ఆర్‌బీఐ మానిటరీ పాలసీ.. వడ్డీ రేట్లు యథాతథం? | how RBI MPC expected to repo rate changes this time | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ మానిటరీ పాలసీ.. వడ్డీ రేట్లు యథాతథం?

Feb 5 2026 1:35 PM | Updated on Feb 5 2026 1:40 PM

how RBI MPC expected to repo rate changes this time

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి, మారుతున్న ద్రవ్యోల్బణ గణాంకాలు, దేశీయ బాండ్ మార్కెట్ ఒత్తిళ్ల మధ్య ఆర్‌బీఐ తన ఫిబ్రవరి పాలసీలో వడ్డీ రేట్లను మార్చకపోవచ్చని తెలుస్తోంది. గతేడాది నుంచి దేశీయంగా వడ్డీ రేట్లు తగ్గుతున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులు మరింత అప్రమత్తంగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 4 నుంచి 6 వరకు జరిగే ఆర్‌బీఐ మానిటరీ సమావేశంలోని అంశాలు రేపు ఉదయం వెలువడనున్నాయి.

అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు

గత పాలసీ సమావేశం తర్వాత జరిగిన అతిపెద్ద పరిణామం భారత్-అమెరికా, భారత్-యూరప్‌ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాలు. దీని ఫలితంగా భారతీయ వస్తువులపై సుంకాలు గతంలో ఉన్న 50% నుంచి 18%కి గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం ఆసియా దేశాల్లోనే అతి తక్కువ టారిఫ్ రేట్లు కలిగిన దేశాల్లో ఒకటిగా భారత్ నిలిచింది. ఇది మన ఎగుమతిదారుల పోటీతత్వాన్ని భారీగా పెంచనుంది.

ప్రపంచ ఆర్థిక అనిశ్చితి

అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు ఇంకా సందిగ్ధంలోనే ఉన్నాయి. ‘జియో-ఎకనామిక్స్ స్ట్రెస్ ఇండెక్స్’ ప్రకారం అంతర్జాతీయ అనిశ్చితి పెరిగిన 3-4 నెలల తర్వాత ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం కనిపిస్తుంది. మరోవైపు గత వారం భారీ పతనాన్ని చూసిన లోహాల ధరలు తిరిగి కోలుకోవడం గమనార్హం.

అమెరికా ఫెడ్ రేట్ల కోత సంకేతాలు

అమెరికాలో లేబర్‌ మార్కెట్ మందగించడం, వాస్తవ ఆదాయం స్థిరంగా ఉండటం, ద్రవ్యోల్బణ ప్రభావం తగ్గడంతో.. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది. ఇది ప్రపంచ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది.

రూపాయి ఒడిదుడుకులు

గత రెండు నెలలుగా రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే రూ.89-92 మధ్య ఊగిసలాడుతోంది. ఏప్రిల్ 2025లో అమెరికా సుంకాలను పెంచినప్పటి నుంచి రూపాయి 5.8% మేర క్షీణించింది. అయితే ఇటీవలి భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తర్వాత రూపాయి విలువ కోలుకోవడం సానుకూలాంశం.

ద్రవ్యోల్బణం

ద్రవ్యోల్బణ గణనలో భాగంగా కొత్త సీపీఐ వెయిటేజీలను ప్రవేశపెట్టారు. దీని ప్రకారం సాధారణ సమయంలో ద్రవ్యోల్బణం 20-30 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉండగా.. ఆహార ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్న నెలల్లో మాత్రం కొత్త లెక్కల ప్రకారం సీపీఐ 20-30 బేసిస్‌ పాయింట్లు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.

పైన పేర్కొన్న మిశ్రమ పరిస్థితుల నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని కమిటీ ప్రస్తుతానికి కీలక వడ్డీరేట్ల మార్పులపై వేచి చూసే ధోరణిని అవలంబిస్తుదని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి: వ్యక్తిగత సంపదలో 75 శాతం విరాళం

Advertisement
 
Advertisement
Advertisement