బీఆర్‌ఎస్‌ అంటే భూ రాక్షసుల సమితి | Bandi Sanjay Kumar comments over brs | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ అంటే భూ రాక్షసుల సమితి

Feb 4 2026 4:16 AM | Updated on Feb 4 2026 4:16 AM

Bandi Sanjay Kumar comments over brs

కాంగ్రెస్‌ను గెలిపిస్తే నిధులు ఎక్కడి నుంచి తెస్తుంది?

మాకు మేయర్‌ పీఠాన్ని అప్పగిస్తే మోదీని ఒప్పించి పెద్ద ఎత్తున నిధులు తెస్తా 

కరీంనగర్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ 

కరీంనగర్‌: బీఆర్‌ఎస్‌ అంటే భూ రాక్షసుల పార్టీ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. 10 ఏళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో కనబడ్డ జాగాలన్నీ కబ్జా చేసి దోచుకుతిన్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే ఇళ్లను కూడా కబ్జా చేసి పుస్తెల తాడును కూడా దోచుకుంటారని హెచ్చరించారు. మంగళవారం కరీంనగర్‌లోని కోతిరాంపూర్‌ చౌరస్తాలో నిర్వహించిన స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌లో సంజయ్‌ పాల్గొన్నారు. 

మాజీ మేయర్‌ సునీల్‌రావుతోపాటు 9, 39, 40 డివిజన్ల అభ్యర్థులు బండారు గాయత్రి, పసుపులేటి శివానందం, కాసర్ల లక్ష్మీ నర్సవ్వ హాజరయ్యారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం వద్ద నయాపైసా లేదని, నన్ను కోసినా డబ్బులు రావని సాక్షాత్తు సీఎం రేవంత్‌ రెడ్డే చెప్పారని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి ఎక్కడి నుంచి నిధులు తెస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

కరీంనగర్‌ అభివృద్ధి కోసం రూ.1,500 కోట్లు తీసుకొచ్చానని, వివరాలతో బుక్‌లెట్‌ కొట్టించి ఇంటింటికీ పంపుతున్నానని సంజయ్‌ చెప్పారు. ఈ వివరాలు తప్పైతే తనపై కేసు పెట్టుకోవచ్చని సవాల్‌ విసిరారు. ‘నేను రెండోసారి గెలిచినంక కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ కట్టర్‌ను కరీంనగర్‌ తీసుకొచి్చనంక రూ.50 కోట్ల నిధులు వచ్చినయ్‌. స్మార్ట్‌ సిటీలో అక్కడ ఉన్న చెత్తను అప్పటికప్పుడు బయోమైనింగ్‌ చేసినందుకు రూ.18 కోట్లు కేంద్ర నిధులు రెడీగా ఉన్నయ్‌. 

కానీ నాడు బీఆర్‌ఎస్, నేడు కాంగ్రెస్‌ ఇద్దరూ ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు’అని సంజయ్‌ ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలు మూడో స్థానం కోసమే పోటీ పడుతున్నాయన్నారు. కరీంనగర్‌ అభివృద్ధి కోసం నిధులు తెచ్చి యుద్ధం చేసే బీజేపీకి కత్తి ఇస్తారా? డాంబికాలు చెప్పి మోసం చేసే కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు పట్టం కడతారా? ఆలోచించాలని కోరారు.   

Advertisement
 
Advertisement
Advertisement