ణయించారు. 

వాస్తవానికి 2021లోనే దీనిపై ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అయితే కరోనా సమయం కావడంతో కార్యాచరణకు నోచుకోలేదు. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల ముందుకెళ్ళలేకపోయారు. విద్యార్థులు ఎక్కువగా ఉన్న చోట తక్కువ మంది టీచర్లు ఉన్నారు. తక్కువ మంది విద్యార్థులున్న చోట ఎక్కువ మంది టీచర్లు ఉన్నారు. హేతుబద్దీకరణతో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను కేటాయించడం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.  

8 వేల స్కూళ్ళల్లో 16 వేల టీచర్లు అదనం 
రాష్ట్రవ్యాప్తంగా 24,224 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇందులో16,455 ప్రాథమిక పాఠశాలలు, 3,097 ప్రాథమికోన్నత పాఠశాలలు, 4,672 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. యూడైస్‌ లెక్కల ప్రకారం 8 వేల పాఠశాలల్లో 16 వేల మంది టీచర్లు అదనంగా ఉన్నారు. 

మరోవైపు దాదాపు 3 వేల స్కూళ్ళలో 4 వేల మంది టీచర్ల కొరత ఉంది. 50 కన్నా తక్కువ విద్యార్థులున్న హైస్కూళ్ళు వెయ్యి వరకూ ఉన్నాయి. 10 మంది విద్యార్థుల కన్నా తక్కువ ఉన్న ప్రైమరీ, అప్పర్‌ ప్రైమరీ స్కూళ్ళు వెయ్యి వరకూ ఉన్నాయి. 19 లోపు విద్యార్థులున్న ఇదే కేటగిరీ స్కూళ్ళు 5,500 వరకూ ఉన్నాయి.  

మూసేయడయా? కలిపేయడమా? 
ప్రభుత్వం 2021లో ఇచ్చి న జీవో ప్రకారం ప్రాథమిక స్కూళ్ళల్లో 19 లోపు విద్యార్థులుంటే ఒక టీచర్‌ను ఇవ్వాలి. 60 మంది విద్యార్థులుంటే ఇద్దరిని ఇవ్వాలి. ఆ తర్వాత ప్రతి 30 మందికి ఒక టీచర్‌ ఉండాలి. ఉన్నత పాఠశాలల్లో ప్రతి సబ్జెక్టుకు ఒకరు చొప్పున 9 మంది టీచర్లను కేటాయించాలి. ప్రతి సెక్షన్‌లోనూ 40 మంది విద్యార్థులుండాలి. 

సెక్షన్లు పెరిగితే టీచర్ల సంఖ్య పెంచాలి. ఈ లెక్కన విద్యార్థులు తక్కువగా ఉన్న స్కూళ్ళను ఏం చేస్తారనే దానిపై స్పష్టత లేదు. ఆ స్కూళ్లను మూసివేస్తారా? దగ్గర్లో ఉన్న పాఠశాలల్లో కలిపి వేస్తారా? అనేది తేలాల్సి ఉంది. స్కూల్‌ మూసివేస్తే స్థానికంగా వ్యతిరేకత వచ్చే వీలుంది. మరోవైపు సమీపంలో మరో స్కూలుకు వెళ్ళాలంటే సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలి. 

ఇదే క్రమంలో టీచర్లను హేతుబద్దీకరణ కింద బదిలీ చేయాల్సి ఉంటుంది. సమీపంలో ఉన్న స్కూల్‌లోకి బదిలీ చేసే పక్షంలో ఆ టీచర్‌ చెప్పే సబ్జెక్టు పోస్టు అక్కడ ఖాళీగా ఉండాలి. లేదంటే దూర ప్రాంతానికి బదిలీ చేస్తారు. అప్పుడు టీచర్ల నుంచి వ్యతిరేకతకు ఆస్కారం ఉంటుంది.  

ప్రజల్లో విశ్వాసం పెంచాలి 
హేతుబద్దీకరణ పేరుతో స్కూళ్ళను మూసివేస్తే పరిణామాలు ప్రతికూలంగా ఉంటాయి. ప్రభుత్వ స్కూళ్ళపై ప్రజల్లో నమ్మకం పోతుంది. జాతీయ విద్యా విధానం చెప్పినట్టు 30 మందికి ఒక టీచర్‌ కాకుండా, 20 మందికే ఒక టీచర్‌ ఉండేలా చూడాలి. 50 మంది దాటితే తరగతికో టీచర్‌ ఉండాలి.   – చావా రవి (టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు) 

అన్ని వర్గాలతో సంప్రదించాలి 
హేతుబద్దీకరణ క్రమంలో ఉపాధ్యాయులు, మేధా వులు, స్థానికులతో అధికారులు చర్చించాలి. కేవలం యూడైస్‌ డేటానే ప్రామాణికంగా తీసుకోవద్దు.   – పింగిలి శ్రీపాల్‌ రెడ్డి (టీచర్స్‌ ఎమ్మెల్సీ)  

టీచర్లకు అన్యాయం జరగనివ్వొద్దు 
హేతుబద్దీకరణ సమయంలో టీచర్ల పరిస్థితినీ పరిగణనలోనికి తీసుకోవాలి. నిష్పత్తి ప్రకారం టీచర్లను బదిలీ చేయాల్సి వస్తే కచ్చితమైన నిబంధనలు పాటించాలి. వారికి ఆప్షన్‌ ఇవ్వాలి.   – పుల్గం దామోదర్‌ రెడ్డి (పీఆర్‌టీయూటీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు) 

Advertisement
 
Advertisement
Advertisement