మార్చిలో దుబాయ్‌ చూపించాలనుకున్నా! | Vijayashanti Reddy husband Surender Reddy with the media | Sakshi
Sakshi News home page

మార్చిలో దుబాయ్‌ చూపించాలనుకున్నా!

Feb 4 2026 4:52 AM | Updated on Feb 4 2026 4:52 AM

Vijayashanti Reddy husband Surender Reddy with the media

ఇంతటి ఘోరం ఎలా జరిగిందో దేవుడికే తెలియాలి

మీడియాతో విజయశాంతి రెడ్డి భర్త సురేందర్‌ రెడ్డి

భువనగిరి(బీబీనగర్‌)/సికింద్రాబాద్‌: ‘మా పిల్లలకు తల్లిమాట వేదవాక్కు. ఆమె ఏది చెప్పినా తప్పకుండా వింటారు. వారిని అంతే ప్రేమగా చూసు కుంటుంది నా భార్య. అందుకే పిల్ల లంటే తల్లికి, తల్లి అంటే పిల్లలకు మహాప్రాణం. ఇటువంటి మా ప్రేమా నురాగాల కుటుంబంలో ఇంతటి ఘోరం ఎలా జరిగింది? దాని వెనుక ఉన్న కారణాలు ఏంటన్నది దేవుడికే తెలియాలి. నా భార్యాపిల్లలను దుబాయ్‌ చూపించేందుకు మార్చి నెలలో తీసుకెళ్లాలని అనుకున్నా..ఇంతలోనే ఘోరం జరిగింది.’అంటూ కన్నీటి పర్యంతమయ్యారు పిన్నింటి సురేందర్‌ రెడ్డి. 

జనవరి 31న మేడ్చల్‌ జిల్లా చర్లపల్లి–ఘట్‌కేసర్‌ మధ్య రైలు మార్గంలో తల్లి విజయశాంతి రెడ్డి, కుమార్తె చేతన, కుమారుడు విశాల్‌ రెడ్డిలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో మృతురాలి భర్త సురేందర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తన పిల్లలు ఇంటర్‌ చదువుతూ హాస్టల్‌లో ఉంటున్నట్లు చెప్పారు. పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే 14 నెలల క్రితం దుబాయ్‌కు వెళ్లినట్లు తెలిపారు. 

జనవరి 27న తన కుమార్తె జేఈఈ మెయిన్‌ పరీక్ష రాసేందుకు వెళ్లినప్పుడు తనతో మాట్లాడిందని, పరీక్ష బాగా రాశానని కచ్చితంగా సీటు వస్తుందని చెప్పిందన్నారు. ఇంతలోనే జనవరి 31వ తేదిన ఉదయం 8.30 గంటల సమయంలో తన బావమరిది ఫోన్‌ చేసి త్వరగా ఇంటికి రావాలని చెప్పడంతో ఎందుకని ప్రశ్నించగా విజయశాంతి మరణించిందని చెప్పాడన్నారు. 

అనంతరం కొద్దిసేపటికి పిల్లలతో కలిసి చనిపోయిందని చెప్పడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యానని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే మధ్యాహ్నం ఫ్లైట్‌ ద్వారా రాత్రి వరకు హైదరాబాద్‌కు చేరుకున్నట్లు చెప్పారు. తనకు ఎవరి మీద అనుమానం లేదని, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు సైతం లేవని, తన కుటుంబ సభ్యులు బంగారం లాంటి వారని ఆయన చెప్పారు.

కారు అప్పగింత.... 
బలవన్మరణానికి ముందు పిల్లలను తీసుకుని చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకోవడానికి విజయశాంతిరెడ్డి వినియోగించిన కారును పోలీసులు మంగళవారం ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటన జరిగిన మరుసటి రోజు కారును చర్లపల్లి నుంచి పోలీసులు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు తీసుకువచ్చారు. విజయశాంతి రెడ్డి తమ్ముడు చిరంజీవి రెడ్డి ఆయన తల్లి ఇరువురు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వచ్చి కారును తీసుకుని వెళ్లిపోయారు.

ఎఫ్‌ఎస్‌ఎల్‌కు సెల్‌ఫోన్‌...
విజయశాంతిరెడ్డి సెల్‌ఫోన్‌ను మంగళవారం సైబర్‌ పోలీసులు ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌కు పంపించారు. సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు ఆమె సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌ను సైబర్‌ పోలీసులకు పంపించగా అది ఓపెన్‌ కాలేదని తెలిసింది. వివరాలు బయటికి తీయడం కోసం ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపినట్టు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement