మోటార్ సైకిల్ లేదా కారు కొనే ఎవరైనా ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. అయితే కొన్ని రోజుల తరువాత ఆ వాహనాల మైలేజ్ కొంత తగ్గే సూచనలు కనిపించవచ్చు. దీనికి కారణం ఏమై ఉంటుందా? అని చాలామంది ఆలోచిస్తూ.. తలలు పట్టుకుంటారు. బండి మైలేజ్ ఎందుకు తగ్గుతుంది? ఏం చేస్తే.. మైలేజ్ పెరుగుతుందనే విషయాలు ఈ కథనంలో..
వాహనాల మైలేజ్ తగ్గడానికి కారణాలు
కొత్తగా కొన్న కారు లేదా మోటార్ సైకిల్ మంచి మైలేజ్ అందిస్తుంది. అయితే కొన్ని రోజుల తరువాత మైలేజ్ క్రమంగా తగ్గుతుంది. దీనికి కారణం.. టైర్ ప్రెషర్ తక్కువగా ఉండటం, ఎయిర్ ఫిల్టర్ బ్లాక్ అవ్వడం, స్పార్క్ ప్లగ్ పాడవ్వడం, ఇంజిన్ ఆయిల్, సమయానికి సర్వీసింగ్ చేయించకపోవడం మొదలైనవని తెలుస్తోంది.
అంతే కాకుండా.. అకస్మాత్తుగా బండి వేగం పెంచడం, బ్రేక్ వేయడం, గేర్ సరిగా మార్చకపోవడం, క్లచ్‌ను ఎక్కువగా నొక్కి ఉంచడం, ట్రాఫిక్‌లో ఎక్కువగా ఆగి మళ్లీ స్టార్ట్ చేయడం, వాహనంపై ఎక్కువ బరువు వేసుకోవడం, నాణ్యతలేని పెట్రోల్ / డీజిల్, సరైన రోడ్లు లేకపోవడం వంటి కారణాల వల్ల కూడా.. మైలేజ్ తగ్గవచ్చు.
ఫ్యూయెల్ ఆదా కోసం
రైడింగ్ సమయంలో.. ఒక్కసారిగా వేగం పెంచకుండా.. సాఫ్ట్‌గా యాక్సిలరేట్ చేయాలి.
ఎక్కువ RPMలో రైడ్ చేయడం ఫ్యూయెల్ ఎక్కువగా ఖర్చు చేస్తుంది. కాబట్టి సరైన గేర్ వాడాలి.
అనవసరంగా స్పీడ్ పెంచకూడదు. స్థిరమైన స్పీడ్‌లో బండి నడపాలి.
ఎక్కువ సేపు స్టాప్‌లో ఉంటే (సిగ్నల్ వద్ద) ఇంజిన్ ఆఫ్ చేయండి. ఇలా చేయడం వల్ల కొంత ఫ్యూయెల్ ఆదా అవుతుంది.
టైర్ ప్రెషర్ తక్కువగా ఉంటే.. కూడా మైలేజ్ తగ్గుతుంది. టైర్ ప్రెషర్ చెక్ చేసుకోవడం మంచిది.
ఎయిర్ ఫిల్టర్, స్పార్క్ ప్లగ్ క్లీన్‌గా ఉండేలా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు సర్వీస్ చేయించాలి.
అనవసరంగా ఎక్కువ బరువులు వేయకూడదు. ఎక్కువసేపు క్లచ్ ప్రెస్ చేస్తూ ఉండకూడదు.
ఇదీ చదవండి: ఎయిర్ పొల్యుషన్ ఎఫెక్ట్: BS6 vs BS4 వాహనాల మధ్య తేడా..


