కార్యకర్తలపై కోపం ఎందుకు.. ఏదైనా ఉంటే నాపై చర్యలు తీసుకోండి
కాంగ్రెస్ జెండా మోసినవారికి అండగా ఉంటా: కాంగ్రెస్
సీనియర్ నేత జీవన్‌రెడ్డి
జగిత్యాల: ‘నేనేం పాపం చేసిన.. తినే ముందు పల్లెం ఎత్తుకెళ్లారు.. బీఆర్‌ఎస్ కార్యకర్తల కడుపు నింపారు. రాహుల్‌గాంధీ నాయకత్వాన్ని బలపర్చడమే నేను చేసిన తప్పా. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను వదిలి వలసవాదులకు పెద్దపీట వేశారు.. ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘించారు? నాలుగు దశాబ్దాల పాటు క్రమశిక్షణ గల కార్యకర్తగా ఉన్నా’అంటూ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత తాటిపర్తి జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీలకు సంబంధించి ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు పెద్దపీట వేస్తూ అధిష్టానం బీఫామ్‌లు కట్టబెట్టడంతో జీవన్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలే న్యాయ నిర్ణేతలు. జాబితాను కార్యకర్తల అభిప్రాయం మేరకు సర్వే చేపట్టి ఇచ్చాం. అయినా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేను కూర్చోబెట్టుకొని జాబితాను రూపొందించి నిజమైన కార్యకర్తలకు టికెట్లు రాకుండా చేశారు.
పదేళ్లపాటు బీఆర్‌ఎస్ పాలనకు ఎదురీదిన.. ప్రవాహానికి అనుగుణంగా ఉన్నప్పుడు నన్ను తోసేశారు. జాబితాను రూపొందించినా పరిశీలించకుండానే జెండా మోసిన వారిని పక్కనపెట్టారు. జీవితంలో కాంగ్రెస్ జెండా పట్టనోనికి బీఫామ్‌లు కట్టబెట్టారు. నేను చేసిన తప్పేంటి? నిబద్ధత గల నాయకుడిగా కేసీఆర్‌పైనా పోటీచేసిన. గాం«దీభవన్‌లో ఇంటర్నల్ మీటింగ్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వచ్చారని మాట్లాడిన. అందుకు కోపం ఉంటే నాపై చర్యలు తీసుకోవాలి.
కార్యకర్తలపై ఎందుకు ? ఓ ఎమ్మెల్సీ మాట్లాడుతూ పార్టీ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని అన్నారు.. ఎవరు అతిక్రమిస్తున్నారో చెప్పాలి’అని అన్నారు. ఇది పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు, వలసవాదులకు జరుగుతున్న పోటీ అని, తాను జెండా మోసిన వారికే మద్దతిస్తానని తేల్చి చెప్పారు. ప్రజలే న్యాయనిర్ణేతలని వ్యాఖ్యానించారు. ఎవరు కాంగ్రెస్, ఎవరు కాదు అన్నది ప్రజలందరికీ తెలుసన్నారు. జెండా మోసిన వారి కోసం ప్రజల్లోకి వెళ్తానని స్పష్టం చేశారు.


