నేడు రాష్ట్రానికి నితిన్‌ నబీన్‌ | Nitin Nabin is visiting the state today | Sakshi
Sakshi News home page

నేడు రాష్ట్రానికి నితిన్‌ నబీన్‌

Feb 4 2026 4:18 AM | Updated on Feb 4 2026 4:18 AM

Nitin Nabin is visiting the state today

మహబూబ్‌నగర్‌లో కార్యకర్తల విస్తృత సమావేశానికి హాజరు 

జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక తొలిసారి రాక 

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్‌ నబీన్‌ మిశ్రా తొలిసారి తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. బుధవారం మహబూబ్‌నగర్‌ ఎంవీఎస్‌ డిగ్రీ కాలేజ్‌ మైదానంలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, పరిసర ప్రాంతాల కార్యకర్తల సమ్మేళనాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 

మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు ఈ ప్రసంగాన్ని వీక్షించనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు తెలిపారు. అనంతరం బహిరంగ సభ ఉంటుంది. కాగా సమ్మేళనం బూత్‌ స్థాయి కార్యకర్తలు, మున్సిపల్‌ నాయకులు, పార్టీ కార్యకర్తలకు నూతన ఉత్సాహం, ప్రేరణనిచ్చేదిగా నిలుస్తుందని రాష్ట్ర పార్టీ నాయకత్వం విశ్వసిస్తోంది. 

కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపేలా.. 
నితిన్‌ నబీన్‌ పర్యటన తెలంగాణ బీజేపీకి ఓ కీలక మైలురాయిగా నిలవనుందని రాంచందర్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మున్సిపల్‌ ఎన్నికల సమయంలో జరుగుతున్న ఈ పర్యటన పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతుందని, సంస్థాగత సంకల్పాన్ని బలోపేతం చేసి, ప్రజలతో పార్టీ అనుబంధాన్ని మరింత పటిష్టం చేస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరారు.  

ఇదీ నితిన్‌ నబీన్‌ షెడ్యూల్‌.. 
» మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఢిల్లీ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు 
» రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు స్వాగతం పలుకుతారు. సంప్రదాయబద్ధంగా ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 
»  ఆ తర్వాత రోడ్డు మార్గాన మహబూబ్‌నగర్‌కు బయలువేరి వెళతారు 
» 4 గంటల ప్రాంతంలో మహబూబ్‌నగర్‌లో కార్యకర్తల సమ్మేళనం, బహిరంగసభ 
» 6 గంటల కల్లా రోడ్డుమార్గాన శంషాబాద్‌ విమానాశ్రయానికి. అక్కడి నుంచి ఢిల్లీకి.  

Advertisement
 
Advertisement
Advertisement